తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీల మధ్య కుటుంబ పరమైన రాజకీయ విమర్శలు సెగలు రేపుతున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి అధికార దుర్వినియోగంతో తన సోదరుడు, బావ మరిదికి చెందిన షెల్ కంపెనీలకు అక్రమంగా భూములు, కాంట్రాక్టులు కట్టబెట్టారంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి టి.హరీశ్ రావు చేసిన విమర్శలు హాట్ టాపిక్ గా మారాయి.
ఇదేనా ప్రజాపాలనా? అనుముల కుటుంబపాలనా? :
సీఎం రేవంత్ రెడ్డి వేల కోట్ల ప్రజా, ప్రభుత్వ భూములను స్వయంఉపాధి పథకంలా తన సొంత కుటుంబసభ్యులకు రాసిస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. తన సోదరుడు అనుముల కొండల్‌రెడ్డికి చెందిన ఊరు పేరులేని, ఒక్క ఉద్యోగి కూడా లేనటువంటి.. టెస్సెరాక్ట్ అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ అనే షెల్ కంపెనీకి రూ.200 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని ఎలా కేటాయిస్తారని ఆయన నిలదీశారు.నిజమైన స్టార్టప్‌ల అభివృద్ధి కోసం మేం టీ-హబ్‌ను నిర్మించామని కేటీఆర్ పేర్కొన్నారు. ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి ఎలాంటి ఆవిష్కరణలు, ఉద్యోగులు లేకుండా కుటుంబ సభ్యుల కోసం ‘అనుముల హబ్స్’ను రూపొందిస్తున్నారని విమర్శించారు.‘అనుముల కొండల్‌రెడ్డి’ని శతాబ్దపు గొప్ప ఆవిష్కర్తగా ప్రతిపాదిస్తున్నానంటూ కేటీఆర్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
సీఎం మరో సోదరుడు జగదీశ్‌రెడ్డి అమెరికాలో ఉండగా, ముఖ్యమంత్రి అమెరికా పర్యటన సందర్భంగా స్వచ్ఛ్ బయో సంస్థతో సుమారు రూ.వెయ్యి కోట్ల ఒప్పందానికి సంబంధించిన ఎంవోయూ జరిగిందని కేటీఆర్ ఆరోపించారు. ఆ ఒప్పందం తర్వాత ఆ సంస్థకు ఎకడైనా భూములు కేటాయించారా? పెట్టుబడులు వచ్చాయా? అనే అంశాలను కూడా వెలికితీస్తామని తెలిపారు.
సీఎం బావమరిది సృజన్‌రెడ్డికి సంబంధించిన రూ.1,137 కోట్ల అమృత్ కాంట్రాక్టులపై గతంలోనే ప్రశ్నలు లేవనెత్తామని కేటీఆర్ గుర్తుచేశారు. సింగరేణి, సైట్ విజిటేషన్ సర్టిఫికెట్లు, ఇతర కాంట్రాక్టుల్లోనూ అక్రమాలు జరిగాయని తాము గతంలో ఆధారాలతో ప్రజల ముందుంచామని చెప్పారు.
సీఎం మరో సోదరుడు అనుముల తిరుపతిరెడ్డికి ఎలాంటి అధికారిక హోదా లేకపోయినా కొడంగల్‌లో అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని కేటీఆర్ ఆరోపించారు. ముఖ్యమంత్రి అల్లుడి కోసం, ఆయన పార్ట్‌నర్‌గా ఉన్న మ్యాక్స్ బీఎన్ ఫార్మా కంపెనీ కోసం లగచర్ల గిరిజనుల భూములు లాక్కున్నారని కేటీఆర్ పేర్కొన్నారు. భూసేకరణ తర్వాత ప్లాట్ల పంపిణీ కార్యక్రమానికీ తిరుపతిరెడ్డే ముఖ్య అతిథిగా ప్రోటోకాల్ కు విరుద్దంగా హాజరయ్యాడని గుర్తు చేశారు. ఇదేనా ప్రజాపాలనా? అనుముల కుటుంబపాలనా? ముఖ్యమంత్రి కుటుంబం దోపిడీ చేస్తే మంత్రులు వంతపాడటమే ప్రజాపాలనా? అని కేటీఆర్ ప్రశ్నించారు.
