Teenage Pregnancies : టీనేజ్ ప్రెగ్నెన్సీ టెన్షన్…టాప్ త్రీలో ఏపీ !

ఆంధ్రప్రదేశ్‌లో టీనేజ్ ప్రెగ్నెన్సీ కేసులు పెరుగుతున్నాయి. జాతీయ సర్వేలో ఏపీ మూడో స్థానంలో నిలవడం ఆందోళన కలిగిస్తోంది. పల్నాడు జిల్లాలో అత్యధిక కేసులు నమోదయ్యాయి.

Reported by: Tejaswini Nanna | ఆంధ్ర ప్రదేశ్ | Mar 05, 2026, 2:58 pm IST
Read Time: 7 mins
Teenage Pregnancies : టీనేజ్ ప్రెగ్నెన్సీ టెన్షన్…టాప్ త్రీలో ఏపీ !

విధాత : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని టీనేజ్ ప్రెగ్రెన్సీ కలవర పెడుతుంది. లోకం తెలియని వయస్సులో బాలికలు యుక్త వయసులోనే పిల్లలకు తల్లులుగా మారుతున్నారు. చేతిలో సెల్ ఫోన్..ఇంటర్నేట్ ప్రభావం, ఇన్ స్ట్రా వంటి సామాజిక మాధ్యమాల్లో పరిచయాలు ఆకర్షణకు దారి తీస్తున్నాయి. దీంతో ఓవైపు బాల్య వివాహాల సంఖ్య తగ్గుతున్నప్పటికి..ఇంకోవైపు కౌమార దశలో గర్భం దాల్చే కేసులు పెరగటం సమాజానికి..ప్రభుత్వానికి సమస్యగా తయారైంది. ఇటీవల ‘యుక్త వయసులోనే గర్భం దాల్చడం’ అనే అంశంపై నిర్వహించిన జాతీయ స్థాయి సర్వేలో ఏపీ మూడో స్థానంలో ఉండటం ఆ రాష్ట్ర పాలకులతో పాటు తల్లిదండ్రులను సైతం కలవర పెడుతుంది. రాష్ట్రంలో పెరిగిపోతున్న టీనేజ్ ప్రెగ్నెన్సీపై రాష్ట్ర మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ రాయపాటి శైలజ ఆందోళన వ్యక్తం చేసిన తీరు సమస్య తీవ్రతకు నిదర్శనంగా నిలిచింది. ఈ కేసులు పెరుగుతున్న ప్రాంతాల్లోని స్థానిక పరిస్థితులను అధ్యయనం చేసి వాటి కట్టడికి చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.

12 శాతానికి పెరిగిన టీనేజ్ ప్రెగ్నెన్సీ

తాజా సర్వేలో రాష్ట్రంలోని గర్భిణుల్లో ఏటా 12శాతం మంది తక్కువ వయసు వారే ఉంటున్నారని వెల్లడవ్వడం ఆందోళనకరం. టీనేజ్ గ్రూప్ అంటే 13 సంవత్సరాల నుంచి 19 ఏళ్ల మధ్య వయసు వారే. ఈ సమయంలో గర్భం దాల్చిన అమ్మాయిల్ని టీన్ ప్రెగ్నెంట్స్ గా పరిగణిస్తారు. రాష్ట్రంలో టీనేజ్ ప్రెగ్నెన్సీ రాష్ట్ర సగటు 8.80 శాతానికి పెరిగింది. 2025-26లో 5 శాతానికి తగ్గించాలని బెంచ్ మార్కుగా అధికారులు నిర్దేశించారు. అయితే విశాఖ జిల్లాల్లో మాత్రమే 3.98% టీనేజ్ ప్రెగ్నెన్సీ కేసులు నమోదైయ్యాయి. మిగతా జిల్లాల్లో 5 శాతం నుంచి 13 శాతానికి ఎక్కువగానే సమస్య ఉంది. రాష్ట్రంలో కౌమార బాలికల్లో టీనేజ్ ప్రెగ్నెన్సీ సమస్య ఏపీలోని 25 జిల్లాల్లో తీవ్రంగా ఉంది. రాయలసీమ, దక్షిణ కోస్తా తీర ప్రాంతాల్లో అయితే పరిస్థితి మరింత అదుపు తప్పింది.

