Surrendered Maoist Leaders | లొంగిపోయిన మావోయిస్టు నేతల పయనమెటు!?

లొంగిపోయిన మావోయిస్టు పార్టీ నేతలు రాజకీయ కార్యాచరణను బహిరంగంగా ఏ పద్ధతిలో కొనసాగిస్తారు? నూతన రాజకీయ పార్టీని ఏర్పాటు చేస్తారా? బహిరంగ మావోయిస్టు పార్టీ నిర్మాణానికి పూనుకుంటారా? ప్రజా సంఘాలతో పాటు ఇతరత్రా నూతన వేదికలను నిర్మాణం చేస్తారా? ఇతర ప్రజాస్వామిక రాజకీయ శక్తులతో కలిసి ముందుకు సాగుతారా?...

Surrendered Maoist Leaders | లొంగిపోయిన మావోయిస్టు నేతల పయనమెటు!?
  • రాజకీయ జీవితాన్ని కొనసాగించడమెలా?
  • రాజ్యాంగ, చట్టబద్ద ‘ఆచరణాత్మకత’కు ఏదీ మార్గం?
  • ఆసక్తికరంగా దేవ్ జీ, సంగ్రామ్, సోను, సతీశ్, చంద్రన్న ప్రకటన
  • బహిరంగ కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేస్తారా?
  • వివిధ వర్గాల్లో భిన్నాభిప్రాయాలు

విధాత, ప్రత్యేక ప్రతినిధి:
Surrendered Maoist Leaders | దేశంలో మావోయిస్టుల నిర్మూలన లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం దృఢ సంకల్పంతో చేపట్టిన ఆపరేషన్ కగార్ దాదాపు విజయవంతంగా ముగింపు దశకు వచ్చింది. ఈ దశలో అనేక మంది ఎన్‌కౌంటర్ల బారిన పడి మృతిచెందగా మరికొందరు లొంగుబాట పట్టారు. ఇందులో కొందరు ఆయుధాలతో సహా లొంగిపోయారు. లొంగిపోయిన వారిలో సాధారణ స్థాయి నాయకులు, కేడర్ భవిష్యత్తు పయనమెలా ఉన్నప్పటికీ ఈ సందర్భంగా అగ్రనేతలు చేస్తున్న కీలక ప్రకటనలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. అనారోగ్యం, అసాధారణ పరిస్థితుల కారణంగా తాము పోలీసుల ముందు లొంగిపోతున్నట్లు ప్రకటిస్తూనే రానున్న రోజుల్లో ‘రాజకీయ జీవితాన్ని కొనసాగిస్తామంటూ’ ప్రకటించి విప్లవాభిమానులతోపాటు రాజకీయ వర్గాల్లోనూ కొత్త చర్చలకు దారితీస్తున్నారు. అయితే ఆయా నాయకుల ప్రకటనలపై వివిధ వర్గాల నుంచి భిన్నవాదనలు, అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పరిస్థితుల ప్రభావం, కారణంగా లొంగిపోయిన నేతలు కొందరు ఆయుధాలతో లొంగిపోతే మరికొందరు నిరాయుధులుగా లొంగిపోయారు. వీరిలో అగ్రనేతలు మాత్రం తమ భవిష్యత్తు జీవితం రాజకీయాలతో కొనసాగుతోందని ప్రకటించడం గమనార్హం. అందులో ప్రజలు, ప్రజాస్వామిక రాజకీయాలు, హక్కుల కోసం, ఉద్యమాలను సంఘటితం చేసేందుకు ‘బహిరంగ’ చట్టబద్ద కార్యకలాపాలు నిర్వహిస్తామంటూ ప్రకటిస్తూ వచ్చారు. ఈ అభిప్రాయాలు వ్యక్తం చేయడం మేరకు కొందరు సమర్ధిస్తూ, కొందరు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నప్పటికీ ‘ఆచరణాత్మక కార్యక్రమం’ పైనే అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

