Jagadish Reddy : మాకు పీపీటీ ఇస్తే బండారం బయటపెడుతాం

నీళ్ల సమస్యలపై అసెంబ్లీలో బీఆర్ఎస్‌కు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ (PPT) అవకాశం ఇస్తే కాంగ్రెస్ దొంగచాటు రాజకీయాలను బయటపెడతామని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సవాల్ విసిరారు.

Jagadish Reddy : మాకు పీపీటీ ఇస్తే బండారం బయటపెడుతాం

విధాత : నీళ్ల సమస్యలపై చర్చలో బీఆర్ఎస్ కు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అవకాశం ఇస్తే ప్రభుత్వం బండారం బయటపెడుతామని మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి స్పష్టం చేశారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. మాకు పీపీటీ ఇవ్వడానికి మీకు భయమెందుకు అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మీరు పీపీటీ పెట్టండి.. మాకూ అవకాశమివ్వాలని, అప్పుడు తెలంగాణలో అసలు దొంగలు ఎవరో భయటపెడుతామన్నారు. మీ స్క్రీన్‌పైనే మీ కాంగ్రెస్ బాగోతం బయటపెడతాం అని జగదీష్ రెడ్డి తెలిపారు. గతంలో సభలో మీరు అడ్డుకున్నట్టు మేము అడ్డుకోబోమని స్పష్టం చేశారు. మాకు పీపీటీ అవకాశం ఇస్తే కాంగ్రెస్ బండారం బయటపడుతుందన్నారు. ఆ భయంతోనే అసెంబ్లీలో బీఆర్ఎస్‌కు అవకాశాన్ని నిరాకరిస్తున్నారని ఆరోపించారు. అసెంబ్లీలో పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టు, నల్లమల సాగర్ ప్రాజెక్టు సహా కృష్ణా, గోదావరి జలాల్లో తెలంగాణకు జరుగుతున్న అన్యాయంపై వివరించేందుకు బీఆర్ఎస్ కు పీపీటీ అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేశారు.

పక్క రాష్ట్రాలకు మేలు చేసేలా రేవంత్ పాలన

పీపీటీకి అవకాశం ఇస్తే నీటివాటపై రేవంత్ చేస్తున్న ద్రోహాన్ని ఎండగడతాం అని, ఇవ్వకపోతే కాంగ్రెస్ తీరుని ప్రజల్లో ఎండగడతాం అని జగదీష్ రెడ్డి తెలిపారు. శాసనసభలో అందరికి సమానమైన అవకాశాలు ఇవ్వాలన్నారు. అప్పుడు అరవై ఏండ్లు.. ఇప్పుడు రెండేళ్లు ఏం చేసిండ్రో చెప్పాలని, పక్క రాష్ట్రాలకు ఉపయోగపడే పద్ధతిలో కాంగ్రెస్ పాలన సాగుతుందని విమర్శించారు. నల్లమల్ల సాగర్ పేరు మీద కొత్త నాటకం మొదలు పెట్టారని, పక్క రాష్ట్ర నీటి దోపిడీకి రేవంత్ సహకరిస్తున్నారని, వారు సూచించిన సలహాదారులను పెట్టి తెలంగాణకు అన్యాయం చేస్తున్నాడని ఆరోపించారు.

రేవంత్ తీరుతో తెలంగాణ నీటి వాటాలకు గండి

నీటి వాటా కోసం కేసీఆర్ ఉద్యమం చేసి సాధించిన హక్కులను ఆంధ్రాకు ధారాదత్తం చేస్తున్నాడని జగదీష్ రెడ్డి మండిపడ్డారు. రేవంత్ తీరుతో కృష్ణా , గోదావరిలో నీటి వాటా కోల్పోయే ప్రమాదం ఏర్పడిందన్నారు. నల్లమల్ల సాగర్, బనకచర్ల రెండూ ఒక్కటేనని, నల్లమల్ల సాగర్‌గా పేరు మార్చి చంద్రబాబు మరో ద్రోహానికి తెరలేపాడని, దానికి రేవంత్ రెడ్డి సహకరిస్తున్నాడని జగదీష్ రెడ్డి ఆరోపించారు. ఢిల్లీకి పంపిన కమిటీలో చంద్రబాబు చూపిన అధికారిని పెట్టి ఇక్కడి రైతులకు అన్యాయం చేస్తున్నాడని, ఉద్యోగస్థుల విషయంలోనూ ఆంధ్రవాళ్ళ పెత్తనం సరికాదు అన్నారు. తెలంగాణ ప్రయోజనాల కోసం కేసీఆర్ పోరాటం అంతా ఇంత కాదు అని, ఈ విషయంలో మీ తీరు మార్చుకోకపోతే పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమం తప్పదు అని హెచ్చరించారు.

ఇవి కూడా చదవండి :

Telangana Neo-Politics : నయా రాజకీయం…ఎన్నికల్లో చెప్పనవి చేస్తారు!
Good Luck Grapes : గుడ్ లక్ గ్రేప్స్…ట్రెండింగ్ లో న్యూఇయర్ 12గ్రేప్స్ థియరీ