టీనేజ్ ప్రెగ్నెన్సీ కేసులు అత్యధికంగా పల్నాడు జిల్లాలో 14.9 శాతంగా నమోదవ్వడం గమనార్హం. అత్యల్పంగా విశాఖపట్నంలో 3శాతం కేసులు నమోదయ్యాయి. కర్నూలులో 13.50 శాతం ఉన్నట్లు జాతీయ స్థాయి సర్వేలో తేలింది. మన్యం ప్రాంతాల్లో ఉండే సంప్రదాయాల కారణంగా కొన్ని చోట్ల చిన్న వయస్సులోనే బాల్య వివాహాలు చేస్తున్నారు. అలాగే అత్యాచారాలు, తెలిసీ తెలియని వయసులో క్షణికావేశం, వృద్దుల సంరక్షణలో పిల్లల పెంపకం, నిరాక్షరాస్యత ఇలాంటివన్నీ చిన్న వయసులో గర్భం దాల్చడానికి కారణాలు అవుతున్నాయి.

యుక్త వయసు గర్బధారణతో ఆరోగ్య సమస్యలు

యుక్త వయసు గర్బధారణతో తల్లీబిడ్డల్ని ఆరోగ్య సమస్యలు చుట్టుముడుతున్నాయి. మాతాశిశు మరణాల ప్రమాదం పెరుగుతుంది. ఆరోగ్య, సామాజిక, ఆర్థిక రంగాలపై కూడా టీనేజీ ప్రెగ్నేన్సీ తీవ్ర ప్రభావం చూపుతోంది. చిన్న వయసులో గర్భదారణ అంటే ఇటు తల్లికి, అటు బిడ్డకి ఇద్దరికీ ఆరోగ్య పరంగా ఎన్నో సమస్యలు ఎదురవుతాయని నిపుణులు చెబుతున్నారు. గర్భాశయం పూర్తి స్థాయిలో సన్నద్ధం కాని చిన్న వయసులో గర్భం దాలిస్తే శారీరక, మానసిక సమస్యలు ఎదురవుతాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. గర్భధారణ సమయంలో ఎనీమియా, హైపర్ టెన్షన్ వంటి సమస్యలు వస్తాయని, కాన్పు కష్టమై, అధిక శాతం సిజేరియన్​లకు ఆస్కారం ఉంటుందన్నారు. ప్రసవ సమయంలో రక్తస్రావం వల్ల తల్లికీ, బిడ్డకు ప్రాణాపాయ సమస్యలు ఎదురుకావచ్చని హెచ్చరిస్తున్నారు.

అమలు కాని పథకాలతో సమస్య మరింత జఠిలం

చిన్న వయస్సులో గర్భం దాల్చుతున్న కేసులను నియంత్రణకు రాష్ట్రీయ కిషోర్ స్వస్థా కార్యక్రమం (RKSK) సహా పలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలు, అవగాహన కార్యక్రమాలు సమర్థంగా అమలు కాకపోతుండటం కూడా ఈ సమస్యను మరింత అధికం చేస్తుంది. కిశోర బాలికలకు ఆరోగ్యం, లైంగిక-పునరుత్పత్తి, పోషకాహారం, రక్తహీనత తదితర అంశాలపై అవగాహన కల్పించడంలో అధికార యంత్రాంగం, స్వచ్చంద సంస్థలు విఫలమవుతున్నాయి.

ఇవి కూడా చదవండి :

ఢిల్లీలో భారీ సంచలనం… అమిత్ షా, రేవంత్ సమక్షంలో గణపతి లొంగుబాటు?
Nitish Kumar Resign : కేంద్ర‌మంత్రి వ‌ర్గంలోకి బీహార్ సీఎం నితీష్ కుమార్!