పటాన్‌చెరు, రామంతాపూర్ లో హైడ్రా దూకుడు

హైదరాబాద్‌లోని రామంతాపూర్ పెద్ద చెరువు పునరుద్ధరణ పనులకు హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ భూమిపూజ చేసి శ్రీకారం చుట్టారు. సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు పట్టణంలో హైడ్రా TGSILAకు చెందిన 1599 గజాల స్థలానికి కంచె ఏర్పాటు చేసింది.

Reported by: Y.V. Narsimha Reddy | తెలంగాణ‌ | Jun 19, 2026, 12:00 pm IST
Read Time: 3 mins
పటాన్‌చెరు, రామంతాపూర్ లో హైడ్రా దూకుడు

విధాత, హైదరాబాద్: సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు పట్టణంలో హైడ్రా TGSILAకు చెందిన 1599 గజాల స్థలానికి కంచె ఏర్పాటు చేసింది. స్థలంలో అక్రమంగా నిర్మిస్తున్న ప్రహరీ గోడ పనులను అధికారులు నిలిపివేశారు. కన్యకా పరమేశ్వరి ఆలయం చుట్టూ హైడ్రా సిబ్బంది కంచె నిర్మాణ పనులు కొనసాగిస్తున్నారు.

రామాంతాపూర్ చెరువు పున‌రుద్ధ‌ర‌ణ‌కు శ్రీ‌కారం

హైదరాబాద్‌లోని రామంతాపూర్ పెద్ద చెరువు పునరుద్ధరణ పనులకు హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ భూమిపూజ చేసి శ్రీకారం చుట్టారు. చెరువుల ప‌రిరక్ష‌ణ‌తో పాటు.. పున‌రుద్ధ‌ర‌ణ‌కు పెద్ద పీట వేస్తున్న హైడ్రా మొద‌టి విడ‌త‌లో 6 చెరువుల‌ను పూర్తి చేసిన విష‌యం విధిత‌మే. రెండో విడ‌త‌గా మ‌రో 14 చెరువుల‌ను హైడ్రా పున‌రుద్ధ‌రిస్తోంది. రెండోవిడ‌తలో భాగ‌మైన‌ రామంతాపూర్ పెద్ద చెరువు ఎప్‌టీఎల్ విస్తీర్ణం 30 ఎక‌రాలు కాగా.. 16 ఎక‌రాల వ‌ర‌కూ క‌బ్జాకు గురైంది. ఇందులో 12 ఎక‌రాల్లో శాశ్వ‌త క‌ట్ట‌డాలు వ‌చ్చేశాయి. వీటి జోలికి హైడ్రా వెళ్ల‌లేదు. మ‌రో 4 ఎక‌రాల మేర తాత్కాలిక షెడ్డులు, గుడిసెలున్నాయి. వీటిని ఖాళీ చేయించి చెరువు పున‌రుద్ధ‌ర‌ణ‌కు 18 ఎక‌రాల‌కు పైగా భూమిని హైడ్రా అందుబాటులోకి తెచ్చింది. రూ.19 కోట్ల వ్యయంతో చేపడుతున్న ఈ రామంతాపూర్ పెద్ద చెరువు పునరుద్దరణ ప్రాజెక్ట్ వల్ల వరద ముప్పు తగ్గడంతో పాటు భూగర్భ జలాలు, పర్యావరణ సమతుల్యత మెరుగుపడనున్నాయి. చెరువు పరిరక్షణలో భాగంగా 36 గుడిసె కుటుంబాలకు డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు కేటాయించి, వారి సహకారంతో 18 ఎకరాలకు పైగా భూమిని పునరుద్ధరణ కోసం అందుబాటులోకి తీసుకొచ్చినట్లు హైడ్రా వెల్లడించింది.