సమాజంలో రోజురోజుకు మనిషన్న వాడు మాయమవుతున్నాడు. మానవత్వం మచ్చుకైనా కానరాని దిశగా మనుషులు పతనమవుతున్నారు. 18రోజుల పసికందును కన్న తండ్రినే నేలకేసి కొట్టి చంపాడు. ఈ అమానవీయ దారుణ ఘటన సంగారెడ్డి జిల్లా జోగిపేటలో చోటు చేసుకుంది. సీఐ అనిల్ కుమార్ వెల్లడించిన వివరాల మేరకు.. జోగిపేట పట్టణానికి చెందిన కృష్ణ, గౌరమ్మ దంపతులు.. పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహం చేసుకున్నారు. గత కొన్ని రోజులుగా వీరి మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి.
శనివారం కూడా తన భార్యతో గొడవపడిన కృష్ణ.. తల్లి వద్ద పాలు తాగుతున్న బిడ్డను లాక్కొని.. చిన్నారి చెంపలపై కొట్టాడు. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేస్తానని హెచ్చరించింది. కోపోద్రిక్తుడైన కృష్ణ.. చేతిలో ఉన్న పసికందును నేలకేసి కొట్టాడు. గౌరమ్మ గట్టిగా కేకలు వేయడంతో అక్కడి నుంచి పారిపోయాడు. ప్రాణాలతో కొట్టిమిట్టాడుతున్న పసికందును జోగిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందాడు. కృష్ణను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.