Samudrayaan | భారత్ సముద్రయాన్ లేటెస్ట్ అప్‌డేట్! 2047 నాటికి సముద్ర గర్భంలో ఆరువేల మీటర్ల లోతున పరిశోధన కేంద్రం!
వ్యోమగాములు అంతరిక్షంలోకి వెళ్లి.. ఇంటర్నేషనల్ స్పేస్ సిటీలో ఉంటూ పరిశోధనలు చేయడం తెలిసిందే. ఇప్పడు సముద్ర గర్భానికి వెళ్లి అక్కడ రియల్‌టైమ్‌లో పరిశోధనలు చేసేందుకు ఇండియన్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ ఏర్పాట్లు చేస్తున్నది.
Samudrayaan | చంద్రయాన్ సహా వివిధ అంతరిక్ష పరిశోధనలు, ప్రయోగాల్లో భారతేదశం ఇప్పటికే తన సత్తా చాటింది. ఇప్పుడు సముద్ర గర్భంలో ఆరువేల మీటర్ల లోతున పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నది. దీనికి ‘సముద్రయాన్’ అని నామకరణం చేశారు. భారత ప్రభుత్వ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ (NIOT).. ఈ డీప్ ఓషన్ మిషన్‌ను చేపడుతున్నది. ఈ కార్యక్రమం కింద ‘మత్స్య–6000’ పేరిట ఒక ప్రత్యేకమైన జలాంతర్గామిని అభివృద్ధి చేస్తున్నారు. మత్స్య–6000.. ముగ్గురు సిబ్బందిని 12 గంటల మిషన్ కోసం సముద్రంలో ఆరువేల మీటర్ల లోతుకు తీసుకువెళ్లనున్నది. ఈ మొత్తం మిషన్‌లో నాలుగు గంటలు సముద్ర గర్భానికి చేరుకోవడానికి, మరో నాలుగు గంటలు డీప్ ఓషన్ ఎక్ల్‌ప్లోరేషన్స్‌కు, మరో నాలుగు గంటలు పైకి రావడానికి ఉద్దేశించారు.
ఈ ఏడాది మొదట్లో హార్బర్ వెట్ టెస్ట్ ద్వారా మత్స్య మిషన్ క్రిటికల్ సిస్టమ్స్‌ను విజయవంతంగా పరీక్షించారు. దీనికి తదుపరి చర్యగా 2026 సంవత్సరం మధ్యలో మానవ సహిత మిషన్‌ను చేపట్టనున్నారు. ఈ మిషన్‌లో మత్స్య–6000 ఐదు వందల మీటర్ల లోతునకు వెళ్లనున్నది. డీప్ ఓషన్ మిషన్‌లో భాగంగా స్వయం ప్రతిపత్తితో వ్యవహరించే భూగర్భ వాహనాలు, రోబోటిక్ వ్యవస్థలను కూడా NIOT అభివృద్ధి చేయనున్నది. వీటన్నింటి కొనసాగింపుగా ఒక లక్ష్యాన్ని NIOT పెట్టుకున్నది. అదే సముద్రంలో 6000 మీటర్ల లోతున ఒక దీర్ఘకాలిక అండర్‌వాటర్ ల్యాబ్ ఏర్పాటు. దీనిని 2047 నాటికి ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ఉన్నది.
