Maoists | మావోయిస్టుల శ‌కం ముగిసిన‌ట్లేనా..? 68 ఏళ్ల త‌రువాత సీన్ రిపీట్‌..!

Maoists | మావోయిస్టు పార్టీపై కేంద్రం ఉక్కుపాదం మోపింది. శ‌త్రుదేశాల‌పై దాడి చేయ‌డానికి ఉప‌యోగించే బ‌ల‌గాల‌ను, ఆయుధాల‌ను ప్ర‌యోగించి మావోయిస్టుల‌కు ప‌ట్టున్న దండ‌కార‌ణ్యంలోకి క‌ర్రెగుట్ట‌ల్లో ఊచ‌కోత కోసింది. వందలాది  మావోయిస్టులు ఈ ఊచ‌కోత‌లో అసువులు బాశారు.

  • By: raj |    telangana |    Published on : Oct 16, 2025 8:08 AM IST
Maoists | మావోయిస్టుల శ‌కం ముగిసిన‌ట్లేనా..? 68 ఏళ్ల త‌రువాత సీన్ రిపీట్‌..!

2026 మార్చి నాటికి మావోల ఏరివేతే టార్గెట్ గా…
యుద్ధం ప్ర‌క‌టించిన కేంద్రం
క‌ర్రెగుట్ట‌ల్లో ఊచ‌కోత‌
అసువులు బాసిన‌ వందలాది మావోలు
నక్సల్స్ పై పట్టు సాధించిన భద్రతా బలగాలు
ముందుకు వెళ్ల‌లేక వెన‌క్కు వ‌స్తున్న సీనియ‌ర్లు
68 ఏళ్ల త‌రువాత సీన్ రిపీట్‌
ఆయుధాలు వదిలేయడంపై మావోల్లో భిన్నాభిప్రాయాలు
పార్టీలో కొత్తగా నిలిచిపోయిన చేరికలు
లొంగిపోతున్న అగ్ర నాయకులు

Maoists | హైదరాబాద్, అక్టోబర్ 15 (విధాత ప్రతినిధి) : మావోయిస్టు పార్టీపై కేంద్రం ఉక్కుపాదం మోపింది. శ‌త్రుదేశాల‌పై దాడి చేయ‌డానికి ఉప‌యోగించే బ‌ల‌గాల‌ను, ఆయుధాల‌ను ప్ర‌యోగించి మావోయిస్టుల‌కు ప‌ట్టున్న దండ‌కార‌ణ్యంలోకి క‌ర్రెగుట్ట‌ల్లో ఊచ‌కోత కోసింది. వందలాది  మావోయిస్టులు ఈ ఊచ‌కోత‌లో అసువులు బాశారు. 2026 మార్చి నాటికి మావోలను ఏరివేస్తామ‌ని ప్ర‌క‌టించిన కేంద్రం అడవులు, ఆదీవాసీ ప్రాంతాల్లో భద్రతా బలగాలను పంపించి అణువణువునా జల్లెడపట్టింది. ఆపరేషన్ కగార్ పేరుతో మావోయిస్టుల ఏరివేత తుదిదశకు చేరుకుంది. నక్సలైట్లకు గట్టి పట్టున్న దండకారణ్యం, అబూజ్‌మడ్ వంటి ప్రాంతాల్లో పోలీసులు పైచేయి సాధించారు. ఎన్ కౌంటర్లలో మావోయిస్టు పార్టీ కీలక నాయకులు మరణించారు. మావోయిస్టు పార్టీ అగ్ర‌నాయ‌కులు, ద‌ళాలు, కార్య‌క‌ర్త‌లు ఊప‌రిపీల్చుకోలేని ప‌రిస్థితి ఏర్ప‌డింది. దీంతో మావోయిస్టుల్లో ఆయుధాలు వీడాల‌న్న అభిప్రాయం బ‌ల‌ప‌డుతోంది. కొంత మంది బ‌య‌ట‌కు వ‌స్తున్నారు. ఈ ప‌రిస్థితి క‌మ్యూనిస్టు పార్టీల్లో స‌రిగ్గా 68 ఏళ్ల త‌రువాత సీన్ రిపీట్ అయిందా? అన్నచ‌ర్చ వామ‌ప‌క్ష మేధావుల్లో జ‌రుగుతున్న‌ది. 1952లో ఆ నాటి ఉమ్మ‌డి క‌మ్యూనిస్టు పార్టీకి ఎదురైన అనుభ‌వ‌మే నేడు మావోయిస్టు పార్టీకి ఎదురైంద‌ని చెపుతున్నారు. ఆనాడు నెహ్రూ సైన్యాలు నాటి హైద‌రాబాద్ రాష్ట్రంపై బ‌డి తెలంగాణ‌లో సాయుధ‌పోరాటం చేస్తున్న క‌మ్యూనిస్టుల‌ను ఊచ కోత కోసింది. దాదాపు 3 వేల మంది మెరిక‌ల్లాంటి తెలంగాణ యువ‌కులను నెహ్రూ సైన్యాలు కాల్చి చంపాయి. ఈ అనుభ‌వంతో ఆనాడు సాయుధ పోరాట‌న్ని కొన‌సాగించ‌లేమ‌ని భావించిన క‌మ్యూనిస్టు పార్టీ అగ్ర నాయ‌క‌త్వం సాయుధ పోరాటాన్ని విమ‌రించింది. దీంతో నాడు క‌మ్యూనిస్టులు సాయుధ పోరాటానికి ద్రోహం చేశార‌ని ప్ర‌క‌టించిన కొంత మంది నాయ‌కులు తిరిగి సాయుధ పోరాటం కొన‌సాగిస్తామ‌ని ప్ర‌క‌టించారు. అక్క‌డి నుంచి ఎంఎల్ పార్టీలు, మావోయిస్టు పార్టీ ఏర్పాటు కాల క్ర‌మంలో జ‌రిగింది. తిరిగి 68ఏళ్ల త‌రువాత 2025లో కేంద్రం మావోయిస్టుల‌ను అణిచి వేత‌ పేరుతో కొన‌సాగిస్తున్న ఊచ‌కోత వ‌ల్ల ఇక ముందుకు వెళ్ల‌లేమ‌ని భావించిన నేత‌లు తిరిగి వెన‌క్కు వ‌స్తున్నారు.

