విధాత, హైదరాబాద్ : తెలంగాణకు రావాల్సిన పెట్టుబడులను గుజరాత్ కు మళ్లీంచేందుకే నా అమెరికా పర్యటనను కేంద్ర ప్రభుత్వం అడ్డుకుందని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. సోమవారం ఆయన హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడుతు తన అమెరికా పర్యటనకు కేంద్రం అనుమతి నిరాకరించడంపట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్య, క్రీడలు, పెట్టుబడుల కోసమే అమెరికా పర్యటనకు వెళ్తున్నట్లు దరఖాస్తు చేశానని, షెడ్యూల్ క్లియర్ గా ఉన్నప్పటికి కేంద్రం నిరాకరించిందని రేవంత్‌రెడ్డి చెప్పారు. నా పర్యటనకు అనుమతి నిరాకరించిన కేంద్రం..అదే సమయంలో గుజరాత్ సీఎం పర్యటనకు అనుమతినిచ్చిందని గుర్తు చేశారు. కేవలం తెలంగాణకు రావాల్సిన పెట్టుబడులను గుజరాత్ కు మళ్లీంచేందుకే నా పర్యటనను కేంద్రం అడ్డుకుందని, లేకపోతే గుజరాత్ సీఎంకు అనుమతినిచ్చి, తెలంగాణ సీఎంకు ఎందుకు అనుమతి ఇవ్వరని కేంద్రాన్ని ప్రశ్నించారు.
యూకే, అమెరికాకు ఒకే విధానంతో వెళ్తున్నామని చెప్పాం. అలాంటప్పుడు యూకే పర్యటకు అనుమతి ఇచ్చి అమెరికాకు ఎందుకు నిరాకరించారో ప్రధాని నరేంద్ర మోడీ సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. నా అమెరికా పర్యటన తిరస్కరణకు గుజరాతీ ఆధిపత్య ధోరణి కారణం అని, నరేంద్ర మోడీ ఇప్పటికీ గుజరాత్ సీఎంగా వ్యవహరిస్తున్నారే తప్పా భారత ప్రధానిగా ఆలోచించడం లేదన్నారు. నేను కాంగ్రెస్ సీఎం కావడం, తెలంగాణ సీఎం కావడంతోనే నా పర్యటనకు అనుమతి నిరాకరించారని, ఇందులో తెలియని రాజకీయ ఎజెండా ఏంటని ప్రశ్నించారు.
ఫెడరల్ స్ఫూర్తికి విరుద్దం..
నా పర్యటనను బీజేపీ కేంద్ర ప్రభుత్వం అడ్డుకోవడం తెలంగాణ సీఎంతో పాటు తెలంగాణ ప్రజలను అవమానించడమే అవుతుందన్నారు. రాజకీయ కారణాల వల్ల అనుమతి నిరాకరిస్తున్నామని విదేశాంగశాఖ బదులిచ్చిందని.. కేంద్రంలో ఉన్న కొందరు బీజేపీ నేతలు కేంద్రాన్ని తప్పుదోవ పట్టించారని అన్నారు. కేంద్రం తీరు ఫెడరల్ స్పూర్తికి విఘాతం కల్గించిందని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. తెలంగాణ అభివృద్ధికి కేంద్రం మోకాలడ్డుతుందని, త్రిబుల్ ఆర్, మెట్రో విస్తరణలో కూడా కేంద్రం అడ్డుపడుతుందని విమర్శించారు. రాష్ట్ర బీజేపీ నేతలు కేంద్రాన్ని నా పర్యటన విషయంలో తప్పుదోవ పట్టించారని, ఇందుకు రాష్ట్ర బీజేపీ ఎంపీలు, నాయకులు సమాధానం చెప్పాలన్నారు.
తెలంగాణ బీజేపీ ఎంపీలు గుజరాత్‌ను సపోర్టు చేస్తున్నారా? తెలంగాణ అభివృద్ది బీజేపీ ఎంపీలకు అవసరం లేదా అని ప్రశ్నించారు. నా అమెరికా పర్యటనకు అనుమతి నిరాకరణపై పార్లమెంటులో కేంద్రాన్ని నిలదీస్తామని ప్రకటించారు. హైదరాబాద్‌లో ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్‌లు పెట్టేందుకు ఆక్స్‌ఫర్డ్, లండన్ యూనివర్సిటీ, లండన్ బిజినెస్ స్కూల్ సుముఖత చూపించినట్లు సీఎం తెలిపారు.