Kidney Mafia | ఆ గ్రామంలో అందరికీ ఒకటే కిడ్నీ.. బంగ్లాదేశ్ పేదల అవయవాలతో భారత్‌లో అక్రమ వ్యాపారం

Kidney Mafia | బంగ్లాదేశ్‌లోని బైగునీ గ్రామం ఇప్పుడు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది. కాకపోతే గర్వకారణంగా కాదు — అక్కడ నివసించే చాలామంది తమ అవయవాలను, ముఖ్యంగా కిడ్నీలను, విక్రయించినందుకు. ఈ గ్రామాన్ని స్థానికులు ‘‘ఒక కిడ్నీ గ్రామం’’గా పిలుస్తున్నారు. పేదరికం, ఉద్యోగాల కొరత, అప్పుల బాధలు మనుషులను పూట గడవడానికి ఒక అవయవాన్ని అమ్ముకునే స్థితికి నెట్టేస్తున్న ఒక భయంకర నిజాన్ని ఈ గ్రామం తెలుపుతోంది. 45 ఏళ్ల సఫిరుద్దీన్, 2024లో తన ఇంటి నిర్మాణం కోసం భారత్‌లో తన కిడ్నీని విక్రయించాడు. బ్రోకర్లు అన్ని ఏర్పాట్లు చేసినా, అతనికి వాగ్దానంచేసిన మొత్తం కాకుండా కేవలం రూ. 2.9 లక్షలే ఇచ్చారు. శస్త్రచికిత్స తర్వాత మందులు, పాస్‌పోర్టు కూడా తిరిగి ఇవ్వలేదు. ఆరోగ్యం దిగజారిపోయింది. ఇంటి నిర్మాణం నెరవేరలేదు. జీవితం మొత్తం ఒక మోసమేనని వేదనతో చెబుతున్నాడు. ఇలా మోసపోయిన జోస్నా బేగం, సజల్ వంటి వారి కథలు వందల్లో ఉన్నాయి. కొందరు వారిని దళారులు ఉద్యోగాల పేరుతో భారత్‌కు తీసుకెళ్తారు. అక్కడ నకిలీ పత్రాలు, బంధుత్వ సర్టిఫికెట్లు తయారుచేసి, గ్రహీతల బంధువులే అంటూ చూపించి అవయవ మార్పిడి చేస్తారు. దాతలు చివరికి డబ్బుల్లేక, ఆరోగ్య సమస్యలతో తిరిగి వస్తారు.
కిడ్నీ ఒక్కదానికి గ్రహీతలు ₹20 లక్షల వరకు చెల్లిస్తే, దాతలకి కేవలం ₹3-4 లక్షలు మాత్రమే ముడుతున్నాయని ముఠా సభ్యులే ఒప్పుకుంటున్నారు. మిగిలిన మొత్తాన్ని దళారులు, డాక్టర్లు, నకిలీ సర్టిఫికెట్లు ఇచ్చే అధికారులు పంచుకుంటారు. అంతే కాకుండా కొన్ని ఆసుపత్రులు సరైన పత్రాల పరిశీలన లేకుండా మార్పిడికి అనుమతి ఇస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. 2024లో ఢిల్లీ పోలీసులు ప్రముఖ వైద్యురాలు డా. విజయరాజకుమారిని అరెస్ట్ చేశారు. ఆమె విదేశీ (Bangladesh) రోగులకు 15 అక్రమ ఆపరేషన్లు చేసినట్లు పోలీసులు తెలిపారు. కానీ ఇది కిడ్నీ రాకెట్లో ఒక చిన్న భాగం మాత్రమేనని నిపుణులు అంటున్నారు. వైద్య పర్యటన (Medical Tourism) పేరుతో భారత్‌లో అవయవ మార్పిడులు పెద్దవ్యాపారంగా మారాయి. 2024లో ఈ రంగం విలువ ₹63,000 కోట్లు. ఈ ఆదాయ వేటలో భాగంగా అనేక ఆసుపత్రులు అక్రమ మార్పిడుల పట్ల కన్నుమూస్తున్నాయని ఆరోపణలు ఉన్నాయి. BRAC సంస్థ, కిడ్నీ వారియర్స్ ఫౌండేషన్, ఇతర సంస్ధల కథనాల ప్రకారం, ఈ వ్యవస్థను పూర్తిగా నిరోధించడం కష్టమని, కనీసం దాతల ఆరోగ్య భద్రత, ఆర్థిక భద్రత కోసం ప్రత్యేక చట్టాలు రూపొందించాలని సూచిస్తున్నారు. ప్రమాదకరంగా మారిన ఈ అక్రమ అవయవ మార్పిడిపై భారత, బంగ్లా ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నట్లు చెబుతున్నా, అమలు మాత్రం గాల్లో దీపంలా ఉంది. అవినీతి, నిర్లక్ష్యం కలిసిపోయిన ఈ వ్యవస్థలో బలయ్యేది మాత్రం షరామామూలుగా పేదవాళ్లే.