కేటీఆర్ ఆరోపణలకు కాంగ్రెస్ స్ట్రాంగ్ కౌంటర్
సీఎం రేవంత్ రెడ్డి కుటుంబ పాలన సాగిస్తూ తన సోదరులు,కుటుంబ సభ్యులకు ప్రభుత్వ భూములు, కాంట్రాక్టులు కట్టబెడుతున్నారన్న కేటీఆర్, హరీశ్ రావు ఆరోపణలపై కాంగ్రెస్ నుంచి మంత్రి శ్రీధర్ బాబు, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డిలు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ ఉద్యమ సమయంలో..కేసీఆర్ నా కుటుంబ సభ్యులు ఎవరూ రాజకీయాల్లోకి రారు అని చెప్పారని, అందుకు భిన్నంగా కేసీఆర్ కుటుంబ సభ్యులు అంతా రాజకీయాల్లోకి చొరబడ్డారని గుర్తు చేశారు. తెలంగాణ తొలి ప్రభుత్వంలో కేసీఆర్ కల్వకుంట్ల కుటుంబం తీవ్ర అధికార దుర్వినియోగానికి పాల్పడి దోచుకున్న సంగతి మరువరాదంటూ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి చురకలు వేశారు.
ఉమ్మడి రాష్ట్రంలో కేసీఆర్ కేంద్ర మంత్రి పదవని, అల్లుడు హరీశ్ రావు ఎమ్మెల్యే కాకుండానే రాష్ట్రంలో మంత్రి పదవి పొందారని, స్వరాష్ట్రంలో అల్లుడు హరీశ్, అమెరికా నుంచి వచ్చిన కొడుకు కేటీఆర్ మంత్రులుగా, కవిత ఎంపీగా, ఎమ్మెల్సీగా, సంతోష్ రావు ఎంపీగా పదవులు పొంది..అనేక విధాలుగా వేలకోట్లు దండుకున్నారని ఆరోపించారు. వారితో పాటు వారి బంధువులకు కూడా పదవులు, కాంట్రాక్టులు ఇచ్చిన సంగతి తెలంగాణ సమాజం చూసిందన్నారు. కాళేశ్వరం సహా అనేక స్కామ్ లకు పాల్పడి తెలంగాణ నిధులను, వనరులను దోచుకుని..ఫామ్ హౌస్ లు కట్టుకుని కల్వకుంట్లు కుటుంబంలోని అందరూ వేలకోట్లకు ఎదిగిపోయారని విమర్శించారు. ఇప్పుడు దొంగే దొంగ అన్నట్లుగా నాడు కుటుంబ పాలన సాగించిన కల్వకుంట్ల సభ్యులే..రేవంత్ రెడ్డిని కుటుంబ పాలన అంటూ విమర్శించడం విడ్డూరంగా ఉందని చామల ఎద్దేవా చేశారు.
మీలాగా రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులకు పదవులు ఇచ్చుకోలేదు..
రేవంత్ రెడ్డి కుటుంబంలో ఎవరు ఎమ్మెల్యే,ఎంపీ,మంత్రి కాలేదు అని, బీఆర్ఎస్ పాలనలో కల్వకుంట్ల కుటుంబ సభ్యులకు ఇచ్చినట్లుగా సీఎం రేవంత్ రెడ్డి తన ఐదుగురు అన్నదమ్ముళ్లకు ఏ పదవి అయినా ఇచ్చే అవకాశం ఉందని, కాని ఇవ్వలేదని గుర్తు చేశారు. అందరికి ఇచ్చినట్లు రేవంత్ రెడ్డి తన సోదరునికి అప్లికేషన్ పెట్టుకుంటే భూమి కేటాయించారు అన్నారు. కేటీఆర్ మంత్రిగా ఉన్నప్పుడు ఎవరెవరికి భూములు ఇచ్చారో,ఏ దోస్తులకు కంపెనీలు కట్టబెట్టారో మాకు అంతా తెలుసు అని, దీనిపై ఇప్పటికే మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడారని గుర్త్ చేశారు. కల్వకుంట్ల కుటుంబం దోచుకున్న ప్రజాధనం పంపకాలలో తేడా వచ్చి కవిత కొత్త పార్టీ పెట్టారు అని చామల విమర్శించారు. ఇప్పటికైనా కేటీఆర్ పిచ్చి మాటలు బంద్ చేయాలి అన్నారు. తన కుటుంబం తప్ప..ఎవరూ బాగుపడవద్దని కేటీఆర్ ఉన్మాదిగా వ్యవహరిస్తున్నారన్నారు.
