మేడారంలో ఇది కదా! … ముందు చేయాల్సింది!

మేడారంలో సమ్మక్క సారలమ్మ గద్దెల ప్రాంగణ పునరుద్ధరణ, నిర్మాణ శైలికి సంబంధించిన ఆదివాసీల చరిత్ర పై ప్రచురించిన పుస్తకాన్ని ఆవిష్కరించారు. రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ధనసరి అనసూయ సీతక్కతోపాటు

  • By: Tech |    telangana |    Published on : Mar 01, 2026 9:54 PM IST
మేడారంలో ఇది కదా! … ముందు చేయాల్సింది!
  • మేడారంలో ఇది కదా! … ముందు చేయాల్సింది!
  • మేడారంలో చారిత్రికాంశాల పుస్తకావిష్కరణ
  • నిర్మాణాలకు ముందు విడుదల చేస్తే బాగుండేది
  • అనవసర వివాదాలకు తావు ఉండేది కాదేమో?
  • సమ్మక్క సారలమ్మ ఆర్కియాలజీ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్

విధాత, ప్రత్యేక ప్రతినిధి : మేడారంలో సమ్మక్క సారలమ్మ గద్దెల ప్రాంగణ పునరుద్ధరణ, నిర్మాణ శైలికి సంబంధించిన ఆదివాసీల చరిత్ర పై ప్రచురించిన పుస్తకాన్ని ఆవిష్కరించారు. రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ధనసరి అనసూయ సీతక్కతోపాటు జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ తదితరులు ఈ పుస్తకాన్ని గద్దెల ప్రాంగణంలో తూర్పు ఈశాన్యంలో ఉన్న సమ్మక్క ప్రధాన ద్వారం వద్ద తాజాగా ఆవిష్కరించారు. సమ్మక్క సారలమ్మ ఆర్కియాలజీ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ పరిశోధకులు ఈ పుస్తకాన్ని ప్రచురించారు.
పునరుద్ధరణలో చారిత్రకాంశాలు
రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో సుమారు రూ. 251 కోట్ల వ్యయంతో మేడారం సమ్మక్క, సారల్మ గద్దెల ప్రాంగణాన్ని పునరుద్ధరించడమే కాకుండా, మేడారంలో మాస్టర్ ప్లాన్ అమలు చేస్తూ శాశ్వత నిర్మాణాలు చేపట్టిన విషయం తెలిసిందే. అంతకు ముందున్న గద్దెల చుట్టూ రాతి స్థంభాలు, రాతి ప్రాకారం, రాతితో తొమ్మిది మహా ద్వారాలు నిర్మించారు. ఈ సందర్భంగా గద్దెల పై ఉన్న రాతి స్తంభాలు, రాతి ప్రాకారం లోపల, బయట, రాతి ద్వారాల పై దాదాపు 7వేలకు పై వివిధ రకాల చిత్రాలు చెక్కారు. ఈ విధంగా చెక్కిన చిత్రాల్లో శివలింగం, స్వస్తిక్ ను పోలిన చిత్రం, త్రిశూలం, తిరు నామాల చిత్రాల పై వివాదం నెలకొన్న విషయం తెలిసిందే.