విజయం దిశలో ఆపరేషన్ కగార్

గత రెండేళ్ళుగా చేపట్టిన ఆపరేషన్ కగార్‌లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు సహా అనేక మంది అగ్రనేతలు, హిడ్మా సహా దండకారణ్య ముఖ్య నాయకులు వందల మంది వరుస ఎన్‌కౌంటర్లలో మృత్యువాతపడ్డారు. సాధారణ స్థాయి సభ్యుని నుంచి కేంద్ర కమిటీ పొలిట్ బ్యూరో సభ్యులు మల్లోజుల వేణుగోపాల్, తక్కెళ్ళపల్లి వాసుదేవరావుతో సహా పీఎల్జీఎ నేతలు బర్సిదేవా తదితరులు వందలాది మంది ఆయుధాలతో సహా లొంగుబాట పట్టారు. తాజాగా పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు, మిలిటరీ కమిషన్ ఇన్‌చార్జ్ తిప్పిరి తిరుపతి, మల్లా రాజిరెడ్డి, రాష్ట్ర కార్యదర్శి బడే చొక్కారావు, నర్సింహారెడ్డి సహా అగ్రనేతలు పోలీసుల ముందు లొంగిపోయారు. వీరంతా అందుబాటులో ఉన్న మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ సీఎం, హోం మంత్రి, తెలంగాణ రాష్ట్ర పోలీసు అధికారుల ముందు లొంగిపోయారు.

రాజకీయ జీవితాన్ని కొనసాగిస్తాను: దేవ్ జీ

తాను తన రాజకీయ జీవితాన్ని కచ్చితంగా కొనసాగిస్తానని మావోయిస్టు పార్టీ అగ్రనేత దేవ్‌జీ అలియాస్ తిప్పిరి తిరుపతి స్పష్టం చేశారు. అనారోగ్య కారణాల రీత్యా ప్రస్తుతం రహస్య జీవితం నుంచి బహిరంగ జీవితంలోకి వచ్చాను తప్ప వ్యక్తిగత జీవితం కోసం రాలేదన్నారు. ప్రజా సమస్యలపై చట్టబద్ధంగా రాజ్యాంగం ఫ్రేమ్ వర్క్‌లో పోరాటం చేస్తామని అన్నారు. దశాబ్దాలుగా తాము నమ్మిన సిద్ధాంతం ప్రకారం ప్రజల పక్షాన పనిచేస్తామన్నారు. పార్టీ అగ్రనేత మల్లా రాజిరెడ్డి అలియాస్ సంగ్రామ్ కూడా ఇదే తరహాలో మాట్లాడారు. అంతకు ముందు మహారాష్ట్ర సీఎం ముందు లొంగిపోయిన తర్వాత ఇటీవల పార్టీ అగ్రనేత మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ సోనూ మీడియాతో మాట్లాడుతూ “మునుపటిలాగే, నేను ప్రజల మధ్యకు వెళ్తాను. రాజ్యాంగం మనకు హక్కులను ఇస్తుంది, మేము దానికి అనుగుణంగా పని చేస్తాం” అన్నారు. ఎన్నికల రాజకీయాల్లోకి వస్తారా? అని అడగగా, “నేను రాజకీయాలను ఎప్పుడూ వదలలేదంటూ” సమాధానమిచ్చారు. ఎన్నికల్లో పోటీ చేయడంపై స్పందిస్తూ “ఈ దేశంలో పోటీ చేయాలంటే అదానీ, అంబానీల మద్దతు కావాలి,” అని వ్యాఖ్యానించారు.

ప్రజా సమస్యల పరిష్కారానికి యత్నం: సతీష్

ప్రజల్లో ఉంటాం, వారి సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామని పార్టీ అగ్రనేత తక్కెళ్ళపల్లి వాసుదేవరావు అలియాస్ సతీష్ అన్నారు. ఛత్తీస్‌గఢ్‌లో లొంగిపోయిన తర్వాత కొద్ది రోజులకు ఆయన మీడియాతో మాట్లాడారు. సాయుధ పోరాటం పై తమకు భిన్నాభిప్రాయాలున్నప్పటికీ భవిష్యత్తులో ఇక్కడి ఆదివాసీ ప్రజలకు అండగా నిలుస్తామని చెప్పారు. లొంగిపోయిన తామంతా కలిసికట్టుగా ఉన్నామన్నారు.