నాడు ఈటెలపై పన్నిన కుటల వ్యూహమే నేడు కొండల్ రెడ్డిపైన..
అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా గులాబీ పార్టీ బురదజల్లే రాజకీయాలు ఏమాత్రం మారలేదు. నాడు సొంత పార్టీలో ఉన్న ఈటల రాజేందర్‌ను బద్నాం చేయడానికి వాడిన కుటిల వ్యూహాన్నే, నేడు ప్రస్తుత సీఎం సోదరుడు కొండల్ రెడ్డిపై కూడా ప్రయోగిస్తున్నారని కాంగ్రెస్ సోషల్ మీడియా కౌంటర్ ఎటాక్ చేసింది. పరిశ్రమలు స్థాపించే వారికి ప్రభుత్వం రాయితీపై భూములు ఇవ్వడం ఆనవాయితీ. నాడు ఈటల రాజేందర్ సైతం పారిశ్రామికవేత్తగా నిబంధనల ప్రకారం, టీఎస్‌ఐఐసీ (TSIIC) ద్వారా తన సంస్థ కోసం చట్టబద్ధంగా భూములు తీసుకున్నారు. కానీ అవే భూములను సాకుగా చూపి, ఆయనను ఓ మోసగాడిగా చిత్రీకరించి ఆయన క్యారెక్టర్‌ను దెబ్బతీసే ప్రయత్నం చేసి..పార్టీ నుంచి సాగనంపారని కాంగ్రెస్ విమర్శించింది.
బీఆర్ఎస్ గోబెల్స్ ప్రచారాన్ని జనం నమ్మరు : మంత్రి శ్రీధర్ బాబు
సోదరుడు అనుముల కొండల్‌రెడ్డికి చెందిన ఊరు పేరులేని, ఒక్క ఉద్యోగి కూడా లేనటువంటి.. టెస్సెరాక్ట్ అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ అనే షెల్ కంపెనీకి రూ.200 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని సీఎం రేవంత్ రెడ్డి కేటాయించారంటూ బీఆర్ఎస్ నేత కేటీఆర్ చేస్తున్న ఆరోపణలు పూర్తిగా అసత్యం అని మంత్రి శ్రీధర్ బాబు కొట్టిపారేశారు. బోర్డు నిబంధనల మేరకు పారిశ్రామిక వేత్తలకు భూ కేటాయింపులు జరుగుతున్నాయని స్పష్టం చేశారు. తాము కోటిన్నర రూపాయిలకు ఇచ్చిన భూమిని బీఆర్ఎస్ ప్రభుత్వం రూ. 90 లక్షలకే ఇచ్చిందని గుర్తు చేశారు.5 ఎకరాల భూమిని రూ.7.5 కోట్లకు ఇచ్చామని చెప్పారు. కేటీఆర్ చెబుతున్న రూ. 200 కోట్లు ఎక్కడివో చెప్పాలని నిలదీశారు.బీఆర్ఎస్ గోబెల్స్ ప్రచారాన్ని ప్రజలు నమ్మడం లేదని పేర్కొన్నారు. అందుకే ఎంపీ, స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పార్టీని ఓడించారని పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు చెప్పారు. బీఆర్ఎస్ హయాంలో జరిగిన భూ కేటాయింపులపై విచారణ జరిపిస్తామని..వారు చేసిన అక్రమాలను ప్రజల ముందుంచుతామని పేర్కొన్నారు.