వివాదమైన కొన్ని చిత్రాలు

ముఖ్యంగా స్వస్తిక్ పోలిన చిత్రం, తిరునామాలను పోలిన చిత్రాలు బ్రాహ్మణీయ సంస్కృతికి ప్రతిబింబాలుగా పేర్కొంటూ ఆదివాసీ జాతరలో ఈ సంస్కృతిని ప్రవేశపెడుతున్నారనే విమర్శలు వచ్చాయి. దీనికి మంత్రి సీతక్క, పరిశోధకుడు అరుణ్ కుమార్ స్పందించారు. ఆదివాసీ, ముఖ్యంగా కోయల చరిత్ర పై చేపట్టిన చారిత్రక, పరిశోధన, సమ్మక్క, సారలమ్మలకు సంబంధించిన చరిత్ర పరిశోధన అనంతరమే పై చిత్రాలతో పాటు గద్దెల ప్రాంగణంలో ఏడు వేల చిత్రాలు చెక్కినట్లు వివరించారు. దీనిపై కొందరు చారిత్రక పరిశోధకులు ఆదివాసీ, ముఖ్యంగా కోయల చరిత్రకు సంబంధించిన పరిశోధన ఆధారాలు బహిర్గతం చేయాలని కూడా డిమాండ్ చేశారు. జాతర నిర్వహణతోపాటు ఆదివాసీల నుంచి తగిన మోతాదులో ఈ ప్రశ్న ఎదురుకాకపోవడం మంత్రి సీతక్క, పరిశోధక బృందం ఆదివాసీలు కావడంతో అప్పట్లో సద్దుమణిగింది. తాజాగా ఈ వివరాలతో పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ పరిశోధన వివరాలు, అంశాలు పునరుద్ధరణకు ముందే ప్రచురించి, లేదా చారిత్రాకాంశాలను సాధికారికంగా వెల్లడించి పనులు చేపడితే ఈ అంశాల ఆధారంగా పునరుద్ధరణ సాగుతుందో తెలిసిపోయేదని, ఈ అంశాలపై మరింత సానుకూల చర్చకు అవకాశం ఉండేదంటున్నారు. విమర్శలు, వివాదాలు వచ్చిన తర్వాత మేల్కొవడం ఈ ప్రభుత్వానికి అలవాటుగా మారిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ పుస్తకమో? లేదా పరిశోధన పత్రాలను పారదర్శకంగా బహిర్గతం చేస్తే అనవసర వివాదాలకు తావుండేది కాదంటున్నారు.
తాజాగా వివరాలతో పుస్తకావిష్కరణ
మేడారం నూతన గద్దెల అభివృద్ధి ప్రణాళిక అమలు సందర్భంగా నిర్మించిన 7వేల బొమ్మలకు అర్ధాలను సమ్మక్క సారలమ్మ పరిశోధన బృందం రచించిన ఆదివాసీల చరిత్రకు సంబంధించిన పుస్తకాన్ని ప్రచురించగా, తాజాగా ఆవిష్కరించారు. ఈ పుస్తకంలో పూర్తిగా నూతన గద్దెల అభివృద్ధి, ప్రభుత్వ మాస్టర్ ప్రణాళిక ల్యాండ్ స్కెప్ ల నిర్మాణం గద్దెల ప్రాంగణంలో ఉన్న తొమ్మిది ద్వారాలు, సమ్మక్క సారలమ్మ పగిడిద్దరాజు గోవిందరాజు గద్దెలపై ఉన్న నాగులమ్మ ఆలయంపై చిత్రాలతో పాటు 70 ప్యానెల్స్ పై ఉన్న మొత్త 7వేల బొమ్మల అర్ధాలను సంపూర్ణంగా ఇందులో పొందుపరిచినట్లు పేర్కొన్నారు. ఈ పుస్తకంలో కోయల పూర్వ చరిత్ర మధ్య భారతంలో ఆదివాసీల జీవన విధానం వివరాలు సైతం శాస్త్రీయంగా పొందుపరిచినట్లు పేర్కొన్నారు. ఈ పుస్తకం పూర్తిగా రీసెర్చ్ డాక్యుమెంట్ రూపంలో చాలా శాస్త్రీయ ఆధారాలతో రాసినట్టు సమ్మక్క,సారలమ్మ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫౌండర్ డా.అరుణ్ కుమార్ ఈ సందర్భంగా తెలిపారు. ఇదిలా ఉండగా ఎంతో కష్ట పడి ఆలయ నిర్మాణంలో నిరంతరం భాగస్వామ్యమై ఈ పుస్తక రచన కు కృషి చేసిన అరుణ్ కుమార్ ను మంత్రులు ప్రత్యేకంగా అభినందించారు. ఈ పుస్తక విడుదలకు ఆదివాసీ చరిత్ర నిర్మాణానికి అన్ని రకాలుగా మొదటి నుండి సహకరించిన జిల్లా కలెక్టర్ దివాకర్, ఐటిడిఎ ప్రాజెక్ట్ అధికారి చిత్ర మిశ్రాకు పరిశోధన బృందం ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసింది.