విధాత : కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అన్యాయం జరగొద్దనే యాదగిరిగుట్ట దేవాలయ పాలక మండలి(YTDA) నియామకంలో ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబడుతూ ముక్కుసూటిగా ఓపెన్ గా మాట్లాడానని, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నేను మాట్లాడలేదు అని మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వివరణ ఇచ్చారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపాలిటీ కేంద్రంలో కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ప్రారంభించిన అనంతరం కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి మాట్లాడారు. మంత్రి పదవి ఇవ్వడం లేదన్న అసంతృప్తితో పార్టీకి అంటిముంటనట్లుగా ఉంటున్నారన్న ఆరోపణలను కొట్టిపారేశారు.
పార్టీకి దూరంగా ఉంటున్నానన్న మాటల్లో వాస్తవం లేదు, పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటూ కాంగ్రెస్ కార్యకర్తలను కాపాడుకుంటున్నానని, స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను గెలపించుకున్న సంగతి ఇందుకు నిదర్శనం అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకునన్న కొన్ని నిర్ణయాలను తప్పుపడుతున్నానే తప్ప.. పార్టీని కాదు అని స్పష్టం చేశారు. పార్టీ అభివృద్దిపై రాజీపడబోమని, వచ్చే ఎన్నికల్లో కూడా పార్టీ అధికారంలోకి వచ్చేందుకు పనిచేస్తున్నానన్నారు.
నాకు పదవులు ముఖ్యం కాదు,పార్టీ బలోపేతమే ముఖ్యం అని, రాహుల్ గాంధీని ప్రధాని చేయడమే మా లక్ష్యం అని తెలిపారు. రాహుల్ గాంధీని కలిసినప్పుడు నాకోసం కేటాయించిన సమయం రాష్ట్రంలో ఏ నాయకుడికి కేటాయించలేదని చెప్పుకొచ్చారు. రాహుల్ గాంధీ విజన్ ఉన్న నాయకుడు,ఆయన ఆలోచనా విధానం బాగుంటుంది,రాహుల్ గాంధీ సేవలు దేశానికి అవసరం అన్నారు. రాహుల్ గాంధీని కలిసిన సమయంలో తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు,ప్రభుత్వ పని తీరుపై నాతో చర్చించారని, రాబోయే రోజుల్లో పార్టీ అధికారంలోకి రావాలనే అంశాలపై ఇద్దరి మధ్య సుదీర్ఘ చర్చ జరిగిందన్నారు.
ప్రస్తుత రాష్ట్ర రాజకీయాలు,కుటుంబ పరిస్థితులపై చర్చించాం అని, రాహుల్ గాంధీకి నేను కొన్ని సలహాలు, సూచనలు చేశానని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యేందుకు రాష్ట్రంలో,కేంద్రంలో పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు ప్రతి కాంగ్రెస్ కార్యకర్త సైనికుడిగా పనిచేయాలన్నారు. పదవులు ఉన్నా లేకున్నా కాంగ్రెస్ పార్టీ గెలుపు, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యేవరకు కృషి చేస్తానన్నారు.