సీఎం, పీసీసీ చీఫ్ తో మీనాక్షి కీలక సమీక్ష!

ప్రభుత్వం..పార్టీ పనితీరుపై సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ బి.మహేశ్ కుమార్ గౌడ్ లతో తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ చార్జ్ మీనాక్షి నటరాజన్ సమీక్షించారు. బుధవారం మూడు గంటలకు పైగా వారు సుదీర్ఘ సమీక్ష చేశారు.

సీఎం, పీసీసీ చీఫ్ తో మీనాక్షి కీలక సమీక్ష!

విధాత, హైదరాబాద్ : ప్రభుత్వం..పార్టీ పనితీరుపై సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ బి.మహేశ్ కుమార్ గౌడ్ లతో తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ చార్జ్ మీనాక్షి నటరాజన్ సమీక్షా సమావేశం నిర్వహించారు. బుధవారం మూడు గంటలకు పైగా వారు సుదీర్ఘ సమీక్ష చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీల అమలులో ప్రభుత్వం సాధించిన పురోగతి, మంత్రుల పనితీరు, వారిపై ఇటీవల వరుసగా వచ్చిన అవినీతి ఆరోపణలు, ఎమ్మెల్యేల అసంతృప్తి, జీవన్ రెడ్డి రాజీనామా పరిణామాలు-ప్రభావం, నామినేటెడ్ పోస్టుల భర్తీ, టీపీసీపీ కమిటీ కూర్పుపై వంటి అంశాలపై వారు చర్చించారు. డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్లతో పార్టీపై పడనున్న ప్రభావం, రాష్ట్రంలోని రాజకీయ పరిణామాలు, జీహెచ్ఎంసీ మూడు కార్పోరేషన్ల ఎన్నికలకు సన్నద్దం, పార్టీ కార్యక్రమాల అమలుపై కూడా వారు చర్చించినట్లుగా తెలుస్తుంది. పార్టీ బలోపేతంపైన, జిల్లా స్థాయి పదవుల భర్తీ కసరత్తుపై ఫోకస్ చేయాలని నిర్ణయించినట్లుగా సమాచారం.

నామినేటెడ్ పోస్టుల భర్తీకి సీఎం రేవంత్ గ్రీన్ సిగ్నల్…

పార్టీ ఇన్ చార్జీ మీనాక్షి నటరాజన్ తో భేటీ సందర్బంగా ప్రభుత్వంలోని నామినేటెడ్ పోస్టుల భర్తీకి సీఎం రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా సమాచారం. సామాజిక సమీకరణాలకు పెద్దపీట వేస్తూ… కష్టపడ్డ వారికే పదవులు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారని, మరో 2-3 రోజుల్లో నామినేటెడ్ పోస్టుల భర్తీపై జీవోలు వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది.

ఢిల్లీకీ సీఎం రేవంత్ రెడ్డి

ఈ సమీక్షా సమావేశం అనంరం సీఎం రేవంత్ రెడ్డి మరోసారి( 68వ సారి) ఢిల్లీకి వెళ్లనున్నారు. డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ల  అంశంపై ఇండియా కూటమి నేతల భేటీకి ఆయన హాజరుకానున్నారు.

ఈ నెల 20న భూపాలపల్లి జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన

సీఎం రేవంత్ రెడ్డి ఈ నెల 20న భూపాలపల్లి జిల్లాలో పర్యటించనున్నారు. మేడిగడ్డ బ్యారేజీని సందర్శించి, మేడిగడ్డ వద్ద కొనసాగుతున్న జియో ఫిజికల్ పరీక్షల పరిశీలించి.. పునరుద్ధరణ పనులపై క్షేత్రస్థాయి పరిశీలన చేయనున్నారు. కాళేశ్వరంలో ‘సరస్వతి అంత్య పుష్కరాల’పై సీఎం సమీక్షిస్తారు.