తెలంగాణలో మరో 79 కొత్త డయాలిసిస్ సెంటర్లు : మంత్రి రాజనరసింహ

తెలంగాణలో ప్రస్తుతం 100కు పైగా డయాలిసిస్ కేంద్రాలు పనిచేస్తుండగా మరో 79 కొత్త కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని మంత్రి దామోదర రాజనరసింహ తెలిపారు.

తెలంగాణలో మరో 79 కొత్త డయాలిసిస్ సెంటర్లు : మంత్రి రాజనరసింహ

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం 100కు పైగా డయాలిసిస్ కేంద్రాలు పనిచేస్తున్నాయని, మరో 79 కొత్త డయాలిసిస్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నాం అని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ తెలిపారు. నిమ్స్‌లో రికార్డు స్థాయిలో విజయవంతంగా 2 వేల కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ సర్జరీలు చేసిన సందర్భంగా నిమ్స్‌ డాక్టర్లు, సిబ్బందిని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ సత్కరించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. నిమ్స్‌లో విజయవంతంగా 2,000 కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ శస్త్రచికిత్సలు పూర్తి కావడం తెలంగాణ ప్రభుత్వ వైద్యరంగానికి గర్వకారణం అన్నారు. ఒకప్పుడు కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ అంటే భారీ ఖర్చుతో కొద్దిమందికే అందుబాటులో ఉండేదని, ఈరోజు పేదలకు కూడా రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా అవయవ మార్పిడి వైద్య సేవలు అందిస్తున్నాం అన్నారు. అవయవ మార్పిడి ఆపరేషన్‌కే కాదు.. ఆపరేషన్ అనంతరం జీవితాంతం ఉచితంగా మెడిసిన్ కూడా అందిస్తున్నాం అని తెలిపారు.

ఆర్గాన్ ట్రాన్స్ ప్లాంట్ సెంటర్ గా టిమ్స్

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వ ఆస్పత్రులు కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు అందిస్తూ కొత్త ప్రమాణాలు సృష్టిస్తున్నాయి అని, సనత్‌నగర్‌‌ TIMS‌ను ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంట్ Centre of Excellence‌గా అభివృద్ధి చేస్తున్నాం అని తెలిపారు. ప్రభుత్వం డయాలిసిస్ నుంచి ట్రాన్స్‌ప్లాంట్ వరకు పూర్తి కిడ్నీ కేర్ ఎకోసిస్టమ్ నిర్మిస్తోందని, నిమ్స్‌తో పాటు గాంధీ, ఉస్మానియా ఆస్పత్రుల్లో కూడా అవయవ మార్పిడి సేవలను బలోపేతం చేస్తున్నాం అని, గాంధీ ఆస్పత్రిలో స్టేట్ ఆర్గన్ ట్రాన్స్‌ప్లాంట్ సెంటర్‌‌ను ఇటీవలే ప్రారంభించుకున్నామని గుర్తు చేశారు.

ఇవి కూడా చదవండి :

వడదెబ్బ మరణాలకు.. రూ.4లక్షల పరిహారం: మంత్రి పొంగులేటి
కూలిన భారత ఆర్మీ చీతా హెలికాప్టర్..ముగ్గురు క్షేమం