వారసులను దించేస్తున్నారు !.. హీట్ పెంచుతున్న కర్చీఫ్‌ కల్చర్!!

తెలంగాణలో డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ల నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో రాజకీయ వారసుల ఎంట్రీ పెరుగుతోంది. గుత్తా, కొండా కుటుంబాలు ఇప్పటికే వారసులను బరిలోకి దింపే సంకేతాలు ఇచ్చాయి.

వారసులను దించేస్తున్నారు !.. హీట్ పెంచుతున్న కర్చీఫ్‌ కల్చర్!!

(వై.వెంకటనరసింహారెడ్డి)

తెలంగాణలో వచ్చేవి జమిలి ఎన్నికలేనని.. రానున్న ఎన్నికలలో తన కుమారుడు ఎంపీ లేదా ఎమ్మెల్యేగా పోటీ చేస్తారని.. తాను ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటానంటూ తాజాగా శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. మండలి చైర్మన్‌గా తన పదవీ కాలం పూర్తయ్యిక.. అవకాశం వస్తే మండలిలోనే కొనసాగుతానన్నారు. వచ్చే ఎన్నికల నాటికి రాష్ట్రంలో నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్)తో కొత్త నియోజకవర్గాలు ఏర్పడుతాయని, పలు నియోజకవర్గాలలో మార్పులు చోటుచేసుకుంటాయని, పునర్విభజనతో, మహిళా రిజర్వేషన్లతో ఏర్పడే రాజకీయ ప్రభావాలను ఇప్పుడే అంచనా వేయలేమని కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. గుత్తా తను ప్రత్యక్ష ఎన్నికలలో పోటీ చేయబోనంటూనే.. తనకు బదులుగా కుమారుడు అమిత్ రెడ్డి పోటీ చేస్తారంటూ  ముందస్తుగా వచ్చే ఎన్నికలలో సీటు కోసం కర్చీఫ్‌ వేసేశారు. గత అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లోనూ అమిత్ రెడ్డి కోసం గుత్తా టికెట్ ప్రయత్నం చేశారు. అయితే వచ్చే ఎన్నికలలో సీట్ల పెంపుతో ఆయనకు ఏదో ఒక స్థానంలో టికెట్ దక్కనుందనే ఆశాభావంతో ఉన్నారు.

సరిగ్గా అంతకుముందు వరంగల్ జిల్లాకు చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు కొండా మురళి… కొమ్మాల జాతరలో మాట్లాడుతూ..  పరకాల తమ అడ్డా అని.. ఇక్కడి నుంచి వచ్చే ఎన్నికల్లో తన బిడ్డ కొండా సుస్మిత పోటీ చేస్తుందంటూ ముందస్తు ప్రకటన చేసేశారు. ప్రస్తుతం కొండా సురేఖ వరంగల్ తూర్పు నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తుండగా.. కూతురికి వచ్చే ఎన్నికలలో పరకాల సీటు టికెట్ కోసం కర్చీఫ్‌ వేసేశారు.

డీలిమిటేషన్ నీడన ఎన్నికల్లోకి వారసుల ప్రవేశం

దేశవ్యాప్తంగా జనగణన.. డీలిమిటేషన్ ప్రక్రియ పూర్తి చేసి పెరిగిన పార్లమెంటు, రాష్ట్రాల అసెంబ్లీ స్థానాలతో, 33శాతం మహిళా రిజర్వేషన్లతో జమిలి ఎన్నికలకు వెళ్లాలని బీజేపీ సారథ్యంలోని  ఎన్డీఏ కసరత్తు చేస్తున్నది. తెలంగాణలో కూడా జమిలి ఎన్నికలు జరుగుతాయని ఇప్పటికే బీజేపీ నుంచి స్పష్టమైన సంకేతాలు వెలువడ్డాయి. దీంతో తెలంగాణలో డీలిమిటేషన్‌తో ప్రస్తుతం ఉన్న అసెంబ్లీ స్థానాలు 119నుంచి 153 వరకు పెరగవచ్చని అంచనా వేస్తున్నారు. అందులో 51నుంచి 60 ఎమ్మెల్యే స్థానాలు మహిళలకు దక్కవచ్చు. లోక్ సభ స్థానాలు 17నుంచి 23నుంచి 25వరకు పెరగవచ్చని విశ్లేషిస్తున్నారు. ఇందులోనూ మహిళలకు 7 స్థానాలు దక్కవచ్చు. పెరిగిన ఎమ్మెల్యే, ఎంపీ స్థానాలతో ఎస్సీ, ఎస్టీ రిజర్వుడ్‌ స్థానాలు కూడా సహజంగానే పెరుగనున్నాయి. ఈ నేపథ్యంలో కొత్తగా రాజకీయాల్లోకి వచ్చేవారికి, రాజకీయ నేతల వారసులకు, మహిళలకు రాజకీయ రంగ ప్రవేశానికి రానున్న ఎన్నికలే సరైన సందర్భంగా భావిస్తున్నారు.

