విధాత, హైదరాబాద్ : ధాన్యం కొనడం చేతకాకపోతే గద్దె దిగాలని బీజేపీ కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ అంటున్నారని, నిజానికి తెలంగాణలో పండిన ధాన్యాన్ని కొనలేని ప్రధాని మోదీ గద్దె దిగాలని, మేం రాహుల్‌ గాంధీని ప్రధాని చేసి.. తెలంగాణలో ప్రతి గింజ కేంద్రంతో కొనిపిస్తానని, పాలమూరు- రంగారెడ్డికి జాతీయ హోదా తెస్తానని, మెట్రో విస్తరణకు, ఆర్‌ఆర్‌ఆర్‌కు వెంటనే నిధులు తీసుకొస్తానని, అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణను అభివృద్ది చేస్తానని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కోహెడలో అంతర్జాతీయ ఇంటిగ్రేటెడ్ ఫ్రూట్ మార్కెట్ ,ఇంటిగ్రేటెడ్ సబ్-రిజిస్ట్రార్ ఆఫీస్ కాంప్లెక్స్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన అనంతరం సభలో సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించారు.

15 తర్వాతా మీ సంగతి తేలుస్తా

పొమ్మంటే పోవడానికి నేను అల్లాటప్పాగా అధికారంలోకి రాలేదని, తొక్కుకుంటూ వచ్చామని, కార్యకర్తలు, ప్రజలు కోరుకుంటే వచ్చామని, ఫామ్‌హౌస్‌లో ఉన్న కేడీతోనైనా.. ఢిల్లీలో ఉన్న మోదీతోనైనా కొట్లాడతానని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఎవరి మెడలైనా వంచుతానని, కిషన్ రెడ్డి, బండి సంజయ్ తమాషాలు చేస్తున్నారన్నారు. మాకు మాటలతో పాటు చేతలు కూడావచ్చని, ఈ నెల 15న తర్వాత 75లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ పూర్తవుతుందని, ఆ తర్వాతా మీ సంగతి తేలుస్తానని, ధాన్యం, మక్కలు సహా పంటలను ఎలా కొనరో..మెట్రోకు నిధులు ఎందుకు ఇవ్వరో..వరంగల్, అదిలాబాద్ ఎయిర్ పోర్టులు ఎట్లా రావో , ఆర్ఆర్ఆర్ కు ఎందుకు అనుమతినివ్వరో…పాలమూరు- రంగారెడ్డి జాతీయ హోదా ఎట్లా ఇవ్వరో చూస్తానని, కిషన్ రెడ్డి నీ సంగతి చెబుతానని, కేంద్రంలో ప్రధాని మోదీను చూపెట్టి మమ్మల్ని భయపెట్టాలని చూస్తున్నారేమోనని, మర్యాద దాటితే మా సంగతేమిటో చూస్తామని, కిషన్ రెడ్డి పొలిమేరలు కూడా దాటరని రేవంత్ రెడ్డి హెచ్చరించారు. గుండు, అరగుండు సహా ఎవరికి భయపడేది లేదన్నారు.

‘కారు’ చెడిపోయి కార్ఖానాలో ఉంది

నాడు బీఆర్ఎస్ విధ్వంసం చేస్తే మేం వికాసం చేస్తున్నామని, బీఆర్‌ఎస్‌ నేతలు దశాబ్దంలోనే శతాబ్దానికి సరిపడా తెలంగాణను విధ్వంసం చేశారని రేవంత్ విమర్శించారు. 8ల‌క్ష‌ల కోట్ల అప్పు ఉన్న‌ప్ప‌టికి విశ్వాసంతో రోజుకు 18 గంట‌లు క‌ష్ట‌ప‌డి స‌మ‌స్యల‌ ప‌రిష్కారం కోసం ప్ర‌య‌త్నం చేస్తున్నానని, నిల‌బ‌డి కొట్లాడి స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్కారం చేసుకుంటూ ముందుకెలుతున్నామని రేవంత్ రెడ్డి పేర్కొన్నార.‘కారు’ పూర్తిగా చెడిపోయి కార్ఖానాలో ఉందని, ఎన్ని మరమ్మతులు చేసినా.. చెడిపోయిన ఆ కారు ఇక పనికిరాదు అని రేవంత్ రెడ్డి విమర్శించారు. కేసీఆర్‌ కుర్చీ వేసుకొని కూర్చొని.. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మిస్తానని చెప్పారు. కానీ.. గెలిచిన తర్వాత పట్టించుకోకుండా ఫామ్ హౌస్ కే పరిమితమయ్యాడన్నారు. తుమ్మిడిహ‌ట్టిని నిర్మించ‌వ‌ద్ద‌ని అంటున్నారని, మేం అభివృద్ధి చేస్తుంటే.. అధికారంలోకి రాగానే ఫ్యూచర్‌ సిటీ రద్దు చేస్తామని బీఆర్‌ఎస్‌ చెబుతోందని, కాలుష్యం వెదజల్లే ఫార్మాసిటీ వద్దని మేం ఫ్యూచర్‌సిటీ నిర్మిస్తున్నాం అని, ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన 500 కంపెనీలు తీసుకురావాలని యత్నిస్తున్నాం అన్నారు.కేంద్రంతో స‌త్సంసంబంధాలు పెట్టుకుని రావాల్సిన నిధులు తీసుకువ‌చ్చే ప్ర‌య‌త్నం చేస్తున్నాం అని, 60 శాతం ఆదాయం రంగారెడ్డి జిల్లా నుంచే వ‌స్తోందని, రాష్ట్ర వ్యాప్తంగా ఈ నిధులతో సంక్షేమ ప‌థ‌కాల‌ను అమ‌లు చేస్తున్నాం అని తెలిపారు.

ఫ్యూచర్ సిటీ కట్టి తీరుతాం

కాలుష్యం లేని పరిశ్రమల ఈ ప్రాంతానికి వస్తాయని, ఫ్యూచర్ సిటీకి, మెట్రో విస్తరణకు, త్రిబుల్ ఆర్ కు అడ్డం పడుతున్నారని, వరంగల్ ఎయిర్ పోర్టు బీఆర్ఎస్ అడ్డుకుంటుందని, అప్పుడు కావాలని మనం పోరాడితేజజ ఇప్పుడు అష్ట దరిద్రులు అడ్డం పడుతున్నారన్నారు. అసూయ‌, ప‌గ‌,ద్వేషం మాపైన చూపించాలి. తెలంగాణ ప్ర‌జ‌ల‌పైన కాదు అన్నారు. అసూయపడే వాళ్ళు, అజీర్ణం చేసుకునే వాళ్ళు ఉంటారని, కాళ్లల్లో కట్టెలు పెట్టినా.. మూసీలో పడి దొర్లినా.. వాళ్లను పట్టించుకోమని, అభివృద్ధి పనులు చేసుకుంటూ ముందుకు వెళ్తాం అన్నారు. కేసీఆర్ ప్రభుత్వంలో తెలంగాణలో ఎక్కడ నీళ్లు ఉన్నా కాళేశ్వరం నీళ్లు అన్నారని, చుక్కనీరు ఎత్తిపోయకుండా లక్షల మెట్రిక్ టన్నుల పంట ఇప్పుడు పండలేదా అని ప్రశ్నించారు. కాళేశ్వరం పేరుతో లక్ష కోట్లు పెడితే గోదావరి పాలయ్యాయాయని, కూలేశ్వరం కట్టిన వాళ్ళు మాకు సలహాలు ఇస్తున్నారని, హరీశ్ రావు సలహాలు విని.. ఆయన మామా నడ్డి విరిగి ఫామ్ హౌస్ లో పడ్డారంటూ రేవంత్ ఎద్దేవా చేశారు. అభివృద్దిని అడ్డుకునే రాజకీయాలు చేస్తే రాబోయే రోజుల్లో ప్ర‌తిప‌క్ష హోదా కాదు కాదా.. కారును తోయ‌డానికి కూడా ఎవ‌రూ దొర‌క‌రని విమర్శించారు.