ఏదారి లేక‌నే…

శత్రువు తమ ఆయువుపట్టును దెబ్బతీస్తోంటే ఆయుధాలు వదిలేసి ప్రభుత్వంతో చర్చించాలని మావోయిస్టు పార్టీలో ఓ వర్గం ప్రతిపాదించింది. మరో వర్గం ఈ ప్రతిపాదనను వ్యతిరేకించింది. మావోయిస్టు పార్టీలో కీలక నాయకులు ఈ విషయమై మీడియాలో లేఖల యుద్ధం చేశారు. అదే సమయంలో చర్చల ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం తోసిపుచ్చింది. ఆయుధాలు వదిలేసిన మావోయిస్టులపై బుల్లెట్ ప్రయోగించబోమని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రకటించారు. ఈ క్రమంలోనే మావోయిస్టు పార్టీ అగ్ర నాయకుడు మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ సోను సహా 60 మంది మావోలు బుధవారం మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ముందు లొంగిపోయారు. ఆయన బాటలోనే తక్కెళ్లపల్లి వాసుదేవరావు అలియాస్ ఆశన్న కూడా లొంగిపోతారని చెబుతున్నారు. మరోవైపు ప్రజా యుద్ధం కొనసాగిస్తామని మరికొందరు మావోలు చెబుతున్నారు. ఎన్ కౌంటర్లలో కీలక నాయకులను కోల్పోవడం, కొత్త సభ్యులు పార్టీలో చేరిక నిలిచిపోవడం వంటి కారణాలతో మావోయిస్టు పార్టీ బలహీనంగా మారింది.

