మూసీ పేరుతో లూటీకి సీఎం రేవంత్ ప్లాన్ : కేటీఆర్
మూసీ సుందరీకరణ ప్రాజెక్టు పేరుతో రూ.1.5 లక్షల కోట్ల లూటీకి సీఎం రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. పేదల ఇళ్లు కూల్చడాన్ని బీఆర్ఎస్ అడ్డుకుంటుందని తెలిపారు.
విధాత, హైదరాబాద్ : రూ.16 వేల కోట్లతో అయ్యే మూసీ సుందరీకరణ ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని సీఎం రేవంత్ రెడ్డి రూ. 1లక్షా 50వేల కోట్లకు పెంచి ప్రజాధనాన్ని లూటీ చేసే ప్రయత్నం చేస్తున్నాడని..దీనిని బీఆర్ఎస్ అడ్డుకుని తీరుతుందని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. మూసీ సుందరీకరణకు బీఆర్ఎస్ వ్యతిరేకం కాదు అని, మూసీ ప్రక్షాళన పేరుతో దోపిడీకి మేం వ్యతిరేకం అని, పేదల ఇళ్లు కూల్చడానికి వ్యతిరేమని తెలిపారు. పేదల ఇండ్లు కూల్చకుండా మూసీ సుందరీకరణ చెయ్యాలని కోరారు. మూసీ సుందరీకరణ పనుల బాధ్యత మాకు అప్పగిస్తే రూ.16వేల కోట్లకే చేసి చూపిస్తాం. ఒక్క ఇల్లు కూడా కూల్చకుండా మూసీన నది పరివాహకాన్ని అభివృద్ది చేసి చూపిస్తామని కేటీఆర్ పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి రెండున్నరేళ్లలో హైదరాబాద్ లో ఒక్క ఇల్లు కూడా కట్టలేదని, కట్టినట్లుగా చూపిస్తే నేను రాజకీయ సన్యాసం చేస్తానని కేటీఆర్ సవాల్ విసిరారు.
బీఆర్ఎస్ హయాంలో చేసిన ఉప్పల్ నాగోల్ ప్రాంతంలో చేపట్టిన మూసీ డెవలప్‌మెంట్ ప్రాంతాన్ని పరిశీలించారు. నాగోల్‌లో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన 320 ఎంఎల్‌డీ సామర్థ్యం గల దేశంలోనే అతిపెద్ద సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్‌ను సందర్శించారు. మూసీ సుందరీకరణ ప్రాజెక్ట్ బాధితులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు.
ఈ సందర్బంగా కేటీఆర్ మాట్లాడుతూ మూసీ సుందరీకరణ ప్రాజెక్టుపై రెండున్నరేళ్ళు అయ్యింది కానీ ఇప్పటివరకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కనీసం డీపీఆర్ కూడా తయారు చేయలేదన్నారు. ఇండ్లు కూల్చకుండా, భూములు లాక్కోకుండా తక్కువ ఖర్చుతో కేవలం రూ.6కోట్లతో మూసీని ఎలా సుందరీకరించవచ్చో నాగోల్ లో బీఆర్ఎస్ చేసి చూపించిందన్నారు. మూసీ నది పై మంచిరేవుల నుంచి ఘట్ కేసర్ వరకు 55కిలో మీటర్లు ఎక్స్ ప్రెస్ హైవే రూ.10వేలతో కట్టినా..4వేలకోట్ల ట్రీట్ మెంట్ ప్లాంట్లు, 2వేల కోట్ల సుందరీకరణ పనులు కలిపి మొత్తం మూసీ ప్రక్షాణలకు రూ.16వేల కోట్లు మాత్రమే అవసరం అన్నారు. మూసీపై ఎక్స్ ప్రెస్ హైవేకు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే డీపీఆర్ తయారు చేశారని గుర్తు చేశారు. మూసీ నదిని శుద్దీ చేయడం, గోదావరి నీళ్లను అనుసంధానించడం కేసీఆర్ మూసీ ప్రక్షాళన ప్లాన్ లో భాగంగా ఉండేదన్నారు. రూ.1100కోట్లతో గోదావరిని అనుసంధానించే ప్రణాళిక కేసీఆర్ కేబినెట్ ఆమోదించిందని గుర్తు చేశారు. 15బ్రిడ్జీలకు, దాని కింద చెక్ డ్యామ్ లు కట్టేందుకు 500కోట్లతో ఆనాడు మా కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు.