గ్యాస్ హైడ్రేట్స్, పాలీ–మెటాలిక్ నోడ్యూల్స్, కోబాల్ట్ అధికంగా ఉండే ఫెర్రోమాంగనీస్ క్రస్ట్‌లు వంటి పొటెన్షియల్ రిసోర్సెస్‌ను అర్థం చేసుకోవడానికి డీప్ ఓషన్ రిసెర్చ్ అత్యవసరమని ఎన్‌ఐఓటీకి చెందిన డీప్ ఓషన్ టెక్నాలజీస్ గ్రూప్ డైరెక్టర్ డాక్టర్ ఎన్ వేదాచలంను ఉటంకిస్తూ వియాన్ పేర్కొన్నది. దీనితోపాటు వాతావరణ మార్పులు, సముద్ర ఆమ్లీకరణను పర్యవేక్షించేందుకు, సముద్ర గర్భంలో టెక్టోనిక్ కార్యకలాపాలను అర్థం చేసుకోవడానికి కూడా ఇది ఉపయోగపడుతుందని వేదాచలం చెప్పారు. వాస్తవ స్థితిని అంచనా వేసేందుకు సముద్రగర్భంలో ఉండి చేసే పరిశోధనలు, రియల్‌టైమ్‌లో తీసుకుని నిర్ణయాలు గొప్ప ఫలితాలను ఇస్తాయని నిపుణులు అంటున్నారు. ఇది వ్యోమగాములు అంతరిక్షంలోకి వెళ్లి భూమికి 400 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్‌లో నివసిస్తూ చేసే పరిశోధనలతో సమానమని చెబుతున్నారు.
ఇటువంటి వ్యవస్థను సముద్రగర్భంలో ఏర్పాటు చేయడానికి చాలా వనరులను ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. ప్రత్యేకించి తగినంత విద్యుత్తు సరఫరా, ఆక్సిజన్ సరఫరా మీద ప్రత్యేకంగా దృష్టిసారించాలి. అంతేకాకుండా.. ల్యాబ్‌లో కార్బన్ డయాక్సైడ్‌ను తొలగించే ఏర్పాటు కూడా ఉండాలి. శాస్త్రవేత్తలను సముద్ర గర్భ ప్రయోగశాలకు తీసుకెళ్లేందుకు, తిరిగి పైకి తీసుకు వచ్చేందుకు డీప్ ఓషన్ జలాంతర్గాములు ఉపయోగిస్తారు. వాటి డాకింగ్, అన్‌డాకింగ్ సమయాల్లో పారదర్శకతతో స్పష్టంగా కనిపించే ధృఢమైన నిర్మాణం కూడా అవసరం. అంతేకాకుండా ల్యాబ్ నుంచి రిమోట్ ద్వారా సముద్ర గర్భ రోబోటిక్ వాహనాలను పంపేందుకు, తిరిగి తెప్పించుకునేందుకు తగిన ఏర్పాట్లు ఉండాలి. దీర్ఘకాలం సముద్ర గర్భంలో ఉండటం వల్ల అక్కడ పనిచేసే శాస్త్రవేత్తలో మానసిక, శరీరపరమైన ఆరోగ్యం కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
ఆరువేల మీటర్ల లోతున ఏర్పాటు చేయనున్న ఈ ల్యాబ్ అనేక సవాళ్లను తట్టుకునేలా ఉండాలని చెబుతున్నారు. అంతటి లోతున విపరీతమైన ఒత్తిడి ఉంటుంది. ఉష్ణోగ్రతలు కూడా చాలా అల్పంగా ఉంటాయి. కమ్యూనికేషన్ సదుపాయం ఉండదు. వాటికితోడు అందులో పనిచేసే శాస్త్రవేత్తలు నివసించేందుకు అనువైన ఏర్పాట్లు కూడా చేయాల్సి ఉంటుంది. వీటన్నింటినీ అధిగమించేలా భారతదేశం సమర్థవంతమైన సముద్రగర్భ ప్రయోగ శాలను నిర్మించనున్నది. దీనిని నిర్మించిన తర్వాత దశలవారీగా చిన్న చిన్న లోతుల్లో పరీక్షించనున్నారు.
ఇవి కూడా చదవండి..
Two WhatsApps for iPhone | ఐఫోన్ యూజర్లకు శుభవార్త : ఎట్టకేలకు ఐఫోన్లో రెండు వాట్సప్‌లు
Telangana Tourism : 22 నుండి సాగర్ – శ్రీశైలం లాంచీ ప్రయాణం ప్రారంభం
India-Pakistan conflict | కాల్పుల విరమణపై ట్రంప్, మోదీ.. ఎవరి మాట అసత్యం? తాజాగా అమెరికా ప్రెసిడెంట్ కొత్త సంగతి!
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram