జెన్ జీ మంత్రం..సోషల్ మీడియా యుద్దం..క్షుద్ర పూజల తంత్రం!

తెలంగాణ రాజకీయాల్లో జెన్ జీ ఉద్యమాలు, సోషల్ మీడియా ప్రచారం కీలకంగా మారుతున్న వేళ.. కాంగ్రెస్-బీఆర్ఎస్ మధ్య క్షుద్ర పూజల ఆరోపణలు కొత్త రాజకీయ చర్చకు దారితీశాయి.

Reported by: Tejaswini Nanna | జాతీయం | Aug 01, 2026, 12:55 pm IST
Read Time: 9 mins
జెన్ జీ మంత్రం..సోషల్ మీడియా యుద్దం..క్షుద్ర పూజల తంత్రం!

తెలంగాణ రాజకీయాలు అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీల మధ్య పోటాపోటీ ఆధిపత్య ఎత్తులు..పై ఎత్తుల పర్వంతో..స్కామ్ ల ఆరోపణలతో, అనూహ్య మలుపులతో కొనసాగుతూ..చివరకు తంత్ర మంత్రాల వద్దకు చేరాయి. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో సోషల్ మీడియా వేదికగా అధికార సాధనకు కాంగ్రెస్, బీఆర్ఎస్ లు హోరాహోరిగా తలపడిన సంగతి తెలిసిందే. ఎన్నికల్లో ఓడిన బీఆర్ఎస్ పార్టీ ప్రజలే తమను ఓడించి తప్పు చేశారని..సోషల్ మీడియాను సరిగ్గా ఉపయోగించలేక ఓడామంటూ సన్నాయి రాగాలు వినిపించింది. ఎన్నికల రాజకీయ వ్యవస్థలో సోషల్ మీడియా నిర్ణయాత్మక శక్తిగా మారిందని భావించిన రాజకీయ పార్టీలు పోటాపోటీగా సోషల్ మీడియా శక్తులను పెంచుకుంటూ వెళ్తున్నాయి. ఇది ఇలా ఉండగానే విదేశాల్లో ప్రభుత్వాలను మార్చేసిన జెన్ జీ ఉద్యమాల ప్రభావం బొద్దింకల పార్టీ(కాక్రోచ్ జనతా పార్టీ ) పుణ్యమా అని దేశంలో మొదలైంది. నీట్ పేపర్ లీకేజీలతో విద్యార్ధులలో నెలకొన్న అవేశం..ఆవేదన ఆందోళనల మధ్య జెన్ జీ ఉద్యమం చెలరేగి, కేంద్ర సర్కార్ మెడలు వంచి ప్రతిపక్షాలకు కూడా సాధ్యం కాని పని చేసి చూపించింది.

అందరి నోట ఇక జెన్ జీ మాట..

దేశంలో అధికార బీజేపీతో ఓట్ల రాజకీయాలలో వెనుకబడిన ప్రతిపక్షాలు విద్యార్ధి, యువతను ఆకర్షించేందుకు అందివచ్చిన జెన్ జీ ఉద్యమం మంచి అవకాశంగా దక్కింది. ప్రస్తుతం దేశంలో జెన్ జీ ట్రెండ్ నడుస్తుండటంతో అధికార సాధన దిశగా బలపడటం కోసం ప్రతిపక్షాలు..అధికారాన్ని నిలుపుకునేందుకు అధికార పక్షాలు అనివార్యంగా జెన్ జీ మంత్రం పఠిస్తున్నాయి. ఇటు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సైతం జెన్ జీ ఆకర్షక రాజకీయాల దిశగా అందరి కంటే ఓ అడుగు ముందుకేసి యువత చట్ట సభలలో అడుగుపెట్టే వయసును 21కి తగ్గించాలంటూ అసెంబ్లీలో తీర్మానం చేస్తామని ప్రకటించారు. అదే సమయంలో ఉపాధ్యాయ సదస్సులో నేటి తరం ఇంజనీరింగ్ విద్యార్ధులను క్రిమినల్ వేస్ట్ గా వివాదస్పద వ్యాఖ్యలు సైతం చేయడం గమనార్హం. సీఎం వ్యాఖ్యలు జెన్ జీని అవమానించేలా ఉన్నాయంటూ ప్రతిపక్షాలు తమదైన రాజకీయ విమర్శలను సైతం సంధించి..వారు సైతం జెన్ జీ పల్లవి వినిపించారు. అధికారంలో ఉన్నప్పుడు విద్యార్ధి, నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీలను తాము ఎంత వరకు అమలు చేశామన్న సోయి మరిచి పోయి మరీ రాజకీయ పక్షాలన్ని జెన్ జీ భజనలో కొట్టుకపోతుండటం మరో విడ్డూరం.