బుల్డోజర్ ప్రభుత్వాన్ని నడిపిస్తున్న కాంగ్రెస్
గతంలో కాంగ్రెస్ ప్రభుత్వమే పర్మిషన్ ఇచ్చిన ఇండ్లకు రెడ్ మార్క్ వేసి, నోటీసులు ఇవ్వకుండా అధికారులే వచ్చి అనధికారికంగా బెదిరిస్తున్నారు అని కేటీఆర్ మండిపడ్డారు. ఉత్తర ప్రదేశ్ లో బుల్డోజర్ రాజ్యం నడుస్తున్నది అని విమర్శించే రాహుల్ గాంధీ..మరి మీరు తెలంగాణాలో చేస్తున్నది ఏందీ? అని.. దీన్ని ఏమనాలి? ఇది బుల్డోజర్ రాజ్యం కాదా? అని కేటీఆర్ ప్రశ్నించారు. శత్రు దేశం మీద దాడికి పోయినట్టు వేల మంది పోలీసులను పెట్టి అర్దరాత్రి దొంగల్లాగా ఖమ్మంలో భూదాన్ భూముల్లో వెయ్యి మంది పేదల ఇండ్లు కూల్చేశారు అని, హైడ్రా చేస్తున్న అరాచకాలకైతే అంతే లేదు అని విమర్శించారు. కోస్గీలో సీఎం రేవంత్ రెడ్డి ఇల్లు రెడ్డికుంటలో ఉందని, ఆయన సోదరుడు తిరుపతిరెడ్డి ఇల్లు, మంత్రులు వీవేక్, పొంగులేటి, కేవీపీ, పట్నం మహేందర్ రెడ్డి ఇండ్లు బఫర్ జోన్ లోనే ఉన్నా హైడ్రాకు కనపడటం లేదన్నారు. పేదల ఇల్లు కూల్చుతున్న రేవంత్ రెడ్డిని సందర్బం వచ్చినప్పుడు ఏ కుర్చీలో కూర్చుని ఎగిరిపడుతున్నాడో..అదే కుర్చీని మడతపెట్టి కొట్టే రోజు దగ్గరలోనే ఉందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి చెబుతున్న మూసీ బ్యూటీఫికేషన్ కాదు..లూటీఫికేషన్ అని కేటీఆర్ మండిపడ్డారు.
కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు గెలిపించిందే ఆరు గ్యారంటీలు, 420 హామీల అమలు కోసమేనని గుర్తు చేశారు. ఇప్పుడు వాటన్నింటిని వదిలేసి ఇండ్లు కూల్చుడు, మూసీ ప్రక్షాళన, ఫ్యూచర్ సిటీలు అంటూ కొత్తగా మాయమాటలు చెబుతున్నాడని కేటీఆర్ విమర్శించారు. రైతుభరోసా, మహాలక్ష్మి రూ.2,500సహాయం, రూ.4వేల పెన్షన్ హామీలన్ని గాలికి వదిలేశాడని ఆరోపించారు. పేదల ఇళ్లకు అండగా రేవంత్ బుల్డోజర్లకు గులాబీ దండు అడ్డుపడుతుందన్నారు. విధ్వంసం కాదు..నిర్మాణం జరుపాలని డిమాండ్ చేశారు.
ఇవి కూడా చదవండి :
శత్రు దేశాల చమురు నౌకలపైనే మా దాడులు: ఇరాన్ ప్రకటనతో ఊరట
Gold Prices Drop | తగ్గిన బంగారం..స్థిరంగా వెండి ధరలు
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram