నీటి భద్రత కోసం జలధార యాక్షన్ ప్లాన్ : సీఎం చంద్రబాబు
ఏపీ రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టుల పురోగతిపై క్యాంపు కార్యాలయంలో జల వనరుల శాఖ అధికారులతో బుధవారం సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. పోలవరం ప్రాజెక్టు పనులతో పాటు...వెలిగొండ, హంద్రీనీవా సుజల స్రవంతి, పోలవరం- నల్లమల సాగర్ లింక్, చింతలపూడి ఎత్తిపోతల పథకం, వరికెపూడిశిల, ఉత్తరాంధ్ర ప్రాజెక్టుల పనుల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు.
అమరావతి : పోలవరం ప్రాజెక్టు పూర్తి కాగానే గోదావరి జలాలను కుడి, ఎడమ కాలువల ద్వారా తరలించి వాటిని ఏయే అవసరాలకు, ఎంత మేర వినియోగించుకోవాలనే దానిపై ఓ నిర్దిష్టమైన యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. కుడి, ఎడమ ప్రధాన కాలువలకు అనుసంధానంగా ఉన్న రిజర్వాయర్లు, చెరువులు నింపేలా ప్రణాళిక చేయాలని సీఎం సూచించారు. రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టుల పురోగతిపై క్యాంపు కార్యాలయంలో జల వనరుల శాఖ అధికారులతో బుధవారం సమీక్ష నిర్వహించారు. పోలవరం ప్రాజెక్టు పనులతో పాటు…వెలిగొండ, హంద్రీనీవా సుజల స్రవంతి, పోలవరం- నల్లమల సాగర్ లింక్, చింతలపూడి ఎత్తిపోతల పథకం, వరికెపూడిశిల, ఉత్తరాంధ్ర ప్రాజెక్టుల పనుల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రంలో భూగర్భజలాల పెంపు, జల ధార, జల హారతి కార్యక్రమాలపైనా సమీక్షించారు. ఉత్తరాంధ్ర ప్రాజెక్టులైన తారక రామ, మహేంద్ర తనయ, తోటపల్లి బ్యారేజ్, మద్దువలస, జంఝావతి, హీరమండలం లిఫ్ట్ పనుల్లో వేగం పెంచాలని సీఎం సూచించారు. డిసెంబర్ నాటికి వంశధార-నాగావళి అనుసంధానం, జూలై నాటికి నాగావళి-చంపావతి అనుసంధానం పూర్తి చేయాలన్నారు. శ్రీకాకుళం జిల్లా వంశధార నదిపై నిర్మించ తలపెట్టిన ప్రతిష్టాత్మక ప్రాజెక్టు నేరడి బ్యారేజ్‌కు అడ్డంకులు తొలగడంతో త్వరితగతిన టెండర్లు పిలవాలని స్పష్టం చేశారు.
పర్యాటక కేంద్రంగా పోలవరం ప్రాజెక్టు
పోలవరం ప్రాజెక్టును ప్రముఖ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని… హోటల్స్, షాపింగ్ ఏరియా ఉండాలని సీఎం అన్నారు. ప్రాజెక్టు సమీప ప్రాంతాల సుందరీకరణకు సంబంధించిన డిజైన్లను సీఎం పరిశీలించారు. పోలవరం-పాపికొండలు-భద్రాచలం వరకు బోటింగ్ సౌకర్యం కల్పించేలా ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. వాటర్, రాక్, ఫారెస్ట్, స్పోర్ట్స్ థీమ్‌తో పర్యాటకుల్ని ఆకట్టుకోవాలని సూచించారు. గోదావరి పుష్కరాల నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి ప్రారంభించేలా పనుల్లో వేగం పెంచాలని అధికారులను సీఎం ఆదేశించారు. ప్రాజెక్టులో భాగమైన ఈసీఆర్ఎఫ్ డ్యామ్ గ్యాప్ 1, 2 పనులను వచ్చే ఏడాది మార్చి లోగా పూర్తి చేయాలని నిర్దేశించారు. ట్విన్ టన్నెల్స్ లైనింగ్ పనులు 77 శాతం, అప్రోచ్ చానల్ ఎర్త్ వర్క్ పనులు 98 శాతం, హెడ్ రెగ్యులేటర్ కాంక్రీట్ పనులు 71 శాతం, ఇరిగేషన్ టన్నెల్ తవ్వకాలు పూర్తి అయ్యాయని, లైనింగ్ 76 శాతం పూర్తి చేసినట్టు అధికారులు తెలిపారు. కేఎల్ బండ్ ఎర్త్ వర్క్, ఎంబార్క్‌మెంట్ రెండూ 89 శాతం మేర పూర్తి అయ్యిందని.. ఏడాది జూన్ కల్లా అన్ని పనులు పూర్తి చేస్తామని వివరించారు. ఆర్ అండ్ ఆర్ కి సంబంధించి 95 కాలనీలకు గాను 26 పూర్తి అయ్యాయని, మిగిలిన వాటిలో 49 కాలనీలు ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి, మరో 20 కాలనీలు 2027 ఏప్రిల్ నాటికి పూర్తి కానున్నాయని చెప్పారు. తొలిదశలో 38,060 నిర్వాసిత కుటుంబాలకు గాను, ఇప్పటివరకు 16,763 కుటుంబాలను తరలించినట్టు అధికారులు వివరించారు. ఈ ఏడాది ఆగస్ట్ నాటికి 8,518 కుటుంబాలు, 2027 మార్చి నాటికి 12,779 కుటుంబాల తరలింపు పూర్తి కావాలని సీఎం సూచించారు. ఇప్పటివరకు పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి రూ.27,089 కోట్లు వ్యయం కాగా, మరో రూ.5,108 కోట్లతో సివిల్, ఆర్ అండ్ ఆర్ పనులు పూర్తి కానున్నాయి.
శరవేగంగా వెలిగొండ స్టేజ్ 1 పనులు
వెలిగొండ స్టేజ్ 1కు సంబంధించి హెడ్ రెగ్యులేటర్ కాంక్రీట్ పనులు 74 శాతం, టన్నెల్ 2 బెంచింగ్ 94 శాతం, లైనింగ్ 66 శాతం, ఫీడర్ కెనాల్ రిటైనింగ్ వాల్ కాంక్రీట్ 84 శాతం, లైనింగ్ 8 శాతం పూర్తయ్యాయి. తీగ లేరు కెనాల్ హెడ్ రెగ్యులేటర్ గేట్లు, ఈస్ట్రన్ మెయిన్ కెనాల్ హెడ్ రెగ్యులేటర్, డైవర్సన్ రోడ్ పనులు పురోగతిలో ఉన్నాయి. మొత్తం వెలిగొండ పనులు జూన్ చివరి కల్లా పూర్తి చేయాలని లక్ష్యం కాగా, దీనికి రూ.2,042 కోట్లు వ్యయం కానుంది. మల్యాల ఎత్తిపోతల ద్వారా 52 టీఎంసీల శ్రీశైలం బ్యాక్ వాటర్‌ను ఇప్పటివరకు రాయలసీమకు తరలించినట్టు అధికారులు సీఎంకు తెలిపారు. హంద్రీ నీవా ఫేజ్ 1 కెనాల్ విస్తరణ పనులు 92 శాతం పూర్తికాగా, ఫేజ్ 2 లింకింగ్ కుప్పం, పుంగనూరు కెనాల్స్ 85 శాతం పూర్తయ్యాయి. 618 మైనర్ ఇరిగేషన్ ట్యాంకులకు గాను 432 ట్యాంకులను పూర్తిగా నింపగా, 98 ట్యాంకులు పాక్షికంగా నింపినట్టు వివరించారు. మెయిన్ కెనాల్ బ్యాలెన్స్ వర్క్స్ 400.50 కి.మీ నుంచి 490 కి.మీ వరకు ఉంది. వీటి కోసం రూ.577.77 కోట్లు అవసరం కాగా, 490 కి.మీ. నుంచి 554.17 కి.మీ. నీవా బ్రాంచ్ కెనాల్ పనులకు 310.44 కోట్లు అవసరం కానున్నాయి. నీవా బ్రాంచ్ కెనాల్ నుంచి హంద్రీనీవా సుజల స్రవంతి ద్వారా రూ.126.06 కోట్లతో మూల పల్లి ట్యాంక్‌తో పాటు మరో 4 ట్యంకులు, కళ్యాణి డ్యామ్‌కు నీటిని తరలించాల్సి ఉంది. దీనికీ ఏజెన్సీతో ఒప్పందం పూర్తయిందని అధికారులు వివరించారు.
