ఎబోలా విస్తరణ ప్రపంచ దేశాలను వణికిస్తుంది. ముఖ్యంగా మధ్య ఆఫ్రికా దేశమైన కాంగోలో ఎబోలా వేగంగా వ్యాపిస్తోంది. ఇప్పటి వరకు ఆ దేశంలో 550 కిపైగా కేసులు నమోదు కాగా.. 101 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అక్కడి ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఆదివారం ఒక్క రోజే 35 కొత్త కేసులు నమోదు కాగా..10 మంది మృత్యువాత పడినట్లు తెలిపింది. ప్రస్తుతం దేశంలో ఎబోలా వ్యాప్తి తీవ్రత పెరుగుతోందని, అయితే కొన్ని రోజుల తర్వాత తీవ్రత తగ్గే అవకాశం ఉన్నట్లు పేర్కొంది.
తెలంగాణలో ఎబోలా వైరస్ టెన్షన్
ఇటీవల తెలంగాణ రాష్ట్రానికి విదేశాల నుంచి వచ్చిన వారిలో పలువురు మిస్సింగ్ కావడం పట్ల ఆరోగ్య శాఖ అధికారులను టెన్షన్ పెడుతుంది. ఎబోలా తీవ్రత ఎక్కువగా ఉన్న అఫ్రికా దేశాల నుంచి రాష్ట్రానికి వచ్చిన విమాన ప్రయాణికులలో ..26 మంది అడ్రస్ ట్రేస్ కావడం లేదని వైద్యారోగ్య శాఖ వర్గాలు చెబుతున్నాయి. ఎబోలా వైరస్ కంట్రీస్ నుంచి 167 మంది ప్రయాణం చేశారని, వీరిలో 139 మందికి స్క్రీనింగ్ పరీక్షలు చేయగా..వీరికి ఎలాంటి వ్యాధి లక్షణాలు లేవని అధికారులు తెలిపారు. అయితే మిగతా వారి ఆచూకీ తెలియకపోవడం ఆందోళనకరంగామారింది. ఇతర దేశాల నుంచి వచ్చిన ప్రయాణికులలో ఎక్కువ మంది హైదరాబాద్ నగరం వారే ఉన్నారు. ఎబోలా వైరస్ విస్తరణ, నియంత్రణ చర్యలు, ప్రయాణికులకు పరీక్షల అంశాలపై సచివాలయంలో మంత్రి దామోదర రాజనర్సింహ అత్యవసర సమావేశం నిర్వహించారు. అధికార యంత్రాంగం ఎబోలాపై అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.