తెలంగాణలో మొదలైన బోనాల సందడి

తెలంగాణలో అషాడ మాసం బోనాల ఉత్సవాలు గోల్కొండ జగదాంబిక అమ్మవారికి తొలి బోనం సమర్పణతో వైభవంగా ప్రారంభమయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేయగా, హైదరాబాద్ వ్యాప్తంగా బోనాల వేడుకలు ఆగస్టు 10 వరకు కొనసాగనున్నాయి.

Reported by: Tejaswini Nanna | తెలంగాణ‌ | Jul 16, 2026, 1:40 pm IST
Read Time: 4 mins
తెలంగాణలో మొదలైన బోనాల సందడి

తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాల ప్రతీక అషాడ మాసం బోనాల ఉత్సవాలు గురువారం వైభవంగా ప్రారంభమయ్యాయి. గోల్కొండ జగదాంబిక అమ్మవారికి సాంప్రదాయంగా కుమ్మరులు తొలి బోనాన్ని సమర్పించడం ద్వారా బోనాలు ఉత్సవాలు మొదలయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్పీకర్ ప్రసాద్ కుమార్ , హైదరాబాద్ ఇంఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ తో కలిసి గోల్కొండ జగదాంబికా అమ్మవారికి దేవాదాయ శాఖ మంత్రి సురేఖ పట్టువస్త్రాలు సమర్పించారు. వర్షాలు సమృద్దిగా కురిసి తెలంగాణ ప్రజలందరూ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో విలసిల్లాలని వారు ఆకాంక్షించారు. గోల్కొండలో తెల్లవారుజాము నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. సంప్రదాయ వస్త్రధారణలో మహిళలు తలపై బోనాలు మోసుకుంటూ, పోతురాజుల విన్యాసాలు, డప్పుల మోతలు, జానపద కళారూపాల నడుమ ఆలయ పరిసరాలు భక్తి పారవశ్యంతో గోల్కొండ కోట ఆధ్యాత్మిక వాతావరణంలో మునిగిపోయింది.

గోల్కొండ జగదాంబిక ఆలయంలో తొలి బోనం సమర్పణతో మొదలైన అషాడ మాసం బోనాల ఉత్సవాల్లో భాగంగా వచ్చే నెల 6 వరకు సప్త మాతృకలకు సప్త బంగారు బోనాలు జరగనున్నాయి. గోల్కొండ జగదాంబిక అమ్మవారికి సమర్పించే తొలి బోనంతో అధికారికంగా బోనాల వేడుకలు మొదలవ్వగా..జులై 19న సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల మహోత్సవానికి అంకురార్పణ జరుగుతుంది. జులై 26న నగరంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కల్యాణోత్సవం వైభవంగా నిర్వహిస్తారు.ఆగస్టు 2 (లష్కర్ బోనాలు)న సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి భక్తులు బోనాలు సమర్పిస్తారు. ఆగస్టు 9 (పాతబస్తీ బోనాలు)న చారిత్రాత్మక లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారితో పాటు పాతబస్తీలోని అన్ని ప్రధాన ముత్యాలమ్మ, మహంకాళి ఆలయాల్లో బోనాల జాతర జరుగుతుంది.
ఆగస్టు 10 (రంగం)న సికింద్రాబాద్, పాతబస్తీ ఆలయాల్లో అమ్మవారి భవిష్యవాణి (రంగం) వినడం, ఆ తర్వాత ఘటాల ఊరేగింపు కార్యక్రమం ఉంటుంది.

బోనాల ఉత్సవాల సందర్బంగా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రధాన రహదారుల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు, వాహనాల మళ్లింపులు ఉంటాయి. బోనాల వేడుకలకు ప్రభుత్వం కేటాయించిన రూ.20 కోట్ల నిధులతో నగరంలోని అన్ని చిన్న, పెద్ద ఆలయాలకు ఆర్థిక సాయం అందించడంతో పాటు మౌలిక వసతులను కల్పించనున్నారు.