బోర్డు నిర్ణయం మేరకు కంపెనీలకు భూముల కేటాయింపు: మంత్రి శ్రీధర్ బాబు

టెస్సెరాక్ట్‌ సంస్థకు భూ కేటాయింపులపై కేటీఆర్‌ ఆరోపణలను మంత్రి శ్రీధర్‌బాబు ఖండించారు. బోర్డు నిర్ణయం మేరకే నిబంధనల ప్రకారం భూమి కేటాయించామన్నారు.

Reported by: Tejaswini Nanna | తెలంగాణ‌ | Aug 12, 2026, 4:15 pm IST
Read Time: 7 mins
బోర్డు నిర్ణయం మేరకు కంపెనీలకు భూముల కేటాయింపు: మంత్రి శ్రీధర్ బాబు

టెస్సెరాక్ట్ సంస్థకు భూ కేటాయింపులపై బీఆర్‌‌ఎస్‌‌ వర్కింగ్‌‌ ప్రెసిడెంట్‌‌ కేటీఆర్‌‌ చేసిన ఆరోపణల్లో ఏమాత్రం వాస్తవం లేదని పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌‌బాబు స్పష్టం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి సోదరులకు భూ కేటాయింపులు చేశారంటూ కేటీఆర్ అబద్ధాలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. పరిశ్రమలు, పెట్టుబడులు, నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలన్న ఉద్దేశంతో బోర్డు నిర్ణయం మేరకే పరిశ్రమలకు భూములు ఇస్తున్నామని మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు. మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. భూమి విలువకు సంబంధించి లేనిపోనివి చెప్పి ప్రతిపక్ష నాయకులు ప్రజలను పక్కదోవ పట్టిస్తున్నారన్నారు. పరిశ్రమల ప్రోత్సాహానికి రాయితీలు, భూములు ఇవ్వడం సహజమేనన్నారు.

గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో ఎకరా భూమిని రూ.90 లక్షలకే కేటాయించారని, తమ ప్రభుత్వం నిబంధనల ప్రకారం ఎకరా కోటిన్నర లెక్కన కేటాయించినట్లు స్పష్టం చేశారు. దీనిపై ఏర్పాటు చేసిన బోర్డు నిర్ణయించిన దానికంటే రూపాయి కూడా తక్కువకు ఇవ్వలేదని తేల్చి చెప్పారు. ఐదు ఎకరాల భూమిని రూ.7.5 కోట్లకు ఇచ్చామని చెప్పిన శ్రీధర్‌బాబు.. కేటీఆర్‌ చెబుతున్న రూ.200 కోట్ల లెక్కలు ఎక్కడి నుంచి వచ్చాయో చెప్పాలని డిమాండ్‌ చేశారు. అసత్య ప్రచారంతో ప్రజలను పక్కదోవ పట్టించొద్దని కేటీఆర్‌కు మంత్రి సూచించారు. 32 మంది దరఖాస్తు చేసుకుంటే అందులో ఒకటి టెస్సెరాక్ట్ కంపెనీ అని, ఈ కంపెనీకి అన్ని నిబంధనల ప్రకారమే భూ కేటాయింపులు జరిగాయని మంత్రి స్పష్టం చేశారు. ఆ సంస్థతో సీఎం రేవంత్‌‌ సోదరులకు ఎలాంటి సంబంధం లేదని, సోషల్‌‌ మీడియాలో పెట్టే పోస్టుల ఆధారంగా కేటీఆర్ ఆరోపణలు చేయడం సరైంది కాదన్నారు. ఐదు ఎకరాల్లో రూ.34 కోట్లతో ఏర్పాటయ్యే కంపెనీకి రూ.200 కోట్ల విలువైన భూమిని ఇచ్చినట్టు కేటీఆర్ చెప్పడం ఆశ్చర్యంగా ఉందని, ఇది పూర్తిగా అర్థరహితమైన ఆరోపణ అని శ్రీధర్ బాబు కొట్టిపారేశారు.

హిల్ట్‌ పాలసీతో హైదరాబాద్‌ ప్రజలకు ప్రయోజనం చేకూరుతుందని..బీఆర్‌ఎస్‌ నాయకులు పారిశ్రామికవేత్తలను భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారని శ్రీధర్ బాబు విమర్శించారు. వారి వైఖరి రాష్ట్రానికి నష్టం చేకూరుస్తుందని, రాష్ట్రాభివృద్ధికి ప్రతిపక్షం సహకరించాలని కోరారు. భూమిని కొనుగోలు చేసినప్పటికీ పారిశ్రామిక కార్యకలాపాలు చేపట్టని వారికి అవకాశం కల్పించేందుకే ప్రభుత్వం హిల్ట్ పాలసీ విధానాన్ని రూపొందించిందని శ్రీధర్ బాబు తెలిపారు. ఆ భూములు ప్రైవేట్ యాజమాన్యంలోనివే తప్ప ప్రభుత్వ భూములు కావని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణకు పరిశ్రమలు రాకుండా రామారావు అడ్డుకుంటున్నారని ఆరోపించిన శ్రీధర్ బాబు, తన శాఖకు సంబంధించిన వ్యవహారాలన్నీ తనకు పూర్తిగా తెలుసని అన్నారు. “మేము విధానాలను రూపొందిస్తాము, భూ కేటాయింపుల కమిటీ భూముల కేటాయింపు బాధ్యతను చూసుకుంటుంది. నా శాఖను ఎలా నిర్వహించాలో ఎవరూ నాకు చెప్పాల్సిన అవసరం లేదు,” అని ఆయన అన్నారు.

పీఎం ఏక్తా మాల్ టెండర్ ప్రక్రియను సమర్థించిన శ్రీధర్ బాబు

పీఎం- ఏక్తామాల్ టెండర్ల ప్రక్రియ పూర్తి పారదర్శకంగా జరిగాయని,అందులో ఎటువంటి అక్రమాలు లేదా లోపాలు లేవని .. ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ రూల్స్ ప్రకారమే మాల్ నిర్మాణం చేపట్టినట్లు శ్రీధర్ బాబు చెప్పారు. పీపీపీ విధానంలోనే పీఎం- ఎక్తామాల్ టెండర్లు జరిగాయని, ప్రభుత్వంపై ఎలాంటి భారం లేకుండా ఈ నిర్మాణం జరుగుతోందని చెప్పారు. బీఆర్ఎస్ హయాంలో జరిగిన అన్ని భూకేటాయింపులపై విచారణ చేయించి, అందరి లెక్కలు తేలుస్తామని హెచ్చరించారు. బీఆర్‌‌ఎస్‌‌ పదేళ్ల పాలనలో పలు కంపెనీలకు ముడుపులు తీసుకునే భూములు ఇచ్చారా… తక్కువ ధరకు భూములను ఇచ్చిన దానిపై కూడా కేటీఆర్‌‌ సమాధానం చెప్పాలన్నారు. తెలంగాణకు పరిశ్రమలు రావద్దనే ఎజెండాతో కేటీఆర్ ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు.

నీటి వాటాల విషయంలో తెలంగాణ ప్రయోజనాలపై ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీపడబోమని మంత్రి స్పష్టం చేశారు. జీఆర్‌ఎంబీ సమావేశానికి హాజరై తెలంగాణకు రావాల్సిన నీటి వాటాల కోసం బలంగా వాదిస్తామని శ్రీధర్‌బాబు వెల్లడించారు.