Gen Z | ఎన్ని తరాలు మారినా మొగుడు చెప్పిందే పెళ్లాం వినాల్సిందేనా.. జెన్‌ జెడ్‌లోనూ అవే పాతకాలపు ఆలోచనలు

Gen Z | జెన్ జెడ్ అంటే ఆలోచనల్లో చాలా అడ్వాన్స్‌డ్‌గా ఉంటారు.. చాలా మెచ్యూర్‌గా ఆలోచిస్తారనే ఒక భావన ఉంటుంది. కానీ ఆడవాళ్ల విషయంలో మాత్రం జెన్ జెడ్ మగాళ్లు ఇంకా పాతకాలపు ఆలోచనల్లోనే ఉన్నారని ఒక సర్వేలో తెలిసింది. మొగుడు చెప్పిన మాటనే పెళ్లాం వినాలనే అనుకుంటున్నారని వెల్లడైంది.

  • By: RC |    trending |    Published on : Mar 07, 2026 11:30 AM IST
Gen Z | ఎన్ని తరాలు మారినా మొగుడు చెప్పిందే పెళ్లాం వినాల్సిందేనా.. జెన్‌ జెడ్‌లోనూ అవే పాతకాలపు ఆలోచనలు

Gen Z | భార్య అంటే అనుకువగా ఉండాలి.. ఎదురుచెప్పకుండా భర్త మాట వినాలి.. ఇంటి పనులు అన్నీ తానే చేసుకోవాలి.. అనాదిగా మగాళ్లు ఆలోచిస్తున్న తీరు ఇది. ఎన్ని తరాలు మారినా కూడా మగాళ్ల దృష్టి కోణంలో మాత్రం మార్పు రావడం లేదు.. 90స్ కిడ్స్ మాత్రమే కాదు.. అడ్వాన్స్‌గా థింక్ చేస్తారనుకునే జెన్ జెడ్ ( Gen Z ) కుర్రాళ్లలోనూ ఇవే పాతకాలపు ఆలోచనలు ఉన్నాయంట..! లండన్ కింగ్స్ కాలేజ్, ఇప్సోస్ ( Ipsos ) కలిసి నిర్వహించిన గ్లోబల్ సర్వేలో ఈ షాకింగ్ విషయం బయటపడింది.

లండన్ కింగ్స్ కాలేజ్, ఇప్సోస్ ( Ipsos ) కలిసి నిర్వహించిన సర్వేలో ప్రపంచంలోని 29 దేశాల్లో సుమారు 23 వేల మంది పాల్గొన్నారు. లింగ సమానత్వం, రిలేషన్‌షిప్స్‌పై తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ఈ సర్వే వివరాలను అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా విడుదల చేశారు. ఈ సర్వే ప్రకారం.. తమ భార్య ఎప్పుడూ తమ మాట వినాలని 31 శాతం జెన్ జెడ్ మగాళ్లు కోరుకుంటున్నారని వెల్లడైంది. జెన్ జెడ్ యువత మోడ్రన్ ఆలోచనలతో ఉంటారని అంతా భావిస్తుంటారు.. అలాంటిది వారే పురుషాధిక్యతకు ఎక్కువ మొగ్గు చూపడం ఇప్పుడు అందర్నీ ఆశ్చర్యపరుస్తుంది. వినడానికి వింతగా ఉన్నా.. జెన్ జెడ్‌తో పోలిస్తే బేబీ బూమర్ (1946-1964 మధ్య పుట్టిన వారు) తరానికి చెందిన పురుషఉల్లో కేవలం 13 మంది మాత్రమే భార్యలు తమకు విధేయంగా ఉండాలని కోరుకుంటున్నారట. అలాగే ఇంటికి సంబంధించిన ముఖ్యమైన నిర్ణయాల్లో భర్తదే చివరి మాటగా ఉండాలని 17 శాతం మంది అభిప్రాయపడ్డారంట. అదే జెన్ జెడ్ విషయానికొస్తే మూడింట ఒక వంతు జెన్ జెడ్ కుర్రాళ్లు తమ ఇంట్లో తామే బాస్‌ అనిపించుకోవాలని ఆశపడుతున్నారంట. అయితే జెన్ జెడ్ అమ్మాయిల్లో మాత్రం 18 శాతం మంది మాత్రమే భర్త చెప్పినట్లు నడుచుకునేందుకు ఇష్టపడుతున్నారని సర్వేలో తెలిసింది.

బయట బాస్‌గా ఉండాలి.. ఇంట్లో కాళ్ల కింద ఉండాలి

ఈ సర్వేలో మరో ఆసక్తికరమైన విషయం బయటపడింది. జెన్ జెడ్ కుర్రాళ్లలో ఉన్న వినూత్న కోణాన్ని ఇది బయటపెట్టింది. అదేంటంటే.. కెరీర్‌లో సక్సెస్‌ఫుల్‌గా దూసుకెళ్లే మహిళలంటే ఇష్టమని 41 శాతం మంది జెన్ జెడ్ కుర్రాళ్లు చెప్పారు. అంటే ఆఫీసులో బాస్‌గా గొప్పగా రాణించాలి.. కానీ ఇంట్లో మాత్రం తమ మాటకు ఎదురుచెప్పకుండా కుక్కిన పేనులా పడి ఉండాలనే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోంది. అదే బేబీ బూమర్ మగాళ్లలో మాత్రం ఇలాంటి అభిప్రాయాన్ని 27 శాతం మంది మాత్రమే వెల్లడించారు. ఇక అమ్మాయిలు అంత ఇండిపెండెంట్‌గా ఉండకూడదని 24 శాతం మంది జెన్ జెడ్ అబ్బాయిలు అభిప్రాయపడుతున్నారు. బేబీ బూమర్ పురుషుల్లో ఈ అభిప్రాయం కేవలం 12 శాతం మందిలోనే ఉండటం గమనార్హం.

అవి మగాళ్ల పనులు కావు!

ఈ సర్వే ప్రకారం మగతనం విషయంలోనూ జెన్ జెడ్ అబ్బాయిల్లో పాతకాలపు ఆలోచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. జెన్ జెడ్ యువకుల్లో 43 శాతం మంది.. అబ్బాయి చూడటానికి శారీరకంగా బలంగా కనిపించాలని అనుకుంటున్నారు. మరో 30 శాతం మంది పురుషులు.. తమ మేల్ ఫ్రెండ్స్‌కు ఐ లవ్యూ అని చెప్పకూడదని పేర్కొంటున్నారు. అంటే భావోద్వేగాలను పంచుకోవడం కూడా వీరికి ఇంకా ఇబ్బందిగానే ఉందని తెలుస్తోంది. ఇక, ఇంటి పనులు, పిల్లల పెంపకం వంటివి ఆడవాళ్లే చేయాలని.. అవి మగాళ్ల పనులు కావని జెన్ జెడ్ యువకుల్లో సుమారు 21 శాతం మంది అభిప్రాయపడుతున్నారట. బేబీ బూమర్ పురుషుల్లో ఇలాంటి ఆలోచనలు కేవలం 8 శాతం మందిలో మాత్రమే ఉండటం ఆశ్చర్యకరం.

మొత్తం మీద ఈ ఫలితాలను చూస్తుంటే.. సమానత్వం గురించి సోషల్‌మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నప్పటికీ.. జెన్‌ జెడ్ కుర్రాళ్లు మాత్రం పాత కాలపు సంప్రదాయల నుంచి ఇంకా బయటపడలేకపోతున్నారని అర్థమవుతోంది.