కాంగ్రెస్ పార్టీ అంటేనే కంపు.. ద్రోహాల పార్టీ అని.. మీనాక్షి నటరాజన్ కు ఆ పార్టీ వారే ద్రోహం చేసిన తీరు ఇందుకు నిదర్శనం అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. మీనాక్షి నటరాజన్‌కి తెలంగాణ కాంగ్రెస్‌లో ఎవరు వ్యతిరేకులో ప్రజలందరికీ తెలుసు అని, కాంగ్రెస్ పార్టీలోనే కుట్రలు చేసుకొని, అందులో ప్రతిపక్షాలను ఎందుకు లాగుతున్నారని మండిపడ్డారు. మీడియాతో నిర్వహించిన చిట్‌చాట్‌లో కేటీఆర్ మాట్లాడారు. మీనాక్షి నటరాజన్ కు ద్రోహం ఎవరు చేశారో కాంగ్రెస్ పార్టీ నేతలే తేల్చుకోవాలన్నారు. ఆమెపై ఉన్న కేసు వివరాలు ఎవరు బీజేపీ నేతలకు అందించారో విచారణ జరుపుకోవాలని, పదే పదే సిట్ అనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ అంశం పైన కూడా సిట్ వేసుకోవచ్చు అని ఎద్దేవా చేశారు.
రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ‘బ్లాక్ షీప్’ (పార్టీ ద్రోహులు) ఎవరో కనుక్కోవాలని తెలిపారు.

షబ్బీర్ అలీ వ్యాఖ్యలు నిజమే..

కాంగ్రెస్ పార్టీలో పదవులు డబ్బులకే వస్తున్నాయని మాజీ మంత్రి షబ్బీర్ అలీ చెప్పినందుకు అభినందనలు. షబ్బీర్ అలీ ఇప్పటికైనా ఉన్న వాస్తవాన్ని ప్రజల ముందు గట్టిగా చెప్పారు అన్నారు. అసలు గతంలో పీసీసీ పదవిని పైసలకు అమ్ముకున్నది కాంగ్రెస్ పార్టీనే కదా అని, ఆ తర్వాత ముఖ్యమంత్రి పదవిని కూడా డబ్బులకే అమ్ముకున్నదని, ఇప్పుడున్న ముఖ్యమంత్రి కూడా డబ్బులు పెట్టి పదవి కొనుక్కున్న వ్యక్తే కదా అని, రేవంత్ రెడ్డి పేమెంట్ కోటా సీటు అన్న విషయం అందరికీ తెలుసు అన్నారు. ప్రతి నెలా డబ్బుల మూట పంపితేనే ఆయన పదవి ఉంటుందని, రేవంత్ రెడ్డి రెగ్యులర్ సీఎం కాదు, రెన్యూవల్ సీఎం అని అందరికీ తెలుసు అని, అందుకే షబ్బీర్ అలీ చెప్పిన మాటలు ముమ్మాటికీ వాస్తవం అన్నారు.

మానసిక రోగి మాత్రమే హిట్లర్ స్ఫూర్తి అంటారు..

మానసిక రోగి మాత్రమే హిట్లర్ స్ఫూర్తి అంటారని, రేవంత్ రెడ్డి హిట్లర్ గురించి మాత్రమే మాట్లాడలేదు.. హిట్లర్ హంతక ముఠా నాకు ఆదర్శం అని అన్నారు. అంతకుమించి, ఇరాన్-ఇజ్రాయెల్ వార్‌లో గాజా మాదిరి విద్వంసం సృష్టించిన అన్నారని కేటీఆర్ విమర్శించారు. యుద్ధంలో జరిగిన విద్వంసం గురించి గొప్పలు చెప్పుకునే వ్యక్తి ఎంత మానసిక రుగ్మత ఉన్నదో అర్థం చేసుకోవచ్చు అన్నారు. మానసిక రోగి అయితేనే ఇలాంటి మాటలు మాట్లాడతారన్నారు. రేవంత్ రెడ్డి చెప్పిన శిథిలాల కిందనే కాంగ్రెస్ పార్టీని ప్రజలు పాతిపెడతారని, హైడ్రా అనేది లేనే లేదు, కానీ రేవంత్ రెడ్డి అజ్ఞానంతో “హిట్లర్ హైడ్రా తనకు ఆదర్శం అంటూ మాట్లాడారని, గోబెల్స్ ప్రచారానికి మించి రేవంత్ రెడ్డి ప్రచారం చేసుకుంటున్నారన్నారు. శ్రీధర్ బాబు హిట్లర్ వ్యాఖ్యలను సమర్ధించడం పట్ల జాలి కలుగుతుందని, రేవంత్ రెడ్డి హిట్లర్ వ్యాఖ్యలను శ్రీధర్ బాబు సమర్థించడం ఆయనకు ఉన్న ఇబ్బందులను గుర్తుచేస్తుందని కేటీఆర్ చురకలేశారు. శ్రీధర్ బాబు చదువుకున్న వ్యక్తి. అలాంటి ఆయన హిట్లర్ వ్యాఖ్యలను సమర్థించడం దారుణం అని, శ్రీధర్ బాబు పరిస్థితి చూస్తే జాలి కలుగుతుంది. శ్రీధర్ బాబు లాంటి నాయకుడు కూడా హిట్లర్ వ్యాఖ్యలను సమర్థించడం ఆయన విజ్ఞతకే వదిలివేస్తున్నాం అన్నారు.

