Ponguleti Srinivas Reddy  | రాష్ట్రవ్యాప్తంగా తాసిల్దార్‌, ఆర్డీవో కార్యాలయాలకు శాశ్వత భవనాలు : మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

తెలంగాణ రాష్ట్రం ఏర్ప‌డక ముందు, ఏర్ప‌డిన త‌ర్వాత కూడా రెవెన్యూ కార్యాల‌యాలు ప్ర‌జ‌ల‌కు సౌక‌ర్య‌వంతంగా లేక‌పోవ‌డంతోపాటు చాలా వ‌ర‌కు అద్దె భ‌వ‌నాల‌లోనే కొన‌సాగుతున్నాయ‌ని మంత్రి పొంగులేటి అన్నారు. గత ప్రభుత్వం ముందుచూపు, ప్రణాళిక లేకుండా మండలాల పునర్విభజన చేపట్టిందని, కొన్ని మండలాలు రెండు మూడు జిల్లాల పరిధిలోకి వచ్చేలా చేశారని మంత్రి విమర్శించారు.

  • By: TAAZ |    telangana |    Published on : Feb 25, 2026 6:00 PM IST
Ponguleti Srinivas Reddy  | రాష్ట్రవ్యాప్తంగా తాసిల్దార్‌, ఆర్డీవో కార్యాలయాలకు శాశ్వత భవనాలు : మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

Ponguleti Srinivas Reddy  | తెలంగాణ ప్రజలకు మరింత సౌకర్యవంతమైన, పారదర్శక పరిపాలన అందించే లక్ష్యంతో తాసిల్దార్‌, ఆర్డీవో కార్యాలయాలకు శాశ్వత భవనాలు నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార, పౌరసంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.

అద్దె భవనాల్లో కొనసాగుతున్న 60 తాసిల్దార్‌, 5 ఆర్డీవో కార్యాలయాలకు మొదటి దశలో ఆధునిక సౌకర్యాలతో శాశ్వత భవనాలు నిర్మిస్తామని వెల్లడించారు. శిథిలావస్థలో ఉన్న 170 ఆర్డీవో, తాసిల్దార్‌ కార్యాల‌యాల‌ను రెండ‌వ విడ‌త‌లో నిర్మిస్తామ‌ని వెల్ల‌డించారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని భవనాలు ఒకే నమూనాలో, ప్రజలకు అందుబాటులో ఉండేలా డిజైన్ చేయనున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో చర్చించి డిజైన్లకు తుది రూపు ఇస్తామన్నారు. త‌క్కువ ఖ‌ర్చుతో ప్ర‌జ‌ల‌కు అత్యుత్త‌మ సేవ‌లు అందేలా ఈ భ‌వ‌నాల నిర్మాణం ఉంటుందని మంత్రి తెలిపారు. బుధవారం సచివాలయంలోని తన కార్యాలయంలో రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో ఎన్ని తాసిల్దార్‌, ఆర్డీవో కార్యాలయాలు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి? ఎన్ని శిథిలావస్థకు చేరుకుని, పాలనకు అనువుగా లేనివి ఉన్నాయనే వివ‌రాలను సేకరించారు. ప్రభుత్వ కార్యాలయాలు అద్దె భవనాల్లో కొనసాగడం సరైంది కాదని, ప్రజలకు సేవలందించే కేంద్రాలు గౌరవప్రదంగా ఉండాలన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచనకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నామని మంత్రి వివరించారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్ప‌డక ముందు, ఏర్ప‌డిన త‌ర్వాత కూడా రెవెన్యూ కార్యాల‌యాలు ప్ర‌జ‌ల‌కు సౌక‌ర్య‌వంతంగా లేక‌పోవ‌డంతోపాటు చాలా వ‌ర‌కు అద్దె భ‌వ‌నాల‌లోనే కొన‌సాగుతున్నాయ‌ని మంత్రి పొంగులేటి అన్నారు. గత ప్రభుత్వం ముందుచూపు, ప్రణాళిక లేకుండా మండలాల పునర్విభజన చేపట్టిందని, కొన్ని మండలాలు రెండు మూడు జిల్లాల పరిధిలోకి వచ్చేలా చేశారని మంత్రి విమర్శించారు. అనేక కార్యాలయాల్లో కనీస వసతులు లేకపోవడం, సిబ్బంది కొరత తీవ్రంగా ఉండడం వల్ల ప్రజలు ఇబ్బందులు పడ్డారని పేర్కొన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త మండలాలకు అవసరమైన పోస్టులు మంజూరు చేసి పరిపాలనను బలోపేతం చేశామని తెలిపారు. అలాగే ప్ర‌జ‌ల‌కు దూరంగా కల‌క్ట‌రేట్‌ల‌ను నిర్మించి నిర్వ‌హ‌ణ‌ను గాలికివ‌దిలేశార‌ని విమ‌ర్శించారు.

స్టాంపులు, రిజిస్ట్రేషన్లు శాఖలో అత్యాధునిక వసతులతో సమీకృత భవనాల నిర్మాణానికి శ్రీకారం చుట్టామని మంత్రి పొంగులేటి తెలిపారు. ఔటర్ రింగ్ రోడ్ పరిధిలోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, సంగారెడ్డి జిల్లాల్లోని 39 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను 12 క్లస్టర్లుగా విభజించి సమీకృత భవనాలు నిర్మిస్తున్నామని చెప్పారు.ఇప్పటికే గచ్చిబౌలి, మేడ్చల్ మల్కాజిగిరి, పటాన్ చెరువులలో భవనాలకు శంకుస్థాపన పూర్తయ్యిందని, గచ్చిబౌలిలో నిర్మాణ పనులు తుది దశలో ఉండి మరికొద్ది నెలల్లో ప్రారంభానికి సిద్ధమవుతుందని తెలిపారు. రాష్ట్రంలో రెవెన్యూ వ్యవస్థను ఆధునికీకరించి, ప్రజలకు వేగవంతమైన సేవలు అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి తెలిపారు.