ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ కు చెందిన ఎలక్ట్రానిక్ కార్ల కంపెనీ టెస్లా తెలంగాణకు వచ్చేసింది. హైదరాబాద్ లో టెస్లా తొలి ఎక్స్‌పీరియన్స్ సెంటర్ ను ప్రారంభించారు. ప్రదర్శనలో టెస్లా Model Y, Model YL కార్లను సందర్శకులకు, కార్ల ప్రియులకు అందుబాటులో పెట్టారు. మాదాపూర్‌లోని హైటెక్‌సిటీలో దీన్ని ఏర్పాటు చేశారు. టెస్లాలో వాడుతున్న సాంకేతికత, భద్రతా ఫీచర్లు, వాహన పనితీరును వాహనదారులు స్వయంగా పరిశీలించ వచ్చని టెస్లా పేర్కొంది. ఈ సందర్బంగా ఎలక్ట్రిక్ వాహనాలు, ఛార్జింగ్ టెక్నాలజీపై అవగాహన ప్రదర్శన కూడా నిర్వహిస్తున్నారు. టెస్లా ఈవీ కారు మోడల్ వై ధర రూ. 50లక్షల 89వేలుగా, మోడల్ వైఎల్ రూ.61లక్షల 99వేలుగా ఉండటం గమనార్హం. వీటిని కంపెనీ చైనా నుంచి దిగుమతి చేసుకుని ఇక్కడ విక్రయిస్తోంది. నగరంలో సూపర్ చార్జర్లను ఏర్పాటు చేసే ప్రణాళికలు ఉన్నట్లు టెస్లా ప్రతినిధులు వివరించారు. బొల్లారం పారిశ్రామిక వాడలో టెస్లా కార్ల డెలివరీ, విక్రయానంతర సేవల కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లుగా వెల్లడించారు. బెంగళూరు, ముంబయి, దిల్లీ, గురుగ్రామ్‌లో ఇప్పటికే టెస్లా ఎక్స్‌పీరియన్స్ సెంటర్లను నెలకొల్పగా.. హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ఈ సెంటర్ భారత్‌లో ఐదోది కావడం విశేషం.
హైదరాబాద్ EV మార్కెట్‌కు టెస్లా ఎంట్రీ ఇవ్వడంతో ఈవీ కార్ల మార్కెట్ లో పోటీ కంపెనీలు గట్టిపోటీ ఎదుర్కొనున్నాయి. అయితే టెస్లా కార్లు చాల ఖరీదైన నేపథ్యంలో ఆ స్థాయి వినియోగదారులే ఆ కార్లను కొనుగోలు చేయవచ్చని టెస్లా ప్రతినిధులు ఆశిస్తున్నారు. కారు డెలివరీకి సాధారణంగా వెయిటింగ్ పీరియడ్ సుమారు 6 నుంచి 10 వారాల వరకు ఉంటోందని సంస్థ వర్గాలు వివరించాయి. మోడల్‌ని బట్టి ఫైనాన్సింగ్ కింద నెలకు రూ. 39,990 నుంచి ఈఎంఐ సదుపాయం కూడా అందుబాటులో ఉంటుందని పేర్కొన్నాయి. ఇందుకోసం ఐసీఐసీఐ బ్యాంక్, కోటక్ మహీంద్రా తదితర బ్యాంకులతో చేతులు కలిపినట్లు వివరించాయి. జూన్ 30లోగా బుక్ చేసుకునే వారికి కాంప్లిమెంటరీ వాల్ కనెక్టర్ పొందవచ్చని పేర్కొన్నాయి.