ఢిల్లీలో భారీ సంచలనం… అమిత్ షా, రేవంత్ సమక్షంలో గణపతి లొంగుబాటు?

దశాబ్దాలుగా అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టు అగ్రనేత ముప్పాళ్ల లక్ష్మణరావు అలియాస్ గణపతి ఢిల్లీలో లొంగిపోయినట్లు వార్తలు సంచలనం సృష్టిస్తున్నాయి. అమిత్ షా, సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో సరెండర్ జరిగే అవకాశంపై ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి.

ఢిల్లీలో భారీ సంచలనం… అమిత్ షా, రేవంత్ సమక్షంలో గణపతి లొంగుబాటు? లొంగుబాటు వార్తల మధ్య చర్చల్లోకి వచ్చిన మావోయిస్టు అగ్రనేత గణపతి

From Underground to Surrender: Top Maoist Ganapathy May End Decades of Insurgency

విధాత ప్రతినిధి | న్యూఢిల్లీ/హైదరాబాద్:
మావోయిస్టు ఉద్యమానికి నాలుగు దశాబ్దాల పాటు దిశానిర్దేశం చేసిన అగ్రనేత ముప్పాళ్ల లక్ష్మణరావు అలియాస్ గణపతిఢిల్లీలో లొంగిపోయినట్లు వస్తున్న వార్తలు దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్నాయి. కేంద్ర నిఘా వర్గాల సమాచారం ప్రకారం ఆయన ఇప్పటికే ఢిల్లీలో భద్రతా అధికారుల అదుపులో ఉన్నారని, త్వరలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో అధికారికంగా లొంగుబాటు ప్రకటన చేయించే అవకాశముందని తెలుస్తోంది.

దేశంలో నక్సలిజాన్ని 2026 మార్చి 31 నాటికి పూర్తిగా నిర్మూలించాలి అనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన చర్యల నేపథ్యంలో ఈ పరిణామం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర డీజీపీ బి. శివధర్ రెడ్డి, స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో ఐజీ బి. సుమతి ప్రస్తుతం ఢిల్లీలో ఉండటం ఈ వార్తలకు మరింత బలం చేకూరుస్తోంది. ఇటీవల మావోయిస్టు నాయకులు తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్‌జీ, మల్లా రాజిరెడ్డి తదితరులు తెలంగాణ పోలీసుల ఎదుట లొంగిపోయిన నేపథ్యంలో గణపతి కూడా ప్రధాన స్రవంతిలోకి రావడానికి ఆసక్తి చూపినట్లు సమాచారం.

ఢిల్లీలో తెలంగాణ పోలీసు ఉన్నతాధికారులు

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర డీజీపీ బి. శివధర్ రెడ్డి, స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో ఐజీ బి. సుమతి ప్రస్తుతం ఢిల్లీలో ఉండటం రాజకీయ, భద్రతా వర్గాల్లో చర్చకు దారి తీసింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో జరిగిన సమావేశంలో ఇటీవల జరిగిన మావోయిస్టుల లొంగుబాట్లు, కేంద్రం చేపట్టిన ఆపరేషన్ కాగార్ పురోగతిపై సమీక్ష జరిగినట్లు సమాచారం. ఇదే సమావేశంలో గణపతి లొంగుబాటు అంశం కూడా ప్రస్తావనకు వచ్చినట్లు తెలుస్తోంది. కేంద్ర నిఘా సంస్థలు ఆయనతో పాటు మరికొందరు మావోయిస్టు నేతలు కూడా నేపాల్ ప్రాంతంలో ఉన్నారా అనే అంశంపై పరిశీలిస్తున్నట్లు సమాచారం.

