Telangana Tourism : 22 నుండి సాగర్ – శ్రీశైలం లాంచీ ప్రయాణం ప్రారంభం

నాగార్జునసాగర్ నుంచి శ్రీశైలం లాంచీ ప్రయాణం ఈనెల 22 నుంచి ప్రారంభం. నల్లమల అటవీ అందాలతో సాగే ఈ ప్రయాణానికి టీజీటిడీసీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.

Telangana Tourism : 22 నుండి సాగర్ – శ్రీశైలం లాంచీ ప్రయాణం ప్రారంభం

నాగార్జున సాగర్ : ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న నాగార్జునసాగర్ నుంచి శ్రీశైలం లాంచీ ప్రయాణం ఈనెల 22 నుండి ప్రారంభం కానుంది. కృష్ణానది ఒడిలో నల్లమల్ల అడవులు, కొండల నడుమ..పచ్చని ప్రకృతి అందాల మధ్యన సాగే సాగర్ – శ్రీశైలం లాంచీ ప్రయాణం కోసం తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ అధికారులు ఏర్పాట్లను పూర్తి చేశారు. ఈనెల 22 శనివారం నుండి సాగర్ టు శ్రీశైలం లాంచీ ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర పర్యాటక వృద్ధి సంస్థ ఉన్నతాధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. నాగార్జునసాగర్ నుండి లాంచీలో శ్రీశైలం వెళ్లే ప్రయాణికులకు వన్ వే పెద్దలకు రూ.2000, పిల్లలకు రూ.1600 ( 5 నుండి 10 సంవత్సరాలు)లుగా టికెట్ ధర నిర్ణయించారు. సాగర్ నుండి లాంచీలో శ్రీశైలం వెళ్లి తిరిగి అదే లాంచీలో మరుసటి రోజు సాగర్ రావడానికి పెద్దలకు రూ.3250 ,పిల్లలకు రూ.2600లుగా టికెట్ ధరలు ఖరారు చేశారు. లాంచీ ప్రయాణంలో మధ్యాహ్నం భోజనం సౌకర్యం లాంచీలోనే ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. లాంచీలో ప్రయాణికులు నాగార్జునసాగర్‌ నుంచి నందికొండ మీదుగా ఏలేశ్వరం, సలేశ్వరం, తూర్పు కనుమలు, నల్లమల అటవీ అందాలను వీక్షించేలా ప్రయాణం ఉంటుందని పర్యాటక శాఖ అధికారులు తెలిపారు. నదిలో సుమారు 110 కిలోమీటర్ల దూరం ఐదు గంటలపాటు ఈ లాంచీ ప్రయాణం కొనసాగుతుంది.

ఈనెల 22 నుండి ప్రతి శనివారం టికెట్ల బుకింగ్ ఆధారంగా సాగర్ టు శ్రీశైలం లాంచీ ప్రయాణాన్ని కొనసాగిస్తామని తెలిపారు. సోమవారం నుండి శుక్రవారం వరకు 100 టికెట్లను బుక్ చేసుకుంటే ప్రత్యేకంగా సాగర్ నుండి శ్రీశైలానికి లాంచీ ప్రయాణాన్ని ఏర్పాటు చేయనున్నట్లుగా వారు తెలిపారు. ఆన్లైన్ టికెట్ల కోసం డబ్ల్యూ డబ్ల్యు డబ్ల్యు టీజీటీడీసీ.ఇన్ వెబ్ సైట్లో బుకింగ్ చేసుకోవచ్చని తెలిపారు. మరిన్ని వివరాలకు హైదరాబాద్ లోని బషీర్ బాగ్ సెంట్రల్ రిజర్వేషన్ సెంటర్ :9848540371, 9848125720, అలాగే నాగార్జునసాగర్ లాంచీ యూనిట్ :7997951023 ఫోను నెంబర్లను సంప్రదించాలని తెలిపారు. ఇప్పటికే నాగర్‌కర్నూల్‌ జిల్లా సోమశిల నుంచి కూడా శ్రీశైలం వరకు లాంచీ సౌకర్యం అందుబాటులోకి వచ్చిన సంగతి తెలిసిందే.