అంతర్జాతీయ స్థాయిలో కొహెడ ఫ్రూట్ మార్కెట్

డిసెంబ‌ర్ నుంచే ఫ్రూట్ మార్కెట్ లో కార్య‌క‌లాపాలు ప్రారంభం కావాలని, రెండేళ్ల‌లో ఫ్రూట్ మార్కెట్. నిర్మాణం పూర్తి కావాలని, ఫ్రూట్ మార్కెట్ కోసం నిధుల‌ను గ్రీన్ ఛాన‌ల్ లో ఇస్తామని వెల్లడించారు. ఫ్రూట్ మార్కెట్ నిర్మాణం కోసం తుమ్మ‌ల‌, శ్రీధ‌ర్ బాబు ఇక్క‌డ కుర్చీ వేసుకుని కూర్చోవాలని సూచించారు. రాష్ట్రం నలుమూలల నుంచి ప్రజలకు ఏం కావాలన్నా ఇక్కడికి వస్తే అన్నీ అందుబాటులో ఉండే విధంగా 240 ఎకరాల్లో రూ. 2,300 కోట్లతో అత్యాధునిక వసతులతో మార్కెట్‌ను నిర్మిస్తున్నామని చెప్పారు. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం తర్వాత ఈ మార్కెట్‌కు అంతర్జాతీయ గుర్తింపు వస్తుంది” అని రేవంత్ రెడ్డి విశ్వాసం వ్యక్తం చేశారు.

ఓఆర్ఆర్ లోపల 12 క్లస్టర్లుగా  రిజిస్ట్రేషన్ ఆఫీసులు

కోట్లాది రూపాయ‌ల రిజిస్ట్రేష‌న్లు జ‌రుగుతున్నా రిజిస్ట్రేషన్ ఆఫీసులలో వసతులు కొరతతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, అందుకు అద్భుతమైన రిజిస్ట్రేషన్ ఆఫీసులను నిర్మిస్తున్నాం అని రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. ఓ ఆర్ ఆర్ లోపల 12 క్టస్టర్లుగా విభజించి 38 సబ్ రిజిస్టర్ ఆఫీస్ లను నిర్మాణం చేస్తున్నామని, ప్ర‌తి యేడాది రిజిస్ట్రేష‌న్ల ద్వారా 15 వేల కోట్ల ఆదాయం వ‌స్తోందని తెలిపారు.

2024 నుంచి 2034 వ‌ర‌కు ప్రజా ప్రభుత్వమే

ఔర్ ఎక్ బార్ కాంగ్రెస్ సర్కార్ అనే నినాదంతో పనిచేస్తున్నామని, 2024 నుంచి 2034 వ‌ర‌కు ప్రజా ప్రభుత్వమే, మా ప్రభుత్వమే అధికారంలో ఉంటుందని రేవంత్ రెడ్డి అన్నారు. అభివృద్ధి చేయ‌డ‌మే కాదు సంక్షేమ ప‌థ‌కాల‌ను అమ‌లు చేస్తున్నామని, బీఆర్ఎస్ ప‌దేళ్లలో రేష‌న్ కార్డులు కూడా ఇవ్వ‌లేదు.. మేం 15 ల‌క్ష‌ల రేష‌న్ కార్డులు ఇచ్చాం అని, 3.28 కోట్ల మందికి స‌న్న బియ్యం ఇస్తున్నాం, 200 యూనిట్లు ఉచిత విద్యుత్ ఇస్తున్నాం అని, 4.5 ల‌క్ష‌ల ఇందిర‌మ్మ ఇళ్లు మంజూరు చేశాం అని, మ‌రో రెండున్న‌ర ల‌క్ష‌ల ఇళ్లు మంజూరు చేస్తామని తెలిపారు. మొత్తంగా 8 ల‌క్ష‌ల ఇందిర‌మ్మ ఇళ్ల మంజూరు చేశాం అన్నారు. 25 ల‌క్ష‌ల మంది రైతుల‌కు 20 వేల కోట్ల రైతు రుణ‌మాఫీ చేశాం అని, ఆడ బిడ్డ‌ల‌కు సున్న వ‌డ్డీలతో 60 వేల కోట్ల బ్యాంక్ లింకేజీ రుణాలు ఇచ్చాం అన్నరు. ఆడ బిడ్డ‌ల ఉచిత బ‌స్సు. ప్ర‌యాణానికి 10 వేల కోట్ల ఇచ్చాం అని తెలిపారు. త్వ‌ర‌లోనే ఉద్యోగ ఖాళీల‌ను భ‌ర్తీ చేస్తాం అని స్పష్టం చేశారు.