గ్రామీణ ప్రాంతాలలో ప్రభుత్వ పాఠశాలల పరిస్థితికి ఓ పాఠశాల నిలువెత్తు నిదర్శనంగా కనిపిస్తుంది. వరంగల్ జిల్లా కోనాపురం ప్రాథమిక పాఠశాలలో ఒకే ఒక్క ఉపాధ్యాయుడు, ఒకే విద్యార్థి ఉండటం వార్తల్లోకి ఎక్కింది. రెండో తరగతి చదువుతున్న ఈరెల్లి విక్కీపాల్ అనే బాలుడి కోసం టీచర్ జగన్మోహన్‌రావు విధులకు హాజరవుతున్నారు. విక్కీ పాల్ కోసం ఒక ఉపాధ్యాయుడు, మధ్యాహ్న భోజనం వండే వంట మనిషి, పాఠశాల నిర్వహణకు మరో సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు.
ఆ చిన్నారి కోసమే రోజూ మధ్యాహ్న భోజనం వండుతున్నారు. కోనాపురం గ్రామాన్ని వర్ధన్నపేట మున్సిపాలిటీలో కలపడంతో ఇక్కడి 19 మంది విద్యార్థులు మున్సిపల్ స్కూల్‌కు మారారు. దీంతో కోనాపురం ప్రాథమిక పాఠశాలలో ఒక్క ఉపాధ్యాయుడు, ఒకే విద్యార్థి ఉండాల్సిన అరుదైన పరిస్థితి ఏర్పడింది. గ్రామంలోని చాలా కుటుంబాలు ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వలస వెళ్లడం, అలాగే మిగిలిన గ్రామస్థులు తమ పిల్లలను వర్ధన్నపేట లేదా వరంగల్‌లోని ప్రైవేట్ ఇంగ్లీష్ మీడియం స్కూళ్లకు పంపించడం వల్ల ఈ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పూర్తిగా తగ్గిపోయింది.
ప్రభుత్వ నిబంధనల ప్రకారం స్కూల్లో ఒక్క విద్యార్థి ఉన్నా బడిని మూసివేయకూడదు. ఆ పిల్లాడి భవిష్యత్తు కోసం ప్రభుత్వం నెలకు దాదాపు లక్ష రూపాయల వరకు ఖర్చు చేస్తూ ఈ స్కూల్‌ను నడిపిస్తోంది. ఒకవేళ ఆ విద్యార్థి గనుక రాకపోతే ఉపాధ్యాయుడి ఉద్యోగానికి ఇబ్బంది వచ్చే అవకాశం ఉండటంతో, టీచర్ స్వయంగా పిల్లాడి ఇంటికి వెళ్లి మరీ బడికి తీసుకువస్తున్నారు. ఈ అరుదైన గురు-శిష్యుల బంధం ప్రస్తుతం సామాజిక మాధ్యమాలలో బాగా వైరల్ అవుతోంది.
నాగర్ కర్నూల్ జిల్లా ఉప్పునుంతల మండలంలోని రాయిచేడ్ ప్రభుత్వ పాఠశాలలో సైతం ఇద్దరు ఉపాధ్యాయులు పని చేస్తుండగా రికార్డుల్లో కేవలం ఒక్క విద్యార్థి మాత్రమే ఉండడం గమనార్హం. టీచర్లు సకాలంలో పాఠశాలకు రాకపోవడంతో ఉన్న ఒక్క విద్యార్థి కూడా బడికి రావడం మానేశాడని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. గతేడాది నలుగురుగా ఉన్న విద్యార్థుల సంఖ్య ఈ ఏడాది ఒకటికి పడిపోవడం గమనార్హం. గ్రామాల్లోని బడి ఈడు పిల్లలందరినీ ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని ప్రభుత్వం ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమం ద్వారా చేసిన ప్రయత్నాలు వైఫల్యానికి ఈ ఘటనలు నిదర్శనంగా కనిపిస్తున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
ఓ వైపు ప్రభుత్వ పాఠశాలల కుదింపుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుంటే..అందుకు అనుకూలంగా ఇలాంటి పాఠశాలల ఉదంతాలు నిలుస్తున్నాయి. ఉపాధ్యాయులు, గ్రామస్తులు, విద్యాశాఖ అధికారులు మేల్కొని ప్రభుత్వం బడులను కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
వరంగల్: ఒక్కడే విద్యార్థి.. ఒక్కరే టీచర్..! pic.twitter.com/T4REqEC1r0
— peddireddi95 (@peddireddi60024) July 18, 2026