జెన్ జీ ట్రెండ్ లో…క్షుద్ర పూజలు..ఆఘోరాల విమర్శలు!

అధికారవాద రాజకీయాలలో అన్ని పార్టీలు జెన్ జీ మంత్రాన్ని..సోషల్ మీడియా సాధనాలను అనుసరిస్తున్న వేళ అనూహ్యంగా కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీపై క్షుద్ర పూజల ఆరోపణలు చేయడం రాష్ట్ర రాజకీయాలలో విస్మయం రేపింది. తెలంగాణ ప్రభుత్వానికి, సీఎం రేవంత్ కు వ్యతిరేకంగా ప్రతిపక్ష నేత హరీశ్ రావు తాంత్రిక పూజలకు కేంద్రాలైన కర్ణాటకలోని శివమొగ్గ, తిరుచ్చిలోని జై అఘోరకలిలో క్షుద్ర పూజలు నిర్వహిస్తున్నారని సంచలన అద్దంకి ఆరోపణలు చేయడం ఆసక్తి రేపింది. వానాలు పడొద్దని, ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత పెరుగాలని హరీశ్ రావు క్షుద్ర పూజలు చేస్తున్నారంటూ ఆరోపించారు. అధికారం కోల్పోయాక బీఆర్ఎస్ నాయకులు రాష్ట్రానికి చెడు చేసే తాంత్రిక క్షుద్ర పూజల అఘోరాలుగా మారిపోయారని విమర్శించారు. హరీశ్ రావు ఇంతలా దిగజారిపోవడం దుర్మార్గంగా ఉందన్నారు. ప్రభుత్వంపై విమర్శలు చేయడానికి ప్రధాన మీడియా, సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ లు వంటివి అన్నిసరిపోవడం లేదని చివరకు బీఆర్ఎస్ నాయకులు తాంత్రిక క్షుద్ర పూజలకు దిగజారిపోయారని విమర్శించారు. బీఆర్ఎస్ క్షుద్ర పూజలతో బీఆర్ఎస్ నాయకులు తెలంగాణ ప్రజలకు నష్టం చేస్తున్నారని ఆరోపించారు.

‘క్షుద్ర’ రాజకీయంపై కొత్త రచ్చ..

అద్దంకి ఆరోపణలలో వాస్తవం ఉన్నా లేకపోయినా..ఓ వైపు జెన్ జీ మంత్రం పఠిస్తున్న ఆ పార్టీ నాయకత్వం..ఇంకోవైపు తమ ప్రధాన ప్రతిపక్షంపై క్షుద్ర పూజల ఆరోపణలు చేయడం విడ్డూరంగా ఉందంటున్నారు విశ్లేషకులు. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ చేస్తుందనుకున్న క్షుద్ర పూజలతో వారి లక్ష్యం ఎంతమేరకు నెరవేరుతుందోగాని..జెన్ జీ తరంలో క్షుద్ర పూజల రాజకీయం ఏమిటన్నదానిపై కొత్త చర్చ రేకెత్తింది. ప్రజా పక్షపోరాటాలు…ప్రజాసేవలతో ప్రజాదరణ సాధించడం లేదా ప్రభుత్వాలను మార్చడం చేయాల్సిన రాజకీయ పార్టీలు ఇలా క్షుద్ర పూజల స్థాయికి దిగజారిపోవడం ఏమిటంటూ జనం విస్తుపోతున్నారు. ప్రజా పక్ష ఉద్యమాలు, మీడియా, సోషల్ మీడియా సాధనాలతో కాని పని..క్షుద్ర పూజలతో..యజ్ఞ యాగాలతో అవుతుందా అంటూ నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. శాస్త్ర, సాంకేతిక వైజ్ఞానిక, నైతిక రాజకీయాలను ప్రోత్సహించాల్సిన పార్టీలు క్షుద్ర రాజకీయ ఆరోపణలు రొంపిలో పడిపోవడం అసంబద్ధంగా ఉందంటూ మండిపడుతున్నారు. చివరగా ఎవరెన్నిరకాల అధికార వాద రాజకీయ ఎత్తులు..సర్కస్ ఫీట్లు చేసినా.. ప్రజాస్వామిక వ్యవస్థలో జనం అనుకుంటేనే ఏ జెన్ జీ ఉద్యమమైనా..విప్లవమైనా తన లక్ష్యాన్ని చేరుతుందన్నది చారిత్రాక సత్యం.