ప్రజాజీవితాన్ని కొనసాగిస్తాను: చంద్రన్న

భవిష్యత్తులో ప్రజాస్వామిక పద్ధతిలో పనిచేస్తూ ప్రజాజీవితాన్ని కొనసాగిస్తానని మావోయిస్టు అగ్రనేత పుల్లారి ప్రసాద్ అలియాస్ చంద్రన్న చెప్పారు. తనతోపాటు లొంగిపోయిన బండి ప్రకాశ్‌తో కలిసి ప్రజాస్వామిక పద్ధతిలో పనిచేస్తామన్నారు. సాయుధ పోరాట విరమణపై తమకు భిన్నాభిప్రాయం ఉందన్నారు. బహిరంగ కార్యకలాపాలు కొనసాగిస్తామని ప్రకటించారు.

ఆసక్తికరంగా నేతల ప్రకటనలు

సాయుధ పోరాట విరమణపై లొంగిపోయిన కేంద్ర కమిటీ ముఖ్యనేతలకు భిన్నాభిప్రాయాలున్నప్పటికీ తమ రాజకీయ జీవితాన్ని కొనసాగిస్తామంటూ ప్రకటిస్తూ వచ్చారు. కొందరు కొన్ని రకాలుగా తమ అభిప్రాయాలు వ్యక్తం చేసినప్పటికీ అందరూ ప్రజా సమస్యలు, ప్రజాస్వామిక పద్ధతుల్లో వారికి అండగా, హక్కుల కోసం పనిచేస్తామంటూ వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. చట్టబద్ద, రాజ్యాంగ పరిధిలో పనిచేస్తామంటూ చెప్పే యత్నం చేశారు. రహస్య జీవితాలకు స్వస్తిపలికామని, బహిరంగ పద్ధతుల్లో పనిచేస్తామంటూ ముక్తాయింపు ఇచ్చారు. గత కొన్ని దశాబ్దాలుగా తాము నమ్మిన మావోయిస్టు పార్టీ సిద్ధాంతాలు, రాజకీయాలకు అనుగుణంగానే తమ భావి జీవితం ఉంటుందంటూ కొందరు తేల్చిచెప్పగా మరికొందరు మాత్రం ప్రజల వెంట నడుస్తామంటూ వివరించే ప్రయత్నం చేశారు. అందరూ రాజకీయ జీవితాన్ని కొనసాగిస్తామంటూనే ఎన్నికల రాజకీయాలకు దూరం పాటిస్తామంటూ చెప్పకనే చెప్పడం కొసమెరుపు.

నేతల మాటలతో తలెత్తుతున్న పలు ప్రశ్నలు

లొంగిపోయిన మావోయిస్టు పార్టీ నేతల ప్రకటనలు ఇప్పుడు మరో చర్చకు దారి తీస్తోంది. మావోయిస్టు పార్టీ దాదాపు ఖతమైందని చెప్పుకుంటున్న క్రమంలో ఈ నేతలు తమ రాజకీయ కార్యాచరణను బహిరంగంగా ఏ పద్ధతిలో కొనసాగిస్తారు? దీని కోసం వీరు ఏ వేదికలను వినియోగిస్తారనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. నూతన రాజకీయ పార్టీని ఏర్పాటు చేస్తారా? బహిరంగ మావోయిస్టు పార్టీ నిర్మాణానికి పూనుకుంటారా? ప్రజా సంఘాలతో పాటు ఇతరత్రా నూతన వేదికలను నిర్మాణం చేస్తారా? ఇతర ప్రజాస్వామిక రాజకీయ శక్తులతో కలిసి ముందుకు సాగుతారా?… అనేక ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేతలు ప్రకటిస్తున్న మావోయిస్టు రాజకీయాలను బహిరంగంగా కొనసాగించడం అంత సులువైన అంశం కాదంటున్నారు. లేదా? రానున్న రోజుల్లో రాజకీయంగా జరిగే మార్పుల ప్రభావంతో ఎన్నికల రాజకీయాల్లోకి అడుగిడుతారా? అందివచ్చే అవకాశాలను వినియోగించుకుని ఇతర రాజకీయ పార్టీల్లో చేరుతారా? అంటూ అనేక అనుమానాలు, ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి.