KTR counter attack| మాది ఫైటర్ల జాతి, మీది ట్రెయిటర్ల (ద్రోహుల) జాతి: సీఎం రేవంత్ కు కేటీఆర్ కౌంటర్

ఏ జాతి నీది? ఏ జాతికి జాతిపిత?" అని బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. తెలంగాణలో రెండే జాతులు ఉన్నాయి.. ఒకటి తెలంగాణవాదుల జాతి, రెండవది తెలంగాణ ద్రోహుల జాతి. మాది కేసీఆర్ లాంటి ఫైటర్ల జాతి, నీది ట్రెయిటర్ల జాతి అని కేటీఆర్ చెప్పుకొచ్చారు.

KTR counter attack| మాది ఫైటర్ల జాతి, మీది ట్రెయిటర్ల (ద్రోహుల) జాతి: సీఎం రేవంత్ కు కేటీఆర్ కౌంటర్

విధాత, హైదరాబాద్ : ఏ జాతి నీది? ఏ జాతికి జాతిపిత?” అని బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. తెలంగాణలో రెండే జాతులు ఉన్నాయి.. ఒకటి తెలంగాణవాదుల జాతి, రెండవది తెలంగాణ ద్రోహుల జాతి. మాది కేసీఆర్ లాంటి ఫైటర్ల జాతి, నీది ట్రెయిటర్ల జాతి అని కేటీఆర్  సీఎం రేవంత్ రెడ్డికి కౌంటర్ ఇచ్చారు.  తెలంగాణ భవన్‌లో నిర్వహించిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జన్మదిన వేడుకల్లో పాల్గొన్న కేటీఆర్ తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ చేసిన పోరాటాన్ని శ్లాఘిస్తూ…సీఎం రేవంత్ రెడ్డిపై విమర్శలు గుప్పించారు. కేసీఆర్ తెలంగాణ కోసం జెండా ఎత్తినప్పటి పరిస్ధితులును గుర్తు చేసుకుంటే కేసీఆర్ సాహాసం, చరిత్ర తెలుస్తదన్నారు.

అనాడు తెలంగాణ కోసం ఉద్యమం ప్రారంభించినప్పుడు రాష్ట్రంలో టీడీపీ, మరొక వైపు నూరేళ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్, మరో జాతీయ పార్టీ బీజేపీ.. మూడు బలమైన రాజకీయ శక్తులను ఢీకొని తెలంగాణ సాధించిన రాష్ట్ర సాధకుడు కేసీఆర్ అని కేటీఆర్ కొనియాడారు. 10 ఏళ్లు అద్భుతంగా రాష్ట్రాన్ని నడిపిన నాయకుడు కేసీఆర్, దేశానికి దిక్సూచిగా తెలంగాణను నిలిపిన నాయకుడు కేసీఆర్ అని అన్నారు.

తెలంగాణ మట్టితో మమేకమైన వాడికి, ఉద్యమాల ఉగ్గుపాలు తాగిన వాడికి, ఆత్మగౌరవ పోరాటంలో కలిసి అడుగు నడిచిన వాళ్లకి మాత్రమే జాతి అంటే ఏంటో తెలుస్తుంది, జాతి గౌరవం అంటే ఏంటో తెలుస్తుందని కేటీఆర్ వ్యాఖ్యానించారు. సకల జనులు స్వరాష్ట్ర సమరంలో తెగించి కొట్లాడుతున్నప్పుడు, ప్రాణాలకు తెగించి మన నాయకుడు నిరాహార దీక్ష చేస్తున్నప్పుడు, సమైక్యాంధ్రవాదుల సంచులు మోసే సన్నాసులకు జాతి తెలవదు, నీతి తెలవదు అని రేవంత్ రెడ్డిపై ఘాటు వ్యాఖ్యలు చేశారు.

