Tesla Model Y India Launch | ఇండియాలో టెస్లా పరుగులు..ముంబైలో తొలి షోరూమ్ ప్రారంభం

Tesla Model Y India Launch | న్యూఢిల్లీ : ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్(Elon Musk) కు చెందిన అమెరికా దిగ్గజ ఈవీ కార్ మేకర్ టెస్లా(Tesla) భారత్ లో తన తొలి షో రూమ్ ను ప్రారంభించింది. మహారాష్ట్ర సీఎం దేవందర్ ఫడ్నవీస్(Devendra Fadnavis) ముంబై నగరం బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌లోని మార్కర్ మ్యాక్సిటీ మాల్‌లో మంగళవారం షో రూమ్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని టెస్లా మోడల్ వై(Tesla Model Y) కారును ఆవిష్కరించారు. ముంబైలో తొలి ఎక్స్ పీరియన్స్ సెంటర్ ప్రారంభంపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సంతోషం వ్యక్తం చేశారు. టెస్లా నగరంలో ఈవీ మెుబిలిటీ కోసం అవసరమైన ఇన్ ఫ్రా ఏర్పాటు చేస్తుందన్నారు. టెస్లా తన తయారీ ప్లాంట్ ఏర్పాటు చేయాలనుకుంటే అందుకు తమ రాష్ట్రం ఉత్తమమైన ఎంపిక అని షోరూం సందర్శనకు వెళ్లిన సమయంలో చెప్పారు. ఢిల్లీ, గురుగ్రామ్ లలో కూడా టెస్లా షోరూమ్ల త్వరలో తెరుస్తామని ఈ సందర్భంగా కంపెనీ వెల్లడించింది.
తొలుత ‘మోడల్ Y’ ఈవీలను టెస్లా భారత్ మార్కెట్లో విక్రయించనుంది. ఇక్కడ ఆర్‌డబ్ల్యూడీ వెర్షన్ (బేస్) ‘మోడల్ వై’ ధర రూ.61.07 లక్షలుగా (ఆన్‌రోడ్) నిర్ణయించింది. లాంగ్-రేంజ్ వెర్షన్ ధర రూ.69.15లక్షలుగా ఉంది. బేస్ మోడల్ ధర అమెరికాలో 44,990 డాలర్లు (రూ.38.63 లక్షలు), చైనాలో 2,63,500 యువాన్లు (రూ.31.57లక్షలు) జర్మనీలో 45,970 యూరోలు (రూ.46.09లక్షలు)గా ఉంది. దిగుమతి సుంకాలు, రవాణా ఖర్చుల కారణంగా భారత్‌లో దీని ధర ఎక్కువగా ఉంది.