అనారోగ్యం.. కుటుంబ విజ్ఞప్తుల ప్రభావం

గత కొంతకాలంగా గణపతి తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నట్లు సమాచారం. వృద్ధాప్య సమస్యలతో పాటు ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో సాధారణ జీవితం గడపాలని ఆయన భావించినట్లు తెలుస్తోంది. కుటుంబ సభ్యులు కూడా ఆయన్ను లొంగిపోవాలని పలుమార్లు విజ్ఞప్తి చేసినట్లు సమాచారం. ప్రభుత్వం ప్రకటించిన పునరావాస ప్యాకేజీలు, వైద్య సహాయం వంటి అంశాలు కూడా ఆయన నిర్ణయంపై ప్రభావం చూపినట్లు పోలీసు వర్గాలు చెబుతున్నాయి. అధికారిక ప్రకటన వెలువడితే, ఆయన తెలంగాణ పోలీసుల ఎదుట లొంగుబాటు ప్రక్రియ పూర్తయ్యే అవకాశముంది.

టీచర్ నుంచి అండర్‌గ్రౌండ్ నాయకుడిగాగణపతి విప్లవ ప్రస్థానం

Maoist cadres holding red flags during a gathering with illustration of Maoist leader Ganapathy

మావోయిస్టు కేడర్ సమావేశం నేపథ్యంలో అగ్రనేత గణపతి చిత్రణ

తెలంగాణలోని జగిత్యాల జిల్లా బీర్పూర్ గ్రామంలో 1949 జూన్ 16 జన్మించిన ముప్పాళ్ల లక్ష్మణరావు తొలుత ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేశారు. వరంగల్‌లో బీఈడీ చదువుతున్న సమయంలో విప్లవ భావజాలం వైపు ఆకర్షితులై 1970ల మధ్యకాలంలో అజ్ఞాతంలోకి వెళ్లారు. తరువాత పీపుల్స్ వార్ గ్రూప్ (PWG) లో చేరి ఉద్యమ కార్యకలాపాల్లో కీలక పాత్ర పోషించారు. 1992లో పార్టీ వ్యవస్థాపకుడు కొండపల్లి సీతారామయ్యతో విభేదాల తర్వాత గణపతి పార్టీ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు. 2004లో పీపుల్స్ వార్ గ్రూప్, మావోయిస్ట్ కమ్యూనిస్ట్ సెంటర్ ఆఫ్ ఇండియా విలీనమై సీపీఐ (మావోయిస్టు) గా ఏర్పడటంలో ఆయన కీలక పాత్ర పోషించారు. ఈ విలీనంతో ఉత్తర నుంచి దక్షిణ భారతదేశం వరకు విస్తరించిన రెడ్ కారిడార్వ్యూహం బలపడింది.

సంచలన దాడులు.. తరువాతి వైఫల్యాలు

గణపతి నాయకత్వంలో మావోయిస్టులు పలు సంచలన ఘటనలకు పాల్పడ్డారు. 2003లో అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై తిరుమల అలిపిరి వద్ద జరిగిన మ్యాగ్నెటిక్ మైన్స్ దాడి, 2008లో ఒడిశా బలిమెల జలాశయంలో గ్రేహౌండ్స్ బోటుపై దాడి, 2010లో ఛత్తీస్‌గఢ్‌లోని చింతల్నార్ వద్ద 76 మంది సీఆర్‌పీఎఫ్ జవాన్లు మరణించిన ఘటన, 2013లో బస్తర్ జిల్లాలో జిరం లోయలో కాంగ్రెస్ నాయకుల కాన్వాయ్‌పై దాడి వంటి సంఘటనలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. అయితే కాలక్రమేణా భద్రతా దళాల చర్యలు తీవ్రతరం కావడంతో మావోయిస్టు సంస్థ బలహీనపడింది. 2018లో ఆరోగ్య కారణాలతో గణపతి ప్రధాన కార్యదర్శి పదవికి రాజీనామా చేసి బాధ్యతలను నంబాల కేశవరావు అలియాస్ బసవరాజ్ కు అప్పగించారు. అప్పటి నుంచి ఆయన పార్టీ సలహాదారుడిగా కొనసాగుతున్నారు.

నాలుగు దశాబ్దాలకు పైగా అజ్ఞాత జీవితాన్ని గడిపిన గణపతి లొంగుబాటు నిజమైతే, భారత మావోయిస్టు ఉద్యమ చరిత్రలో ఒక సుదీర్ఘ అధ్యాయం ముగిసినట్లేనని విశ్లేషకులు భావిస్తున్నారు.