Voter List Shrink 6% After SIR In Bihar | ఎస్ఐఆర్ తర్వాత బీహార్‌లో ఆరు శాతం తగ్గిన ఓటర్లు

బీహార్ ఎస్ఐఆర్ తర్వాత తుది ఓటర్ల జాబితాలో 6% ఓటర్లు తగ్గారు, కొత్త సంఖ్య 7.42 కోట్ల మంది.

Voter List Shrink 6% After SIR In Bihar | ఎస్ఐఆర్ తర్వాత బీహార్‌లో ఆరు శాతం తగ్గిన ఓటర్లు

బీహార్ తుది ఓటర్ల జాబితాలో ఆరు శాతం ఓటర్లు తగ్గారు. ప్రత్యేక ఇంటెన్సివ్ సవరణ (ఎస్ఐఆర్) తర్వాత సెప్టెంబర్ 30న భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) తుది ఓటర్ జాబితాను విడుదల చేసింది. బీహార్ లో ఈ ఏడాదిలో జూన్ లో ఎస్ఐఆర్ ప్రారంభమైంది. దీనిపై విపక్ష పార్టీలు అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. ఈసీపై విమర్శలు చేశాయి. ఎస్ఐఆర్ పై కోర్టులో పిటిషన్లు కూడా దాఖలయ్యాయి.

బీహార్‌లో మొత్తం ఓటర్లు ఎంత మంది?

ఈ ఏడాది జూన్ 24 నాటికి బీహార్ లో 7.90 కోట్ల మంది ఓటర్లున్నారు. తాజాగా సెప్టెంబర్ 30న విడుదల చేసిన ఓటర్ల జాబితాలో 47 లక్షల మంది ఓటర్లు తగ్గారు. దీంతో తుది ఓటర్ల జాబితాలో 7.42 కోట్ల మంది మాత్రమే ఉన్నారు. అయితే ఆగస్టు 1న జారీ చేసిన ముసాయిదా జాబితాతో పోలిస్తే తుది సంఖ్యలో 17.87 లక్షల ఓటర్లు పెరిగారు. అప్పట్లో 65 లక్షల మంది ఓటర్ల పేర్లు తొలగించబడిన తర్వాత 7.24 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు.

ఈ 65 లక్షల మంది పేర్లను ముసాయిదా జాబితా నుండి తొలగించారు. 22 లక్షల మంది చనిపోయినట్లు, 36 లక్షల మంది శాశ్వతంగా వలస వెళ్లారని, ఏడు లక్షల మంది ఇప్పటికే వేరే చోట తమ ఓటు హక్కు నమోదు చేసుకున్నట్లు నివేదిక ఇచ్చారు.

బీహార్ ఓటర్ల జాబితాలో 21.53 లక్షల మంది కొత్త ఓటర్లను చేర్చారు. 3.66 లక్షల మంది ఓటర్ల పేర్లు తొలగించారు. దీంతో 17.87 లక్షల మంది ఓటర్లు పెరిగారు. బీహార్ ఓటర్ల జాబితాల ప్రత్యేక ఇంటెన్సివ్ సవరణ మంగళవారం ముగిసింది. ఎన్నికల సంఘం తుది ఓటర్ల జాబితాను విడుదల చేసింది. ఓటరు జాబితాలో తొలగించిన పేర్లలో 99 శాతం చనిపోయినవారి పేర్లే ఉన్నాయి. ఇక విదేశీయుల పేర్లు ఓటరు జాబితా నుంచి ఎంతమందిని తొలగించారనే విషయమై ఈసీ ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు.

ఎస్ఐఆర్ అంటే ఏంటి?

బీహార్ లో ప్రత్యేక ఇంటెన్సివ్ సవరణను జూన్ 24న ఎన్నికల సంఘం ప్రకటించింది. 2003 ఓటర్ల జాబితాలో పేర్లు లేని ఓటర్లంతా ఈ ఏడాది జూలై 26 నాటికి తమ అర్హతను నిర్ధారించే పత్రాలను అందించాలని కోరింది. పట్టణీకరణ, ఉపాధి కోసం ప్రజలు తరచుగా వలస వెళ్లడం, మరణాలను నమోదు చేయకపోవడం, విదేశీ అక్రమ వలసదారు పేర్లు ఓటరు జాబితాలో చేర్చడం వంటి కారణాలతో ఎస్ఐఆర్ చేయాల్సిన అవసరం ఏర్పడిందని ఈసీ ప్రకటించింది. ఓటర్ల జాబితాలో దేశ పౌరులు కానీ పేర్లు నమోదు కాకుండా చూడడం కూడా రాజ్యాంగబద్దమైన బాధ్యత అని కూడా ఈసీ గుర్తు చేసింది. దేశం మొత్తం ప్రత్యేక ఇంటెన్సివ్ సవరణ నిర్వహిస్తామని కూడా తెలిపింది. ఎస్ఐఆర్ ను నిరసిస్తూ లోక్ సభలో విపక్షనాయకులు రాహుల్ గాంధీ, ఆర్‌జేడీ నాయకులు తేజస్వీ యాదవ్ ఓటర్ అధికార్ యాత్రను నిర్వహించారు. 2003 ఓటరు జాబితాలో తమ పేర్లు నమోదు కాని బీహార్ ఓటర్లలో సుమారు 2.9 కోట్ల మంది తమ పుట్టిన ప్రదేశం, తల్లిదండ్రులు, పుట్టిన తేదీ సహా తమ గుర్తింపును సూచించే 11 డాక్యుమెంట్స్ ను ఓటరు ధరఖాస్తు ఫారంతో అందించాలి.

త్వరలోనే బీహార్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్

బీహార్ ప్రజలు ఛత్ పండుగను ఘనంగా నిర్వహిస్తారు. ఈ నెల చివరివారంలో ఈ పండుగ ఉంది. ఈ పండుగ తర్వాత బీహార్ అసెంబ్లీకి ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది. ఓటర్ల తుది జాబితా విడుదలైంది. ఈ నెల 5, 6 తేదీల్లో భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ బీహార్ లో పర్యటించనున్నారు. అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఆయన అధికార యంత్రాంగంతో సమీక్ష నిర్వహిస్తారు. ఈ సమీక్ష ముగిసిన తర్వాత ఎన్నికల షెడ్యూల్ పై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఈ నెల చివరి వారంలో షెడ్యూల్ విడుదలయ్యే ఛాన్స్ ఉందని ప్రచారం సాగుతోంది.