Damodar Raja Narasimha : సమాజ నిర్మాతలు మహిళలే
మహిళల ఆరోగ్యం సమాజ ఆరోగ్యానికి పునాది. తెలంగాణలో స్వస్థ్ నారీ సశక్త్ పరివార్ అభియాన్‌తో ఉచిత హెల్త్ క్యాంపులు ప్రారంభం.

హైదరాబాద్, సెప్టెంబర్ 17 (విధాత): సమాజ నిర్మాతలు మహిళలే.. వారు ఆరోగ్యంగా ఉంటే కుటుంబం ఆరోగ్యంగా ఉంటుంది, తద్వారా సమాజం కూడా ఆరోగ్యంగా ఉంటుందని మంత్రి దామోదర రాజనర్సింహా అన్నారు. బుధవారం హైదరాబాద్‌లోని అమీర్‌పేట్ కమ్యునిటీ హెల్త్ సెంటర్‌లో స్వస్థ్ నారీ సశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమాన్ని కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్‌లతో కలిసి మంత్రి దామోదర రాజనర్సింహా ప్రారంభించారు.
ఆరోగ్యవంతమైన సమాజం అభివృద్ధిలో ముందు వరసలో ఉంటుందని, రాష్ట్రంలో మహిళల ఆరోగ్య సంరక్షణకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. మహిళల కోసం ప్రత్యేకంగా ఆరోగ్యమహిళ క్లినిక్‌లు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ క్లినిక్‌లలో వారికి అవసరమైన వైద్య సేవలు అందిస్తున్నాం. అన్ని రకాల పరీక్షలు ఉచితంగా చేయిస్తున్నాం. అవసరమైన వారికి చికిత్స ఇచ్చి, మెడిసిన్ అందజేస్తున్నామన్నారు. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడే 2012-2013లో మాతా, శిశు ఆరోగ్య సంరక్షణ కేంద్రాలను ప్రారంభించుకుని.. గర్భిణులు, బాలింతలు, పిల్లలకు వైద్య సేవలు అందిస్తున్నామని, ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా ఎంసీహెచ్‌లు విస్తరించి వైద్య సేవలు అందిస్తున్నామని మంత్రి పేర్కొన్నారు.
దేశవ్యాప్తంగా కేన్సర్ కేసులు పెరుగుతున్నాయి. ముఖ్యంగా మహిళల్లో బ్రెస్ట్ కేన్సర్ కేసులు ఎక్కువగా నమోదు అవుతున్నాయి. చాలా వరకూ బ్రెస్ట్ కేన్సర్ కేసులు చివరి దశలోనే బయట పడుతున్నాయన్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసిన డే కేర్ కేన్సర్ సెంటర్ల ద్వారా మహిళల్లో కేన్సర్ స్క్రీనింగ్.. ఎర్లీ డిటెక్షన్‌కు ప్రాధాన్యతను ఇస్తున్నామన్నారు.
ఎన్‌సీడీ క్లినిక్‌ల ద్వారా బీపీ, షుగర్, కిడ్నీ, గుండె, కేన్సర్ జబ్బుల బారిన పడిన మహిళలకు వైద్య సేవలు అందిస్తున్నాం. ట్రాన్స్‌జెండర్ల కోసం మైత్రి క్లినిక్స్ ఏర్పాటు చేశాం. ఆరోగ్య రంగంలో మాత్రమే కాదు.. ఉపాధి కల్పన, ఉద్యోగవాకాశాలు, ప్రభుత్వ సంక్షేమ పథకాల్లోనూ మహిళకు మొదటి ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు.
మహిళల ఆరోగ్యానికి ప్రాధాన్యతను ఇస్తూ స్వస్థ్ నారీ సశక్త్ అభియాన్ కార్యక్రమాన్ని తీసుకున్న కేంద్ర ఆరోగ్యశాఖకు అభినందనలు అని మంత్రి దామోదర తెలిపారు. స్వస్థ్ నారీ సశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా ఈ నెల 17 నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకూ మహిళల కోసం రాష్ట్రవ్యాప్తంగా హెల్త్ క్యాంపులు నిర్వహిస్తున్నామని, ఈ సేవలను మహిళలు వినియోగించుకోవాలని మంత్రి దామోదర రాజనర్సింహా తెలిపారు.