హైదరాబాద్ వాసుల వర్షాల తిప్పలకు రేవంత్ రెడ్డిదే బాధ్యత

హైదరాబాద్ వర్షాలపై రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు హాస్యాస్పదం అని, 75 ఏళ్లు పాలించిన కాంగ్రెస్ పార్టీ ఈ నగరానికి చేసింది ఏమీ లేదని, మేము చేసిన ఎస్ఎన్‌డీపీ (SNDP), ఇతర కార్యక్రమాల వల్లనే కాస్తంత మెరుగైన పరిస్థితి ఉందని కేటీఆర్ చెప్పుకొచ్చారు. కానీ, రేవంత్ రెడ్డి మున్సిపల్ శాఖ మంత్రిగా పూర్తిగా విఫలమయ్యారని, వర్షాకాల సన్నద్ధత ప్రణాళికపైన సమీక్ష కూడా నిర్వహించలేదు. మేము వేసిన ఫ్లైఓవర్లు, ఎస్ఎన్‌డీపీ నిర్వహణ కూడా చేయడం లేదు అన్నారు. ఉన్న సిటీని గాలికి వదిలేసి ఫ్యూచర్ సిటీ గురించి మాట్లాడుతున్నాడని, ఫ్యూచర్ లేని రేవంత్ రెడ్డి ఫ్యూచర్ గురించి మాట్లాడుతున్నాడని, హైదరాబాద్ ప్రజలే ఫ్యూచర్ సిటీని నిర్మించుకుంటారని వ్యాఖ్యానించారు. వర్షాలు ఆగితే తన క్రెడిట్ అని చెప్పుకున్న ముఖ్యమంత్రి రేవంత్ వర్షాలు, వరదలు వస్తే మాత్రం పాత ప్రభుత్వానికి అంటగడుతున్నాడని మండిపడ్డారు. ఇదే రేవంత్ రెడ్డి రోడ్ల కింద బావులు తవ్వి వర్షాలను, వరదలను ఆపుకున్నానని చెప్పాడని, హైదరాబాద్ నగరంలోని వర్షాలకు ప్రజల అవస్థ పాపం ముమ్మాటికీ రేవంత్ రెడ్డిదేనని కేటీఆర్ విమర్శించారు.

ఎయిర్ పోర్టు మెట్రో రద్దుతో నష్టం

ఎయిర్‌పోర్ట్ మెట్రోను రద్దు చేయడం వల్లనే ఆ ప్రాంతంలో రద్దీ భారీగా పెరిగిందని, ఎయిర్‌పోర్ట్ 18 నెలల్లో మెట్రో పూర్తి అయ్యేది.. లక్షల మందికి లాభం జరిగేది, ట్రాఫిక్ జామ్‌లు తగ్గేవి అని కేటీఆర్ చెప్పుకొచ్చారు. ల్యాండ్ అక్విజిషన్ (భూసేకరణ) లేకుండా సులభంగా పూర్తయ్యే మెట్రోను రేవంత్ రెడ్డి ఆపేశాడని, మెట్రో ఎల్ అండ్ టీ (L&T) సీఎఫ్‌ఓ (CFO)ను బెదిరించి మెట్రోను లాక్కున్నాడని, మేము గతంలో మెట్రోను పూర్తి చేశాం, కానీ ఈ రెండున్నర సంవత్సరాలలో రేవంత్ రెడ్డి చేసింది ఏమిటో చెప్పాలి అని కేటీఆర్ ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి రెండు చెరువులు పునరుద్దరించి ప్రచారం చేసుకుంటున్నాడని, మేము 100 చెరువులు బాగు చేసినప్పటికి ఏనాడూ ఫోజులు కొట్టలేదు అన్నారు.