• Telugu News
  • /Telangana

అభిషేక్‌ మను సింఘ్వీ, వేం నరేందర్‌రెడ్డి ఎన్నిక ఏకగ్రీవం

తెలంగాణ నుంచి రాజ్యసభకు కాంగ్రెస్ అభ్యర్థులైన అభిషేక్ మను సింఘ్వీ, వేం నరేందర్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. ప్రత్యర్థులు లేకపోవడంతో ఇద్దరూ ఏకగ్రీవంగా ఎన్నిక కావడం లాంఛనం.

Reported by: Tejaswini Nanna | తెలంగాణ‌ | Mar 05, 2026, 5:43 pm IST
Read Time: 5 mins
అభిషేక్‌ మను సింఘ్వీ, వేం నరేందర్‌రెడ్డి ఎన్నిక ఏకగ్రీవం

విధాత, హైదరాబాద్ : తెలంగాణ నుంచి ఎన్నికలు జరుగుతున్న రెండు రాజ్యసభ స్థానాలకు అధికార కాంగ్రెస్ పార్టీ నుంచి అభ్యర్థులుగా అభిషేక్‌ మను సింఘ్వీ, వేం నరేందర్‌రెడ్డి నామినేషన్‌ దాఖలు చేశారు. ఎన్నికల అధికారి ఉపేందర్‌రెడ్డికి నామినేషన్‌ పత్రాలు అందజేశారు. దీనికి సీఎం రేవంత్‌తో పాలు పలువురు మంత్రులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు పెద్ద ఎత్తున అసెంబ్లీ ప్రాంగణానికి చేరుకున్నారు.

వారిద్దరు ఏకగ్రీవమే !

తెలంగాణలోని రెండు రాజ్యసభ స్థానాలకు మార్చి 16న జరుగనున్న ఎన్నికల ప్రక్రియలో భాగంగా మొత్తం మూడు నామినేషన్లు దాఖలయ్యాయి. కాంగ్రెస్ తరఫున అభిషేక్‌ సింఘ్వీ, వేం నరేందర్‌రెడ్డి నామినేషన్ దాఖలు చేయగా స్వతంత్ర అభ్యర్థిగా సాయి అనే వ్యక్తి నామినేషన్ వేశారు. అభిషేక్‌ సింఘ్వీ మూడుసెట్లు, వేం నరేందర్‌రెడ్డి నాలుగు సెట్లు, సాయి ఒక సెట్ నామినేషన్ దాఖలు చేశారు. అయితే స్వతంత్ర అభ్యర్థి సాయికి 10 మంది ఎమ్మెల్యేల ప్రతిపాదన సంతకాలు లేకపోవడంతో ఆయన నామినేషన్ స్క్రూటినీలో తిరస్కరణ తప్పని పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అభ్యర్థులు అభిషేక్ సింఘ్వీ, వేం నరేందర్ రెడ్డిలు రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికవ్వడం లాంఛనం కానుంది. తగిన సంఖ్యాబలం లేకపోవడంతో బీఆర్ఎస్ పోటీ నుంచి తప్పుకుంది.

నామినేషన్ల దాఖలు అనంతరం అభిషేక్ సింఘ్వీ, వేం నరేందర్ రెడ్డిలు మీడియాతో మాట్లాడారు. తెలంగాణ తరఫున రాజ్యసభకు రెండోసారి వెళ్లడం అదృష్టంగా భావిస్తున్నట్లు అభిషేక్‌ సింఘ్వీ తెలిపారు. కాంగ్రెస్‌ అధ్యక్షుడు ఖర్గే, అగ్రనేతలు సోనియా, రాహుల్‌, కేసీ వేణుగోపాల్‌కు ఆయన ధన్యవాదాలు తెలిపారు.వేం నరేందర్‌రెడ్డి మాట్లాడుతూ రాజ్యసభ అభ్యర్థిగా అవకాశం కల్పించిన అధిష్ఠానానికి కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు చెప్పారు.

ముగిసిన నామినేషన్ల ప్రక్రియ

దేశవ్యాప్తంగా 15 రాష్ట్రాల్లోని మొత్తం 37 రాజ్యసభ స్థానాల ఎన్నికల ప్రక్రియలో భాగంగా గురువారంతో నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. రేపు 6వ తేదీన నామినేషన్ల పరిశీలన, తిరస్కరణ, మార్చి 9 వరకు ఉపసంహరణ అవకాశం ఉంది. ఏకగ్రీవం కాని స్థానాలకు మార్చి 16న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. అదే రోజు సాయంత్రం 5 గంటలకు ఓట్లు లెక్కింపు చేపట్టి ఫలితాలను ప్రకటించనున్నారు.

ఇవి కూడా చదవండి :

వారసులను దించేస్తున్నారు !.. హీట్ పెంచుతున్న ఖర్చీప్ కల్చర్!!
Teenage Pregnancies : టీనేజ్ ప్రెగ్నెన్సీ టెన్షన్…టాప్ త్రీలో ఏపీ !