ఏపీలో మహిళా దినోత్సవ కానుకగా కొత్త పథకాలు..వారే అర్హులు!

మహిళా దినోత్సవం సందర్భంగా ఏపీలో డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం రెండు కొత్త పథకాలు ప్రారంభం. విద్య, వివాహానికి రూ.1 లక్ష వరకు తక్కువ వడ్డీ రుణం అందించనుంది.

ఏపీలో మహిళా దినోత్సవ కానుకగా కొత్త పథకాలు..వారే అర్హులు!

అమరావతి : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళా దినోత్సవం (మార్చి 8) సందర్భంగా డ్వాక్రా మహిళల కోసం రెండు కొత్త పథకాలకు శ్రీకారం చుడుతుంది. గ్రామీణ మహిళల విద్య, వివాహ అవసరాలకు బలమైన ఆర్థిక చేయూత అందించేందుకు ఎన్టీఆర్ విద్యాలక్ష్మి, ఎన్టీఆర్ కల్యాణ లక్ష్మి పథకాలను మార్చి 8నుంచి అధికారికంగా ప్రారంభం కానున్నాయి. అదే రోజు ఏపీలో గ్రామ పేదరిక నిర్మూలనా సంస్థ సెర్ప్ (SERP) ఏర్పాటై 25 ఏళ్లు పూర్తికానుండటం గమనార్హం.

ఎన్టీఆర్ విద్యాలక్ష్మి పథకం పేరుతో పిల్లల చదువుకు రూ.10,000 నుంచి రూ.1,00,000 వరకు రుణం అందించనున్నారు. పావలా వడ్డీకే ఈ రుణం అందిస్తారు. రుణాన్ని తిరిగి చెల్లించేందుకు నాలుగేళ్ల వరకు గడువు ఉంటుంది. డ్వాక్రా మహిళ కుటుంబంలోని పిల్లలు ఈ పథకానికి అర్హులు. స్కూల్, కాలేజీలో చేర్పించినప్పటి అడ్మిషన్ డాక్యుమెంట్, ఫీజు కట్టినట్లు రశీదు డాక్యుమెంట్లుగా సమర్పించాలి. ఎన్టీఆర్ విద్యాలక్ష్మి పథకం గరిష్ఠంగా ఇద్దరు పిల్లల వరకు మాత్రమే వర్తిస్తుంది. సభ్యురాలు సంఘంలో చేరి కనీసం ఆరు నెలలై ఉండాలి. ఇప్పటికే రుణం తీసుకుని ఉంటే… వాటిని సక్రమంగా చెల్లించిన వారు ఈ పథకాలకు అర్హులవుతారు.

ఎన్టీఆర్ కల్యాణలక్ష్మి పథకం కింద డ్వాక్రా మహిళల కుమార్తె వివాహానికి రూ.10,000 నుంచి రూ.1,00,000 వరకు రుణం
అందిస్తారు. ఈ రుణం కేవలం 4% పావలా వడ్డీతో అందించనున్నారు. గరిష్టంగా 48 వాయిదాలలో చెల్లించాల్సి ఉంటుంది. పెళ్లి శుభలేఖ, ఖర్చు అంచనా వివరాలు సమర్పించాల్సి ఉంటుంది. ఈ డాక్యుమెంట్లను సంబంధిత అధికారులు పరిశీలిస్తారు. రుణం మొత్తాన్ని లబ్ధిదారుల ఖాతాల్లో 48 గంటల్లోనే జమ చేస్తారు.

యానిమేటర్లకు ఉచిత స్మార్ట్‌ఫోన్లు

అలాగే డ్వాక్రా సంఘాల నిర్వహణ, రికార్డులు, బుక్ కీపింగ్ సులభం చేయడానికి కొత్తగా 27,500 యానిమేటర్లకు, 5,000 సీసీలకు 15వేల విలువైన ఉచిత స్మార్ట్‌ఫోన్లు, 600 ఏపీఎంలకు ల్యాప్‌టాప్‌లు అందచేస్తారు. ఎన్టీఆర్ విద్యాలక్ష్మి, కల్యాణ లక్ష్మి పథకాల కోసం ఏడాదికి రూ.2,000 కోట్ల నిధులు కేటాయించనున్నారు.

ఎన్నికల్లో టీడీపీ మహిళలకు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలలో ఇప్పటికే స్త్రీశక్తి పథకం కింద ఉచిత బస్సు ప్రయాణం అందిస్తున్నారు. ఇప్పుడు ఎన్టీఆర్ విద్యాలక్ష్మి, ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి పథకాలను అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇక మహిళలకు రూ. 1500 ఇచ్చే ఆడబిడ్డ నిధి పథకం అమలు మిగిలి ఉండనుంది.

ఇవి కూడా చదవండి :

కేటీఆర్ మూటల మాటలకు బల్మూరి, చామల కౌంటర్
Harish Shankar | ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ రీమేక్ కాదంటూ హరీష్ శంకర్ క్లారిటీ.. రూమర్లపై ఘాటైన సమాధానం