దండకారణ్యంపై పట్టు

1980 ఆరంభంలో అప్పటి సీపీఐ(ఎంఎల్) పీపుల్స్ వార్ ఏడు దళాలను దండకారణ్యానికి పంపింది. తెలంగాణలో మాదిరిగా ఈ ప్రాంతంలో పార్టీని బలోపేతం చేశారు. 1987లో దండకారణ్యంలో పార్టీ కార్యకలాపాల మార్గదర్శకత్వం కోసం ప్రత్యేకంగా అటవీ కటమిటీ ఏర్పడింది.1992 నాటికి దండకారణ్యాన్ని గెరిల్లా జోన్ గా ప్రకటించారు. 1995లో దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ ఏర్పడింది. అప్పట్లో పీపుల్స్ వార్ కు చెందిన అతి పెద్ద సంస్థల్లో ఇది ఒకటి. దండకారణ్యం సహా పార్టీని విస్తరించారు.1993లో ప్రత్యేక గెరిల్లా స్వ్కాడ్ లను ఏర్పాటు చేశారు. 1995లో ప్లాటూన్ రూపంలో సైనిక కార్యకలాపాలు పెరిగాయి. 2009 ఆగస్టులో పీజీఎల్ఏ ఫస్ట్ బెటాలియన్ దక్షిణ బస్తర్ లో ఏర్పడింది. 2010 చివరి నాటికి డీకేలో పీజీఎల్ఏ బెటాలియన్ తో పాటు ఎనిమిది సైనిక కంపెనీలను మావోయిస్టు పార్టీ ఏర్పాటు చేసుకుంది. మైన్ పూర్ , ధమ్తారి, మహాసముంద్ ప్రాంతాలను సీపీఐ ఒడిశా రాష్ట్ర కమిటీ కిందకు తెచ్చారు. 2004 నాటికి రాజ్ నందగావ్ వరకు 2010 నాటికి మహాసముంద్ వరకు పార్టీ విస్తరించింది. 2004లో ఏపీలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం నక్సలైట్లతో చర్చలు జరిపింది. ఆ సమయంలోనే ఎంసీసీ, పీపుల్స్ వార్ కలిసి మావోయిస్టు పార్టీగా ఏర్పడినట్టు అప్పట్లో ప్రకటించారు.

మావోయిస్టులకు ఎదురుదెబ్బలు

2011 వరకు మావోయిస్టు కార్యకలాపాలు ఊపందుకున్నాయి. కానీ, ఆ తర్వాతి కాలంలో ఆ పార్టీకి వరుసగా ఎదురు దెబ్బలు తగిలాయి. పార్టీలోకి కొత్తగా వచ్చేవారి సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. దీనికితోడు ప్రభుత్వాలు మావోయిస్టుపై ఉక్కుపాదం మోపారు. 2013 మార్చిలో జరిగిన సీపీఐ మావోయిస్టు కేంద్ర కమిటీ సమావేశంలో తమ విప్లవ ఉద్యమానికి ఉన్న ఇబ్బందుల గురించి చర్చించారు. తమ స్థావరాల్లోకి భద్రతా దళాలు ప్రవేశిస్తున్న విషయాన్ని సమావేశంలో చర్చించారు. అంతేకాదు తమకు పట్టున్న ప్రాంతాల్లో భద్రతా దళాలు పాగా వేయడంతో మావోయిస్టుల బలం తగ్గుతూ వస్తోంది. 2018 నాటికి దేశవ్యాప్తంగా ఉద్యమం తాత్కాలికంగా వెనుకబడిపోయింది. 2020 డిసెంబర్ లో దేశంలో విప్లవ ఉద్యమాన్ని మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సమీక్షించింది. ఎదురుదెబ్బల నుంచి బయటపడాలని నిర్ణయం తీసుకున్నారు. కానీ, ఆ దిశగా లక్ష్యాలను సాధించడంలో విఫలమయ్యారు. పెరిగిన టెక్నాలజీ కూడా భద్రతాదళాలకు కలిసివచ్చింది. అత్యాధునిక ఆయుధాలు కూడా భద్రతాదళాలు పైచేయి సాధించడానికి కారణమయ్యాయి. మొబైల్ ఫోన్ల ఒక రకంగా శత్రువుకు మావోల ఆచూకీ కనిపెట్టేందుకు దోహదపడ్డాయి. 2024 ఆగస్టులో పార్టీ బలోపేతంపై చర్చించారు. దీన్ని అమలు చేసేలోపుగానే కీలక నాయకులు ఎన్ కౌంటర్లలో మరణించారు. మరికొందరు అనారోగ్యంతో చనిపోయారు. కొందరు లొంగిపోయారు.

మావోయిస్టుల్లో విభేదాలు

2026 మార్చి నాటికి మావోయిస్టుల ఏరివేత కోసం కేంద్ర హోంశాఖ అన్ని రకాల అస్త్రాలను ప్రయోగించింది. లొంగిపోయిన నక్సలైట్లతో సెక్యూరిటీ ఫోర్స్ ఏర్పాటు చేసింది. అడవుల్లో మావోల ఉనికిని ఈ బలగాల సహాయంతో భద్రతా బలగాలు సులభంగా చేరుకొనేవారు. ఆపరేషన్ కగార్ పేరుతో దట్టమైన అటవీ ప్రాంతంలో మావోయిస్టులను భద్రతా దళాలు ఏరివేశాయి. ఈ సమయంలోనే కాల్పుల విరమణపై మావోయిస్టు అధికార ప్రతినిధి అభయ్ పేరుతో మీడియాకు లేఖ విడుదలైంది. ఆయుధాలు వదిలేసి చర్చలకు సిద్దమని ప్రకటించారు. అయితే ఈ లేఖపై దేవ్ జీ, హిడ్మా పేరుతో మరో లేఖ విడుదలైంది. ఆయుధాల వదిలేసే ప్రసక్తే లేదని ఈ లేఖలో ప్రకటించారు. ప్రజా యుద్ధాన్ని కొనసాగిస్తామని ప్రకటించారు. ఆయుధాలు వదిలి జనజీవన స్రవంతిలోకి రావాలనేది కొందరి అభిమతంగా ఉంది. మరికొందరు దీన్ని వ్యతిరేకించారు. ప్రభుత్వం వద్ద అత్యంత అధునాతనమైన ఆయుధాలు, సీఆర్‌పీఎఫ్ తో పాటు రాష్ట్ర పోలీస్ బలగాలు, మావోయిస్టు నిర్మూలనకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బలగాలు, సాంకేతిక పరిజ్ఞానం వంటిపై మావోయిస్టులపై భద్రతా బలగాలు పైచేయి సాధించేందుకు కారణమయ్యాయి. వీటన్నింటిని పరిశీలించిన ఓ వర్గం ఆయుధాలు వదిలి జనజీవనంలోకి రావాలని ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనను పార్టీలోని మరో వర్గం వ్యతిరేకించింది. ఆయుధాలు వదిలివేయాలని ప్రతిపాదనకు కట్టుబడి ఆ పార్టీ అగ్రనాయకుడు మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ సోను మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ ముందు బుధవారం లొంగిపోయారు. మరో అగ్ర నాయకుడు తక్కెళ్లపల్లి వాసుదేవరావు అలియాస్ ఆశన్న కూడా లొంగిపోతారని చెబుతున్నారు.

ఎన్ కౌంటర్లలో కీలక నాయకుల మృతి

దేశంలో మావోయిస్టు పార్టీని దెబ్బతీసేందుకు కేంద్ర హోంశాఖ వ్యూహాత్మకంగా వ్యవహరించింది. 2024 ఆగస్టులో లెఫ్ట్ వింగ్ తీవ్రవాద కార్యకలాపాలపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశం తర్వాత 2026 మార్చి నాటికి పార్టీని అంతం చేస్తామని ప్రకటించారు. ఈ దిశగా కార్యాచరణ అమలు చేశారు. మావోయిస్టులకు గట్టిపట్టున్న దండకారణ్యం, అబూజ్ మడ్ వంటి ప్రాంతాల్లోని దట్టమైన అటవీ ప్రాంతాల్లో కూడా భద్రతా దళాలు వెళ్లాయి. మావోయిస్టుల ఆధీనంలో ఉన్న ప్రాంతాలను తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. ఎన్ కౌంటర్లలో పదుల సంఖ్యలో మావోయిస్టులు మరణించారు. 2025 ఆరంభం నుంచి ఇప్పటివరకు 248 మంది మావోయిస్టులు మరణించారని గణాంకాలు చెబుతున్నాయి. 2024 నుంచి చూస్తే ఈ సంఖ్య 390కి చేరింది.ఈ ఏడాది మావోయిస్టు కేంద్ర కమిటీ కార్యదర్శి నంబాల కేశవరావు, కేంద్ర కమిటీ సభ్యులు చలపతి, గణేష్ , కేంద్ర కమిటీ సభ్యులు కట్టా రామచంద్రారెడ్డి, కడారి సత్యనారాయణ రెడ్డి వంటి నాయకులు ఎన్ కౌంటర్లలో మరణించారు. ఉన్న కొందరు కీలకనాయకులు వరుసగా మరణిస్తున్నారు. మరికొందరు లొంగిపోతున్నారు. పార్టీ నాయకుల్లో విబేధాల నేపథ్యంలో మావోయిస్టు పార్టీ కనుమరుగు అవుతోందా అనే చర్చకు కారణమైంది.