హరీష్ ఫ్యూచర్ సిటీ రద్దు మాటలు బాధ్యతారాహిత్యం: మంత్రి శ్రీధర్ బాబు

ఫ్యూచర్ సిటీని రద్దు చేస్తామన్న హరీష్ రావు వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యమని మంత్రి శ్రీధర్ బాబు మండిపడ్డారు. ఇలాంటి వ్యాఖ్యలు రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా చేస్తున్నాయని అన్నారు.

హరీష్ ఫ్యూచర్ సిటీ రద్దు మాటలు బాధ్యతారాహిత్యం: మంత్రి శ్రీధర్ బాబు

తెలంగాణ ప్రభుత్వం అంతర్జాతీయ స్థాయిలో ప్రతిష్టాత్మంగా నిర్మించ తలపెట్టిన ఫ్యూచర్ సిటీని బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే రద్దు చేస్తామంటూ మాజీ మంత్రి టి.హరీష్ రావు మాట్లాడటం బాధ్యతారాహిత్యం అని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి డి.శ్రీధర్ బాబు విమర్శించారు. తెలంగాణ ప్రయోజనాలను పక్కన పెట్టి, స్వార్థ రాజకీయాల కోసం హరీష్ రావు మాట్లాడుతున్నారని, తమ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని బీఆర్‌ఎస్‌ నేతలు అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలా.. వద్దా.. హరీశ్‌రావు చెప్పాలని డిమాండ్ చేశారు. బ్లాక్‌మెయిలింగ్‌ పాలిటిక్స్‌ చేయాలని బీఆర్‌ఎస్‌ యత్నిస్తోందని విమర్శించారు.

మెట్రోను విస్తరించాలనుకుంటే అడ్డుకుంటున్నారని, మూసీ ప్రక్షాళనను తప్పుబడుతున్నారని.. ఇప్పుడు భారత్‌ ఫ్యూచర్‌ సిటీని రద్దు చేస్తామని హరీశ్ బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా చేస్తే రాష్ట్రానికి పెట్టుబడులు రావు.. పక్క రాష్ట్రాలకు వెళ్తాయి అని ఆందోళన వ్యక్తం చేశారు. ఫ్యూచర్‌ సిటీలో కాలుష్య కారక పరిశ్రమలు ఉండవని..అలాంటప్పుడు దాన్ని రద్దు చేస్తామనడం ఎంత వరకు సమంజసం అని ప్రశ్నించారు.

రాష్ట్రాన్ని గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ హబ్‌గా మార్చేందుకు మేము శ్రమిస్తుంటే, బీఆర్ఎస్ ప్రతి చర్య తెలంగాణ ప్రజలకు అన్యాయం చేసేలా ఉందన్నారు. మేము అధికారంలోకి వస్తే రద్దు చేస్తాం అనే బీఆర్ఎస్ ప్రకటనలు అంతర్జాతీయ పెట్టుబడిదారులను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి అన్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా అడ్డుకుంటూ, చదువుకున్న తెలంగాణ యువతకు ఉద్యోగాలు లేకుండా చేయాలని చూస్తున్నారా? ప్రశ్నించారు.

బీఆర్‌ఎస్‌ వచ్చేది లేదు.. రద్దు చేసేది లేదు: మహేష్ కుమార్ గౌడ్

ఫ్యూచర్‌ సిటీని హరీష్‌రావు రద్దు చేస్తామనడంపై పీసీసీ చీఫ్ బి.మహేష్ కుమార్ గౌడ్ మండిపడ్డారు. బీఆర్‌ఎస్‌ వచ్చేది లేదు.. రద్దు చేసేది లేదు అని తేలిగ్గా కొట్టిపారేశారు. ఫ్యూచర్‌ సిటీ రాష్ట్రానికి తలమానికం అని, ట్రాఫిక్‌ సమస్యతో హైదరాబాద్‌లో నరకం కనిపిస్తోందన్నారు. అందుకే అన్ని హంగులతో ఫ్యూచర్‌ సిటీ ప్లాన్‌ చేశాం అని తెలిపారు.

ఇవి కూడా చదవండి :

డిమాండ్ ఉన్న పంటలనే రైతులు సాగు చేయాలి: మంత్రి తుమ్మల
తెలంగాణలో మరో 79 కొత్త డయాలిసిస్ సెంటర్లు : మంత్రి రాజనరసింహ