లాఠీ దెబ్బలు తిన్నోళ్లకు, జైళ్లకు పోయినోళ్లకు, తుపాకులకు ఎదురుపడి నిలబడ్డోళ్లకు జాతి అంటే ఏంటి, జాతి అస్తిత్వం అంటే ఏంటో తెలుస్తదని అన్నారు. ఉద్యమకారుల మీదికి తుపాకులు తీసుకొని ఆ రోజు దాడికి వెళ్లిన ద్రోహులకు జాతి నిర్వచనం ఎట్లా తెలుస్తది? అని కేటీఆర్ విమర్శించారు. రక్తంలో పౌరుషం ఉంటే, డీఎన్ఏలో ఉద్యమం ఉంటే, ఆత్మాభిమానం అనేది ఎక్కడన్నా నీ శరీరంలో ఉంటే నీకు జాతి అంటే ఏందో, జాతి చరిత్ర అంటే ఏందో తెలుస్తదని రేవంత్ రెడ్డిపై మండిపడ్డారు. జై తెలంగాణ నినాదం ఇయ్యడానికే భయపడేటోళ్లకు, కిరాయి సర్కార్‌కు తెలంగాణ సోయి లేని సన్నాసులకు జాతి విలువ ఎన్నటికీ తెలవదు అన్నారు.

ప్రాంతం వాడు మోసం చేస్తే ప్రాంతంలోనే ఉప్పుపాతర వేస్తామన్న కాళోజీ జాతి మాది అని, “నా తెలంగాణ కోటి రతనాల వీణ” అని చెప్పిన దాశరథి జాతి మాది అని, 1952లో “గైర్ ముల్కీ గో బ్యాక్” అని నెత్తుటి త్యాగాలు చేసిన విద్యార్థి అమరవీరుల జాతి మాది అని, 1969లో కర్కశ కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా పోరాటం చేసి 369 మంది అసువులు బాసిన యువ కిశోరాల జాతి మాది అని, మలిదశ ఉద్యమంలో ఢిల్లీ మెడలు వంచిన తెలంగాణ జాతి మాది అని కేటీఆర్ చెప్పుకొచ్చారు. అణువణువునా ఆత్మగౌరవం తొణికిసలాడే జాతి మాది. నీతి ఉన్న, రీతి ఉన్న తెలంగాణ జాతి మాది అన్నారు.

మీలాగా ఢిల్లీకి సలాం కొట్టి బతికే సామంతులం మేము కాదు అని, నిటారుగా నిలబడ్డ వెన్నుముక ఉన్న తెలంగాణ భూమి పుత్రులం, ఆ జాతి మాది.. సామంతుల జాతి కాదు స్వతంత్రుల జాతి మాది అని కేటీఆర్ పేర్కొన్నారు. బానిసకు ఒక బానిస జాతి కాదు, గిరి గీసి కొట్లాడే తెగువ ఉన్న కేసీఆర్ జాతి మాది అని, ఢిల్లీ కీ ఇస్తే ఎగిరే కీలుబొమ్మల జాతి కాదు మాది, అధిష్టానం ఆడిస్తే ఆడే తోలుబొమ్మల జాతి కాదు మాది అని రేవంత్ రెడ్డిపై సెటైరికల్ విమర్శలతో కేటీఆర్ విరుచుకపడ్డారు. తెగువ ఉన్న, పౌరుషం ఉన్న భూమి పుత్రుల జాతి మాది అని, కిరాయి వాళ్ల పంచన చేరి కిరాయి బతుకు బతికే జాతి కాదు మాది. సోయి ఉన్న, సొంత శక్తి ఉన్న జాతి మాది అని కేటీఆర్ స్పష్టం చేశారు.

తెలంగాణనే కేసీఆర్ ఆనవాళ్లు అని, దాన్ని ఎట్లా చెరిపేస్తావురని? నువ్వు మమ్మల్ని ఎన్ని తిట్టినా, ఎన్ని బూతులు మాట్లాడినా ఒకటి మాత్రం వాస్తవం.. ఆయన ఒక శిఖరం, నువ్వు ఒక శునకం. నీ స్థాయి గదే, నీ బతుకు గదే అంటూ రేవంత్ రెడ్డిపై కేటీఆర్ ఘాటు విమర్శలు చేశారు. మళ్ళీ తెలంగాణలో గులాబీ జెండా ఎగరేయడమే, కేసీఆర్ ను మరోసారి సీఎం చేయడమే ఆ మహానాయకుడికి మనం ఇచ్చే చిరుకానుక అని కేటీఆర్ పార్టీ శ్రేణులకు, ఉద్యమకారులకు పిలుపునిచ్చారు.