హైడ్రా కమిషనర్ రంగనాథ్ తొలగింపుకు హైకోర్టు ఆదేశాలు

హైడ్రా కమిషనర్ రంగనాథ్‌ను తొలగించాలని తెలంగాణ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. 63 కోర్టు ధిక్కరణ పిటిషన్లపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ అర్హత కలిగిన ఐజీ స్థాయి అధికారిని నియమించాలని సూచించింది.

Reported by: Tejaswini Nanna | తెలంగాణ‌ | Jul 27, 2026, 4:14 pm IST
Read Time: 4 mins
హైడ్రా కమిషనర్ రంగనాథ్ తొలగింపుకు హైకోర్టు ఆదేశాలు

హైడ్రా కమిషనర్ గా రంగనాథ్ ను తొలగించాలని తెలంగాణ హైకోర్టు సంచలన ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఈ మేరకు హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. రంగనాథ్ స్థానంలో అర్హత కలిగిన ఐజీ స్థాయి అధికారిని నియమించాలని తెలిపింది. 63 కోర్టు ధిక్కరణలకు పాల్పడిన రంగనాథ్ హైడ్రా కమీషనర్ గా కొనసాగితే రూల్ ఆఫ్ లా తప్పినట్లవుతుందని హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఇన్ని ఉల్లంఘనలకు పాల్పడుతున్న అధికారిని ఇంకా అదే పోస్టులో కొనసాగించడం సరికాదు అని, రంగనాథను తొలగించడం తప్ప మరో ఆప్షన్ లేదు అని స్పష్టం చేసింది. రంగనాథ్ పై తెలంగాణ హైకోర్టు పలుమార్లు కోర్టు ఆదేశాల ఉల్లంఘనలపై ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.

సోమవారం లోతుకుంట సర్వే నెంబర్‌ 1, 2 లోని 40 ఎకరాల భూ వివాదంలో విచారణ హైకోర్టులో కొనసాగింది. లోతుకుంట వివాదస్పద భూములలోకి హైడ్రా వెళ్లలేదని హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ హైకోర్టుకు వివరించారు. పిటిషనర్‌ అవాస్తవాలు చెప్పారని ఆయన హైకోర్టుకు తెలిపారు. ఈమేరకు ఆయన అఫిడవిట్‌ దాఖలు చేశారు. ఈ సందర్బంగా తెలంగాణ హైకోర్టు రంగనాథ్‌పై 63 కోర్టు ధిక్కరణ పిటిషన్లు ఉన్నాయని పేర్కొంది. ఇన్ని పిటిషన్లు ఎందుకు ఉన్నాయని ఆయనను ప్రశ్నించింది. దీనిపై హైకోర్టుకు రంగనాథ్ క్షమాపణలు చెప్పారు. కోర్టులు, న్యాయవ్యవస్థపై ఎంతో నమ్మకముందని పేర్కొన్నారు. లోతుకుంట సర్వే నెంబర్‌ 1, 2 లోని 40 ఎకరాల్లోకి హైడ్రా వెళ్లలేదన్నారు.

లోతుకుంట ప్రైవేట్ భూములలో హైడ్రా జోక్యాన్ని హైకోర్టు సీరియస్ గా తప్పుబట్టింది. సుప్రీంకోర్టు స్టేటస్ కో ఉన్నా…అండర్ టేకింగ్ ఇచ్చినా మళ్లీ ఆ భూములలోకి ఎందుకు వెళ్లారంటూ ప్రశ్నించింది. ఒక్క లోతుకుంట భూముల విషయంలోనే మూడుసార్లు కోర్టు ఆదేశాల ఉల్లంఘనలకు పాల్పడ్డారని, హైడ్రా కమిషనర్ గా రాజ్యాంగ వ్యవస్థలకు అతీతంగా వ్యవహరించారని హైకోర్టు అభిప్రాయపడింది.