• Telugu News
  • /National

Nitish Kumar Resign : కేంద్ర‌మంత్రి వ‌ర్గంలోకి బీహార్ సీఎం నితీష్ కుమార్!

బీహార్ సీఎం నితీష్ కుమార్ రాజ్యసభకు నామినేషన్ దాఖలు చేశారు. సీఎం పదవికి రాజీనామా చేసి కేంద్ర మంత్రివర్గంలో చేరే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది.

Reported by: Tejaswini Nanna | జాతీయం | Mar 05, 2026, 1:43 pm IST
Read Time: 5 mins
Nitish Kumar Resign : కేంద్ర‌మంత్రి వ‌ర్గంలోకి బీహార్ సీఎం నితీష్ కుమార్!

విధాత: బీహార్ సీఎం, జేడీయూ అధ్యక్షుడు నితీష్ కుమార్ రాజ్యసభకు నామినేషన్ దాఖలు చేశారు. ఇటీవల జరిగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ-జేడీయూ కూటమి భారీ విజయంతో పదోసారి ఆ రాష్ట్ర సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. అయితే ఆయన సీఎం పదవి నుంచి తప్పుకుని జాతీయ రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరించేందుకు ఆసక్తి చూపుతూ రాజ్యసభ ఎంపీగా ఎన్నికయ్యేందుకు తన నామినేషన్ దాఖలు చేశారు.

దీంతో నితీష్ కుమార్ బీహార్ సీఎం పదవికి రాజీనామా చేయబోతున్నారు. గ‌వ‌ర్న‌ర్ ను క‌లిసి సీఎం ప‌ద‌వికి రాజీనామా స‌మ‌ర్పించనున్నారు. రాజ్య‌స‌భకు ఎన్నిక కాగానే… ప్రధాని నరేంద్ర మోదీ ఆయనను కేంద్ర‌మంత్రి వ‌ర్గంలోకి తీసుకుంటారని సమాచారం. కొత్త రైల్వే మంత్రిగా నితీష్ కుమార్ బాధ్యతలు చేపట్టవచ్చని సమాచారం .

బీహార్‌ సీఎం నీతీశ్‌ కీలక ప్రకటన

బీహార్‌ సీఎం,జేడీయూ అధ్యక్షుడు నీతీశ్‌కుమార్‌ రాజ్యసభకు పోటీచేయనున్నట్లు ఎక్స్‌లో పోస్టు చేశారు. బీహార్‌ శాసన సభ, మండలి, పార్లమెంట్‌ ఉభయ సభల్లో ప్రాతినిధ్యం వహించాలనేది తన చిరకాల కోరిక అని, అది నేరవేర్చుకుంటున్నట్లు నీతీశ్‌ పేర్కొన్నారు. దీంతో బీహార్ సీఎంగా ఆయన స్థానంలో మరొకరు సీఎం పీఠంపై కూర్చోనున్నారు. రెండు దశాబ్దాలుగా తనను ఆదరించినందుకు బీహార్‌ ప్రజలకు ఈ సందర్బంగా నితీష్ ధన్యవాదాలు తెలిపారు. ఆ నమ్మకమే నేడు బిహార్‌కు కొత్త కోణాన్ని చూపించడానికి వీలు పడిందని నీతీష్ కుమార్ తన పోస్టులో పేర్కొన్నారు. మీతో నా ఈ అనుబంధం భవిష్యత్తులో కూడా అలాగే కొనసాగుతుందని నేను పూర్తి నిజాయితీతో హామీ ఇస్తున్నాను. మీ అందరితో కలిసి అభివృద్ధి చెందిన బిహార్ నిర్మాణం అనే సంకల్పం అలాగే కొనసాగుతుంది. కొత్తగా ఏర్పడే ప్రభుత్వానికి నా పూర్తి సహకారం, మార్గదర్శనం ఉంటుంది అని ఆయన అధికారిక ప్రకటనలో పేర్కొన్నారు.

బీహార్ తదుపరి సీఎం బీజేపీకేనా..?

బీహార్‌ సీఎం,జేడీయూ అధ్యక్షుడు నీతీశ్‌కుమార్‌ రాజ్యసభకు పోటీచేయనున్న నేపథ్యంలో ఆయన స్థానంలో తదుపరి బీహార్‌ ముఖ్యమంత్రి ఎవరు? అనే చర్చ మొదలైంది. సీఎం పదవి నుంచి నితీష్ నిష్క్రమణతో బీహార్‌ రాజకీయాల్లో కొత్త శకం మొదలైంది. బీహార్‌లో ఎన్డీయే కూటమి అధికారంలో ఉన్న కారణంగా బీజేపీ ఈ దఫా ముఖ్యమంత్రి స్థానం దక్కించుకునే అవకాశం ఉన్నట్టు సమాచారం. బీహార్ కొత్త సీఎం రేసులో ఉప ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి, హోంమంత్రి నిత్యానంద రాయ్‌ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. నితీష్ కుమార్ కుమారుడు నిశాంత్ డిప్యూటీ సీఎం అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి :

ఎక్సరేలు.. స్కానింగ్ లు లేవు..ప్రాచీన శిల్పాల్లో గర్భస్థ శిశు ఆకృతులు!
Varalaxmi | “బట్టలు కాదు… మనసులు మారాలి”.. చెల్లిని కూడా వంక‌ర‌గా చూస్తారా అంటూ వరలక్ష్మి శరత్‌కుమార్ కామెంట్స్