పోలవరం – నల్లమల సాగర్ లింక్
200 టీఎంసీల గోదావరి వరద నీటిని బొల్లాపల్లి రిజర్వాయర్, నల్లమల సాగర్‌కు తరలించేందుకు రూ.58,700 కోట్లు ఖర్చు కానుందని, దీనికి సంబంధించి సీడబ్ల్యూసీ నుంచి డీపీఆర్ కు అక్టోబర్ 31 కల్లా ఆమోదం లభిస్తుందని అధికారులు తెలిపారు. అటవీ, పర్యావరణ అనుమతులు ఆర్ అండ్ ఆర్ క్లియరెన్స్ సెప్టెంబర్ 30కి పూర్తి కానున్నాయని ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు. చింతలపూడి లిఫ్ట్‌కు పర్యావరణ అనుమతులు వచ్చాయని, ఈ ప్రాజెక్టుకు రూ.8,075 కోట్ల వ్యయం కానుందని అంచనాలను అధికారులు ముఖ్యమంత్రి ముందుంచారు. ప్రాజెక్టు ప్రధాన కాలువ పనులు చేప్టటి, 2027 జూన్‌కు పూర్తి చేయాల్సి ఉండగా, దీనికి రూ.2,042 కోట్లు అవసరం కానున్నాయి. ప్రధాన కాలువకు అవసరమైన 910 ఎకరాల భూసేకరణకు ప్రభుత్వం రూ.152 కోట్లను కేటాయించింది. అటు వరికెపుడిశెల ఎత్తిపోతల పథకానికి రూ.3,278 కోట్లు ఖర్చు కానుందని, దీని ద్వారా 84,500 ఎకరాలకు సాగునీరు అందించవచ్చని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు.
పెరిగిన భూగర్భ జలాలు
ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు చేపట్టిన చర్యలతో రాష్ట్రంలో భూగర్భ జలాలు పెరిగాయి. ఏప్రిల్ 1 నాటికి భూగర్భ జలాలు 625 టీఎంసీల అందుబాటులో ఉన్నాయి. గత ఏడాది కంటే ఈ ఏడాది 12 టీఎంసీల నీరు అదనంగా ఉంది. మొత్తంగా 5,697 గ్రామాల్లో 8 మీటర్‌లకు పైగా భూగర్భ జలాలు అందుబాటులో ఉన్నాయి. గ్రౌండ్ వాటర్ 2025 ఏప్రిల్‌కు ఏపీలో 9.47 మీటర్లు ఉండగా కోస్తాంధ్రలో 8.88 మీటర్లు, సీమలో 10.94 మీటర్లు ఉన్నాయి. ఈ ఏడాది ఏప్రిల్‌కు ఆంధ్రప్రదేశ్‌లో 8.68 శాతం ఉండగా, కోస్తాంధ్రలో 8.39 మీటర్లు, రాయలసీమలో 9.41 మీటర్లు ఉన్నాయి. మొత్తంగా గత ఏడాదితో ఏప్రిల్‌తో పోలిస్తే ఈ ఏప్రిల్ నాటికి 0.79 మీటర్ల మేరకు భూగర్భ జలాలు పెరిగాయి. రాష్ట్రంలో జలధార – జల హారతి 100 రోజుల యాక్షన్ ప్లాన్‌లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 13,138 గ్రామాల్లో లక్ష్యం నిర్దేశించుకోగా… 2,664 గ్రామాల్లో కార్యాచరణ సిద్ధం చేశారు. ఈ గ్రామాల్లో చేపట్టాల్సిన 3,591 పనులను గుర్తించారు. రాష్ట్రంలో మొత్తం 1,002 లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలకు గాను…గత ప్రభుత్వంలో నిర్వహణ లేని కారణంగా 244 పథకాలు పూర్తిగా నిర్వీర్యం అయ్యాయని, మిగిలిన 758 ఎత్తిపోతల పథకాలను థర్డ్ పార్టీ ద్వారా 5 ఏళ్ల పాటు నిర్వహించడానికి రూ.1637.66 కోట్లు ఖర్చు కానుందని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. దీనికి సంబంధించి త్వరలోనే టెండర్లు పిలవాలని సీఎం ఆదేశించారు. ఈ సమీక్షలో మంత్రి నిమ్మల రామానాయుడు, సీఎస్ సాయి ప్రసాద్, జల వనరుల శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram