Hujurabad | ఈటల వర్సెస్ బండి : స్థానికంపై లీడర్ల పంచాయితీ!

బీజేపీకి చెందిన ఇద్దరు ముఖ్య నాయకుల మధ్య సాగుతున్న ఆధిపత్య పోరుతో హుజురాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలోని కమలం పార్టీలో అంతర్గతంగా అగ్గిరాజుకున్నది. నువ్వా? నేనా? అంటూ ఇద్దరు ఎంపీలు ఢీ అంటే ఢీ అంటూ పోటీపడటంలో ఒకే నియోజకవర్గంలో రెండు గ్రూపులుగా బీజేపీ నాయకులు, శ్రేణులు నిట్టనిలువునా చీలిపోయారు.

Hujurabad | ఈటల వర్సెస్ బండి : స్థానికంపై లీడర్ల పంచాయితీ!
  • కమలాల కయ్యం.. హుజురా‘బాధ’
  • ఒక్క సెగ్మెంటు… ఇద్దరు ఎంపీలూ

విధాత, ప్రత్యేక ప్రతినిధి: 

బీజేపీకి చెందిన ఇద్దరు ముఖ్య నాయకుల మధ్య సాగుతున్న ఆధిపత్య పోరుతో హుజురాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలోని కమలం పార్టీలో అంతర్గతంగా అగ్గిరాజుకున్నది. నువ్వా? నేనా? అంటూ ఇద్దరు ఎంపీలు ఢీ అంటే ఢీ అంటూ పోటీపడటంలో ఒకే నియోజకవర్గంలో రెండు గ్రూపులుగా బీజేపీ నాయకులు, శ్రేణులు నిట్టనిలువునా చీలిపోయారు. హుజురాబాద్ కేంద్రంగా ఈ ఇద్దరి నాయకుల మధ్య బీజేపీ రాజకీయం రసవత్తరంగా సాగుతోంది. కేంద్ర మంత్రి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్, మాజీ మంత్రి, మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ లు హుజురాబాద్ మే సవాల్ అంటూ పరస్పరం బహిరంగంగానే పార్టీ శ్రేణులను రెచ్చగొడుతున్నారు.

దీంతో క్రమశిక్షణకు మారుపేరంటూ కితాబులిచ్చుకునే కమల దళంలో ఒకరి పొడ ఒకరికి గిట్టని పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ ఇద్దరు నాయకులు తమ అనుకూల నాయకులకే అభ్యర్ధిత్వం దక్కుతోందని ఎవరికి వారు భరోసా ఇస్తూ ఇది నా అడ్డా అంటే కాదు… నా అడ్డా అంటూ అడ్డంగా వాదిస్తున్నారు. పార్టీ ప్రతిష్ట, పరువు బజారున పడి నియోజకవర్గంలో రెండు గ్రూపులుగా విడిపోయి తన్నుకోవడమే తరువాయిగా పరిస్థితి మారింది. గత పార్లమెంటు ఎన్నికలకు ముందు నుంచి ఇద్దరి మధ్య పెరిగిన వైషమ్యాలు ఇప్పుడు పతాకస్థాయికి పెరిగి స్థానిక ఎన్నికల్లో ఎవరి పట్టును వారు నిలుపుకునేందుకు పావులు కదుపుతున్నారు.

ఈటల వర్సెస్ బండి..!

హుజురాబాద్ నియోజకవర్గంలో ప్రత్యర్ధి పార్టీల కంటే సొంత పార్టీలోని ఈటల, బండి వర్గాల మధ్య రాజకీయం రసవత్తంగా మారిందంటున్నారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ కరీంనగర్ ఎంపీగా రెండవ పర్యాయం గెలిచి ప్రస్తుతం కేంద్ర మంత్రిగా ఉన్నారు. గతంలో ఆయన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు. కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో హుజురాబాద్ అసెంబ్లీ సెగ్మెంటు ఉంది. ఈ అసెంబ్లీ సెగ్మెంటుకు ఎమ్మెల్యేగా, మంత్రిగా ఈటల ప్రాతినిధ్యం వహించారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఈటల.. గజ్వేల్, హుజురాబాద్ నుంచి పోటీ చేసి ఓటమిపాలయ్యారు. ఆ తర్వాత జరిగిన ఎంపీ ఎన్నికల్లో మల్కాజిగిరి నుంచి గెలుపొందారు.

దీంతో తన ఎంపీ నియోజకవర్గం పరిధిలోని హుజురాబాద్ లో తాను అనుకున్నదే సాగాలనేది బండి వాదన. తొలి నుంచి తాను ప్రాతినిధ్యం వహిస్తున్న హుజురాబాద్ లో తన మాటే చెల్లుబాటు కావాలని ఈటల వాదన. ఈ నియోజకవర్గంలో ఇద్దరికి అనుచరులున్నారు. తొలి నుంచి బీజేపీలో కొనసాగుతూ వచ్చిన బండికి పాత బీజేపీ నాయకులు తన అనుచరులుగా ఉండగా, బీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరిన ఈటలకు తన వెంటవచ్చిన వారున్నారు. స్థానిక ఎన్నికల్లో తన వర్గానికే పెద్ద పీట వేసేందుకు బండి సంజయ్ చక్రం తిప్పుతుండగా.. తన పట్టును నిలబెట్టుకునేందుకు, తన అనుచరులకే స్థానిక ఎన్నికల్లో పోటీచేసే విధంగా ఈటల గట్టిగా నిలబడుతున్నారు. పార్టీ నుంచి టికెట్ దక్కకపోతే స్వతంత్రంగానైనా పోటీకి సిద్ధమంటూ ఈటల ఇప్పటికే సిగ్నల్ ఇచ్చారు.

ఇదిలా ఉండగా గత పార్లమెంటు ఎన్నికల్లో ఈటల రాజేందర్ తన విజయానికి సహకరించలేదని బండి సంజయ్ ఆరోపిస్తుండగా, తన సహకారంతోనే ఆయన విజయం సాధించారని ఈటల చెబుతున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ వాతావరణంలో ఈ ఇద్దరి మధ్య సయోధ్య కుదిర్చే నాయకులు లేకపోగా, ఇద్దరు బీసీ నాయకులు తన్నుకుంటే తమకే ప్రయోజనమనే అభిప్రాయంతో కొందరు నాయకులున్నట్లు ఆ పార్టీ వర్గాలే చెబుతున్నాయి. అందుకే అగ్నికి ఆజ్యంపోసినట్లు ఇద్దరి నేతల మధ్య సాగుతున్న మాటల యుద్ధాన్ని చూసి సంతోషిస్తున్నట్లు చెబుతున్నారు.

తాజాగా రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో మరోసారి హుజురాబాద్ రాజకీయం రంజుగా మారిందంటున్నారు. తెరవెనుక సంజయ్ పావులు కదుపుతుండగా, ఎమ్మెల్యే ఎన్నికల్లో తిరిగినట్లు తిరిగి తన వర్గం నాయకులను గెలిపించుకుంటానంటూ ఈటల ఇప్పటికే ప్రకటించడం విశేషం. ఈ ఇద్దరిలో ఎవరో ఒకరు తగ్గి రాజీకుదుర్చుకుంటారా? లేక టగ్ ఆఫ్ వార్ అంటూ పరస్పరం తమ ఆధిపత్యాన్ని నిలబెట్టుకునేందుకు సిద్ధమవుతారా? అనే చర్చ సాగుతోంది.