తెలంగాణలో 19నుంచి బోనాల పండుగ ఉత్సవాలు

తెలంగాణ రాష్ట్ర పండుగ బోనాల ఉత్సవాలు జూలై 19న గోల్కొండ జగదాంబ అమ్మవారికి తొలి బోనం సమర్పణతో ప్రారంభమై ఆగస్టు 10 వరకు కొనసాగనున్నాయి.

Reported by: Tejaswini Nanna | తెలంగాణ‌ | Jun 16, 2026, 2:20 pm IST
Read Time: 3 mins
తెలంగాణలో 19నుంచి బోనాల పండుగ ఉత్సవాలు

తెలంగాణ సాంస్కృతిక వైభవానికి ప్రతీకగా, రాష్ట్ర పండుగగా కొనసాగుతున్న బోనాల పండుగ ఉత్సవాలకు ప్రభుత్వం యంత్రాంగం సన్నద్దమవుతుంది. ఆషాఢ మాస బోనాల జాతరలో భాగంగా ఈ ఏడాది జూలై 19వ తేదీన గోల్కొండ జగదాంబ అమ్మవారికి తొలి బోనం సమర్పించడంతో బోనాల ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఆగస్టు 10వ తేదీ వరకు హైదరాబాద్ నగరంలో అషాడ మాసం బోనాల ఉత్సవాలు కొనసాగుతాయి.

జూలై 19న ఘటాల ఊరేగింపు..

ఆషాఢ మాసం ప్రారంభాన్ని పురస్కరించుకుని జూలై 19న గోల్కొండ కోటలో జగదాంబ అమ్మవారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు, తొలి బోనం సమర్పిస్తారు. అదే రోజున నగరంలోని పలు ప్రధాన ఆలయాల్లో ఘటాల ఊరేగింపు కార్యక్రమాలను నిర్వహిస్తారు. ఈ మాసంలో ప్రతి ఆది, గురువారాల్లో అమ్మవారికి ప్రత్యేక పూజలు, బోనాల సమర్పణలు ఉంటాయి. గోల్కొండతో ప్రారంభమయ్యే బోనాల జాతర.. లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారు, పాతబస్తీలోని ఉమ్మడి దేవాలయాల ఉత్సవాలతో ముగుస్తుంది.

ఆగస్టు 2న ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి బోనాల సమర్పణ

ఆగస్టు 2న సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి ఆషాడ మాసం బోనాల సమర్పణ కార్యక్రమం కొనసాగనుంది. ఆగస్టు 3న రంగం (భవిష్యవాణి) కార్యక్రమం నిర్వహిస్తారు. ఉత్సవాల వివరాలను ఆలయ ఈఓ మనోహర్ రెడ్డి మంగళవారం హైదరాబాద్ ఇంచార్జీ మంత్రి పొన్నం ప్రభాకర్ కు, మాజీ మంత్రి,సనత్‌నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్‌కు అందజేశారు. వెస్ట్ మారేడ్‌పల్లిలోని క్యాంప్ కార్యాలయంలో తలసానిని కలిసిన ఆలయ పండితులు, దేవాదాయ శాఖ అధికారులు ఆయన బోనాల ఆహ్వాన పత్రికను అందచేశారు.