ఆ జిల్లాల్లో వారసుల ఎంట్రీ పక్కా

డీలిమిటేషన్‌తో పెరుగనున్న సీట్లు, రిజర్వేషన్లతో పెద్ద సంఖ్యలో కొత్త ముఖాలు, వారసులు వచ్చే ఎన్నికల్లో పోటీకి సై అంటున్నారు. నిజామాబాద్ జిల్లాలో సీనియర్ నాయకుడు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి తన కుమారులు భాస్కర్ రెడ్డి, సురేందర్ రెడ్డిలలో ఒకరిని పోటీకి దించే ప్రయత్నాల్లో ఉన్నారు. నిజామాబాద్ రూరల్ లేదా మరో నియోజకవర్గం నుంచి బాజిరెడ్డి గోవర్ధన్‌ తన వారసుడు బాజిరెడ్డి జగన్మోహన్ రెడ్డిని ఎన్నికల బరిలోకి దించడం ఖాయంగా కనిపిస్తున్నది. బాల్కొండ నుంచి మాజీ ఎమ్మెల్యే అన్నపూర్ణమ్మ తన కుమారుడు మల్లిఖార్జున్ రెడ్డిని ఎన్నికలకు సిద్దం చేస్తున్నారు. కరీంనగర్ జిల్లా వేములవాడలో మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు కుమారుడు వికాస్ రావు భార్య దీప్తి పోటీకి సై అంటున్నారు.

మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి… మహిళా రిజర్వేషన్ నేపథ్యంలో తన సతీమణి కోమటిరెడ్డి లక్ష్మిని కూడా పోటీ చేయించవచ్చన్న ప్రచారం వినిపిస్తున్నది. లేదంటే సోదరుడైన కోమటిరెడ్డి మోహన్ రెడ్డి కుమారుడు డాక్టర్ సూర్య పవన్ రెడ్డిని బరిలో దించుతారని తెలుస్తున్నది. గుత్తా సుఖేందర్ రెడ్డి కుమారుడు అమిత్ రెడ్డి ఎంపీ లేదా ఎమ్మెల్యేగా పోటీ ఖాయం. ఇదే జిల్లాలో భువనగిరి కాంగ్రెస్ ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి కూతురు కీర్తిరెడ్డి ఎంపీ లేదా ఎమ్మెల్యేగా పోటీకి సిద్దంగా ఉన్నారు. మాజీ మంత్రి ఎలిమినేటి మాధవరెడ్డి కుమారుడు సందీప్ రెడ్డి కూడా ఎన్నికల సమయానికి తెరపైకి రావచ్చంటున్నారు. పరకాలలో కొండా దంపతుల కూతురు సుస్మిత పోటీకి రెడీ అని ప్రకటించేశారు.

రంగారెడ్డి జిల్లాలో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తనయుడు కార్తీక్ రెడ్డి, మాజీ మంత్రి దేవేందర్ గౌడ్ తనయుడు వీరేందర్ గౌడ్ పోటీకి సిద్దంగా ఉన్నారు. సికింద్రాబాద్ పరిధిలో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కుమారుడు సాయికిరణ్ యాదవ్, గవర్నర్ బండారు దత్తాత్రేయ కూతురు విజయలక్ష్మి, మాజీ మంత్రి టి.పద్మారావు గౌడ్ తనయుడు రామేశ్వర్ గౌడ్ టికెట్ ఆశిస్తున్నారు. ముషీరాబాద్‌లో ముఠా గోపాల్ తనయుడు జైసింహ, మాజీ మంత్రి నాయిని నరసింహారెడ్డి అల్లుడు శ్రీనివాస్ రెడ్డి పోటీకి ఉవ్విళ్లూరుతున్నారు. కుత్బుల్లాపూర్ పరిధిలో కాసాని జ్ఞానేశ్వర్‌ ముదిరాజ్‌ కుమారుడు కాసాని విరేష్, శేరిలింగం పల్లి పరిధిలో మాజీ ఎమ్మెల్యే భిక్షపతి కొడుకు రవికుమార్, సనత్ నగర్ సీనియర్ నాయకులు మర్రి శశీధర్ రెడ్డి తనయుడు పూరూరవ రెడ్డి, ఖైరతాబాద్ పరిధిలో కేకే కూతురు విజయలక్ష్మి, పీ జనార్దన్‌ రెడ్డి కుమార్తె విజయారెడ్డి పోటీకి ఆసక్తిగా ఉన్నారు. ఇలా చెప్పుకొంటూ పోతే రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలలో రాజకీయ వారసులు, మహిళలు, కొత్త వారు వచ్చే ఎన్నికల్లో పెరుగనున్న ఎంపీ, ఎమ్మెల్యే స్థానాల్లో పోటీకి సిద్ధమవుతుండటం ఆసక్తి రేపుతున్నది.

ఇవి కూడా చదవండి :

మూసీ పేరుతో లూటీకి సీఎం రేవంత్ ప్లాన్ : కేటీఆర్
శత్రు దేశాల చమురు నౌకలపైనే మా దాడులు: ఇరాన్ ప్రకటనతో ఊరట