సీట్ల పెంపుతో దక్షిణాది రాష్టాల వాట పదిలం : ఎంపీ లక్ష్మణ్

పార్లమెంట్‌లో ప్రస్తుతం దక్షిణాది రాష్ట్రాల వాటా 24 శాతంగా ఉంది.. నియోజకవర్గాల పెంపు తర్వాత కూడా 24 శాతం ఉంటుందని బీజేపీ రాజ్యసభ సభ్యులు కే.లక్ష్మణ్ స్పష్టం చేశారు. యూపీ, తెలంగాణ అన్ని రాష్ట్రాలను బీజేపీ సమంగా చూస్తుంది అన్నారు.

సీట్ల పెంపుతో దక్షిణాది రాష్టాల వాట పదిలం : ఎంపీ లక్ష్మణ్

విధాత, హైదరాబాద్ : పార్లమెంట్‌లో ప్రస్తుతం దక్షిణాది రాష్ట్రాల వాటా 24 శాతంగా ఉంది.. నియోజకవర్గాల పెంపు తర్వాత కూడా 24 శాతం ఉంటుందని బీజేపీ రాజ్యసభ సభ్యులు కే.లక్ష్మణ్ స్పష్టం చేశారు. యూపీ, తెలంగాణ అన్ని రాష్ట్రాలను బీజేపీ సమంగా చూస్తుంది. నేను తెలంగాణ వాడిగా రాష్ట్రం కోసం దేశం కోసం పనిచేస్తా అని లక్ష్మణ్‌ తెలిపారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ జనాభాతో సంబంధం లేకుండా నియోజకవర్గాల పెంపు జరుగుతుందన్నారు. దక్షిణాది రాష్ట్రాలకు నష్టం జరగకుండా ప్రస్తుతం ఉన్న సీట్ల నిష్పత్తికి అనుగుణంగానే సీట్ల పెంపు జరుగుతుందని లక్ష్మణ్‌ తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి 543 సీట్లతోనే మహిళా రిజర్వేషన్లను పెంచమనడం అంటే ఎస్సీ, ఎస్టీ మహిళలకు నష్టం చేయాలనే కుట్రేనని అన్నారు. . మోదీకి పెరుగుతున్న ఆదరణను సీఎం రేవంత్ రెడ్డి జీర్ణించుకోలేకపోతున్నారని, అందుకే డిలిమిటేషన్‌, మహిళా రిజర్వేషన్ల పట్ల రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటనలు చేస్తున్నారని విమర్శించారు.

అది కాంగ్రెస్ విధానామా ?

జీఎస్డీపీ ప్రకారం డీలిమిటేషన్‌ చేయాలన్నది కాంగ్రెస్‌ విధానమా? అనేది స్పష్టం చేయాలని లక్ష్మణ్ డిమాండ్ చేశారు. అలా అయితే, జీడీపీలో మహారాష్ట్ర, గుజరాత్‌ ముందున్నాయని, రేవంత్‌రెడ్డి తెలంగాణ వ్యతిరేక ప్రతిపాదనలు చేస్తున్నారని, అలాంటి వాటిని వెనక్కి తీసుకోవాలని హితవు పలికారు. రేవంత్ తన ప్రతిపాదనలతో ఎస్సీ,ఎస్టీ వాటా అడ్డుకోవడానికి, మహిళల అవకాశాలను దెబ్బతీయడానికి కుట్ర పన్నుతున్నారా? అని ప్రశ్నించారు. డబ్బున్న వాళ్లకి ఓటు విలువ ఎక్కువ అనేలా రేవంత్‌ చేసిన ప్రతిపాదన హాస్యాస్పదంగా ఉందన్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిని ఎవరిని అడిగి పెంచారో ముందు రేవంత్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

ఖర్గే సీటుకు రేవంత్ టార్గెట్ : ఏలేటి

జనాభా ప్రకారమైతే దక్షిణాదికి అన్యాయం జరుగుతుందనే అన్ని రాష్ట్రాల్లో 50 శాతం పెంపు విధానం తెచ్చారని తెలంగాణ బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి తెలిపారు. డీలిమిటేషన్‌, మహిళా రిజర్వేషన్లపై ఆయన మీడియాతో మాట్లాడారు. జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్‌ జరగాలని కాంగ్రెస్‌ ప్రభుత్వమే చట్టాలు చేసిందన్నారు. 1972లో కాంగ్రెస్‌ చేసిన డీలిమిటేషన్‌ వల్ల ఏపీకి ఒక లోక్‌సభ సీటు తగ్గిందన్నారు. ఆనాడు కాంగ్రెస్ చేసిన పొరపాట్ల వల్లే దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరిగిందని ఆయన మండిపడ్డారు. ప్రస్తుతం లోక్‌సభలో దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం కేవలం 24 శాతానికే పరిమితమైందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రేవంత్ చెప్పినట్లుగా ప్రస్తుత సీట్ల ప్రకారం మహిళా రిజర్వేషన్లు అమలు చేస్తే మహిళలకు 170 సీట్లు మాత్రమే వచ్చే అవకాశం ఉందని… సీట్లు పెంచి మహిళా రిజర్వేషన్లు అమలు చేస్తే 270కిపైగా సీట్లు వస్తాయని గుర్తు చేశారు.

రేవంత్ రెడ్డి చెప్పిన హైబ్రిడ్‌ పాలసీ ప్రపంచంలో ఎక్కడాలేని విధంగా ఉందని సెటైర్లు వేశారు. దీన్ని తాను ‘గాంధీ డీలిమిటేషన్ ప్రాసెస్ (GDP) అని పిలుస్తానని ఎద్దేవా చేశారు. సీఎం రేవంత్ దృష్టి అంతా ఇప్పుడు ఖర్గే సీటుపై ఉందని, ఖర్గే తర్వాత ఎలాగైనా ఏఐసీసీ అధ్యక్ష పదవిని దక్కించుకోవాలనే ప్లాన్‌తోనే రేవంత్ రెడ్డి ఇలాంటి వింతైన ప్రతిపాదనలు తెరపైకి తెస్తున్నారని ఏలేటి ఆరోపించారు.

అలాగైతే హైదరాబాద్ లోనే సీట్ల పెంపు : రామంచంద్ర రావు

నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియలో దక్షిణ రాష్ట్రాలకు కేటాయించే సీట్ల సంఖ్య తగ్గేందుకు అస్సలు ఆస్కారం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచంద్రరావు స్పష్టం చేశారు. అన్ని ప్రాంతాలకు న్యాయబద్ధంగా, సమానంగా ప్రాతినిధ్యం పెరుగుతుంది అని ఆయన తెలిపారు. ఈ ప్రక్రియ కేవలం జనాభా గణాంకాల ఆధారంగా కాకుండా, సమతుల్య విధానంతో అమలు చేయబడుతుందని ఆయన తెలిపారు. కేవలం జనాభా ఆధారంగానే జరిగితే, దక్షిణ రాష్ట్రాలకు వచ్చే సీట్ల సంఖ్య గణనీయంగా తగ్గిపోతుందన్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపాదించిన జీడీపీ మోడల్ సీట్ల పెంపు హస్యాస్పదం అని, అలాగైతే తెలంగాణలో కేవలం హైదరాబాద్ పరిధిలోనే సీట్లు పెరుగుతాయని విమర్శించారు.