Rajya Sabha Elections  | తెలంగాణ కాంగ్రెస్‌లో రాజ్యసభ ఎన్నికల రచ్చ

రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైన నేపథ్యంలో తెలంగాణలో ఖాళీ అయ్యే రెండు సీట్లను ఎవరితో భర్తీ చేస్తారన్న చర్చలు జోరందుకున్నాయి.

Reported by: Jagan Mohan Talluri | తెలంగాణ‌ | Feb 18, 2026, 8:18 pm IST
Read Time: 5 mins
Rajya Sabha Elections  | తెలంగాణ కాంగ్రెస్‌లో రాజ్యసభ ఎన్నికల రచ్చ

విధాత, హైదరాబాద్ :
Rajya Sabha Elections  తెలంగాణ నుంచి ఖాళీ కాబోతున్న రెండు రాజ్యసభ స్థానాల ఎన్నికల అంశం రాష్ట్ర కాంగ్రెస్‌లో కొత్త తలనొప్పులు సృష్టిస్తున్నది. బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు కేఆర్ సురేశ్‌ రెడ్డి, కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ మను సింఘ్వీల పదవీకాలం ఏప్రిల్ 9న ముగియనుంది. ఖాళీ కాబోతున్న ఈ రెండు స్థానాలతోపాటు దేశంలోని 10 రాష్ట్రాలకు సంబంధించిన 37 రాజ్యసభ స్థానాలకు ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ఫిబ్రవరి 26న నోటిఫికేషన్ విడుదల చేస్తారు. మార్చి 5 వ తేదీ వరకు అభ్యర్థుల నామినేషన్, మార్చి 16న ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ నుంచి ఖాళీ కాబోతున్న రెండు రాజ్యసభ స్థానాలను దక్కించుకునేందుకు కాంగ్రెస్ నాయకత్వం, సీఎం రేవంత్ రెడ్డి కసరత్తు ముమ్మరం చేశారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ హైకమాండ్ మధ్య జరిగే చర్చల సందర్భంగా దీనిపై నిర్ణయం తీసుకుంటారని సమాచారం.

రాజ్యసభ రేసులో సీనియర్లు

అసెంబ్లీలో ఉన్న సంఖ్యాబలం మేరకు కాంగ్రెస్ పార్టీ రెండు రాజ్యసభ స్థానాలను దక్కించుకోవటం ఖాయంగా కనిపిస్తోంది. బీఆర్ఎస్ ఫిరాయింపు ఎమ్మెల్యేలు 10మంది కూడా కాంగ్రెస్‌కు మద్దతు ఇచ్చే అవకాశం ఉందని అంటున్నారు. దీంతో రెండు స్థానాలకు కాంగ్రెస్ అభ్యర్థులను రంగంలోకి దింపనుంది. బీఆర్ఎస్ పోటీ చేయకపోతే వారిద్దరి ఎంపిక ఏకగ్రీవం అయ్యే చాన్స్‌ కూడా ఉంది.

సింఘ్వికి మరో చాన్స్‌?

ఖాళీ కాబోతున్న రెండు రాజ్యసభ స్థానాల్లో ఒక దానిలో అభిషేక్ మను సింఘ్వీకి రెన్యువల్ ఉంటుందన్న చర్చ వినిపిస్తుంది. పార్టీకి న్యాయవాదిగా ఆయన అందిస్తున్న సేవల నేపథ్యంలో ఆయనకు మరోసారి రాష్ట్రం నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం కల్పిస్తారన్న వాదన బలంగా వినిపిస్తున్నది. మిగిలిన మరో స్థానానికి కాంగ్రెస్ సీనియర్లు మాజీ మంత్రి టీ జీవన్ రెడ్డి, మాజీ ఎంపీలు మధు యాష్కీ, వీ హనుమంతరావు, కే కేశవరావు పేర్లు వినిపిస్తున్నాయి. వారితో పాటు రాష్ట్రపతి ఎన్నికల్లో ఇండియా కూటమి నుంచి పోటీ చేసి ఓడిన మాజీ జస్టిస్‌ సుదర్శన్ రెడ్డి, సీఎం ప్రధాన సలహాదారుగా ఉన్న వేం నరేందర్ రెడ్డి పేర్లు కూడా రేసులో వినిపిస్తున్నాయి. వారిలో బీసీ కోటలో ప్రధానంగా మధుయాష్కి గౌడ్ పేరు వినిపిస్తున్నది. ఈ దఫా రాజ్యసభ స్థానం అభ్యర్థి ఖరారులో కాంగ్రెస్ అధిష్ఠానం, సీఎం రేవంత్ రెడ్డి ఏ రకమైన నిర్ణయం తీసుకుంటారన్న చర్చ కాంగ్రెస్ వర్గాల్లో ఆసక్తి రేపుతున్నది.