సార్లూ…టూర్లూ…గాలిమోటరూ!.. హెలికాప్టరూ వాడకంలో మంత్రుల మధ్య పోటీ
ఆ... మంత్రి సార్లూ టూరుకు బయలుదేరాలంటే హెలికాప్టరుండాల్సిందే. ఎక్కినా...దిగినా గాలిమోటరే అన్నట్లుగా వారి టూర్లున్నాయంటున్నారు.
- సార్లూ…టూర్లూ…గాలిమోటరూ!
- ఎక్కినా… దిగినా…. హెలికాప్టరూ
- నిత్యం చర్చల్లో నిలుస్తున్న ‘మంత్రులు’
- వాడకంలో మంత్రుల మధ్య పోటీ
- మంత్రులకు మరొచాపర్ కావాలేమో?
విధాత, ప్రత్యేక ప్రతినిధి: ఆ… మంత్రి సార్లూ టూరుకు బయలుదేరాలంటే హెలికాప్టరుండాల్సిందే. ఎక్కినా…దిగినా గాలిమోటరే అన్నట్లుగా వారి టూర్లున్నాయంటున్నారు. సహజంగా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని హెలికాప్టర్ ను ముఖ్యమంత్రి స్థాయి నేతలు, అత్యవసర సమయాల్లో కొందరు మంత్రులు వాడుకోవడం రివాజుగా వస్తోంది. కానీ, పోటీలు పడి హెలికాప్టర్ వినియోగిస్తున్నట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇందులో ఓ మంత్రి అయితే స్వంత జిల్లాకైనా, ఇంచార్జ్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నా జిల్లా కైనా వెళ్ళాలంటే హెలికాప్టర్ ఎక్కాల్సిందే…అన్నట్లుగా మారిందంటున్నారు. ఈయనతో పొరుగు జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రులు హెలికాప్టర్ వినియోగంలో పోటీపడుతున్నట్లు చర్చించుకుంటున్నారు. ఎన్నికలకు కొద్ది రోజుల ముందు కాంగ్రెస్ లో చేరి అధికారంలోకి రాగానే రాష్ట్ర మంత్రి వర్గంలో మూడు ప్రధాన శాఖలకు మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న సదరు మంత్రి తరచూ వార్తల్లో వ్యక్తిగా నిలుస్తున్నారు. ఇటీవల ఈ మంత్రికి పోటీగా మరికొందరు సీనియర్ మంత్రులు రంగంలోకి దిగి హెలికాప్టర్ లేకుండా జిల్లాల పర్యటనకు వెళ్ళడం లేదనే టాక్ పెరిగింది.
వివాదాలు, విమర్శలు, నిర్ణయాలతోటే కాకుండా తాజాగా ఈ మంత్రి సీఎంను మించి హెలికాప్టర్ వినియోగించడం చర్చనీయాంశంగా మారుతోంది. తాను ఇంచార్జ్ బాధ్యతలు నిర్వహిస్తున్న జిల్లాలో ఒక మంత్రితో పొసగడంలేదనేది బహిరంగ అంశం. ఇటీవల జిల్లాలోని ప్రధాన జాతర అభివృద్ధి పనుల బాధ్యత పేరుతో ఆ మంత్రి ఆ పర్యటనకు వచ్చిన ప్రతీసారీ ‘హెలికాప్టర్’ లేకుండా అక్కడ అడుగుపెట్టలేదంటున్నారు. హైదరాబాద్ బేగంపేట టూ జాతర స్థలానికి షటిల్ సర్వీస్చేసినట్లుగా ఆయన హెలికాప్టర్ వినియోగించినట్లు విమర్శలు వచ్చాయి. మారుమూల అటవీప్రాంతంలో ఉన్న జాతరను సందర్శించేందుకు హెలికాప్టర్ అనువుగా ఉందనే అభిప్రాయం ఒక వైపు ఉన్నప్పటికీ తాజాగా ఆ మంత్రి ఆ జాతర పూర్తయిన నెలరోజుల తర్వాత సమీక్షా సమావేశం నిర్వహిస్తే ఈ కార్యక్రమానికి కూడా సహచర మహిళా మంత్రితో కలిసి హెలికాప్టర్ లో రావడం గమనార్హం. సరే వచ్చారనుకుంటే…. మంత్రిగారు జాతర జరిగిన తీరుపై రివ్యూ నిర్వహించి అక్కడే నిద్రించారు. తెల్లవారిన తర్వాత సమీపంలోని మరో ప్రసిద్ధ దేవాలయాన్ని సందర్శించారు. జాతర ప్రాంతం నుంచి రోడ్డు మార్గంలో ఆ దేవాలయానికి వెళ్ళి తిరిగి రోడ్డు మార్గంలో జాతర స్థలానికి వచ్చి అక్కడి నుంచి హెలికాప్టర్ లో తిరుగుపయనమయ్యే విధంగా టూర్ షెడ్యూల్ చేసుకున్నారు. జాతర సందర్భంగానే ఈ అంశం చర్చనీయాంశంగా మారగా తాజాగా మరోసారి చర్చకు తావిచ్చారు.
ఇదే తరహాలో మరో ఇద్దరు మంత్రులు తమ జిల్లా పర్యటనకు గాలిమోటర్ లేకుండా వెళ్ళడం లేదని చెబుతున్నారు. హెలికాప్టర్ వినియోగించడం తప్పుకాదుగానీ, అవసరం ఉన్నా లేకున్నా దాన్ని వినియోగిస్తున్న తీరే ఇప్పుడు విమర్శలకు తావిస్తోందంటున్నారు. ఇప్పటికే ఈ అంశం పై ప్రతపక్ష బీఆర్ఎస్ నాయకులు సోషల్ మీడియాలో విమర్శలు చేస్తున్నారు. విచిత్రమేమిటంటే తమ ప్రభుత్వ హయంలో సీఎం కంటే డిఫ్యాక్టో సీఎంగా వ్యవహరించారనే ఆరోపణలున్న అప్పటి ఒక మంత్రి హెలికాప్టర్ ను ఎంత వాడాలో అంతావాడారనే అపవాదు మూటకట్టుకున్నారు. అప్పట్లో ఈ అంశం చర్చనీయాంశంగా మారినప్పటికీ ఎవరూ నోరుమెదపలేని పరిస్థితి. ఇప్పుడు కూడా గుసగుసలు వినిపిస్తున్నప్పటికీ పెద్దగా ఎవరూ పట్టించుకోవట్లేదంటున్నారు. ఇదిలా ఉండగా ఈ సంప్రదాయమంతా గత సర్కారు పుణ్యమేఅనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. వాస్తవాలేంటో తెలియనప్పటికీ రోడ్డు మార్గాన భారీ కాన్వాయ్, భద్రతతతో పోల్చితే హెలికాప్టర్ కు ఖర్చుతక్కువ, తక్కువ సమయం, సానుకూల వినియోగమనే అభిప్రాయం మరోవైపు వినిపిస్తోంది. అయితే ఈ మంత్రి హెలికాప్టర్ వినియోగిస్తున్న తీరు మాత్రం చర్చకు తావిస్తోంది. ఇటీవల ఈయనకు పోటీగా మరికొందరు సీనియర్ మంత్రులు తామేమి తక్కువ తిన్నామా అంటూ రంగంలోకి దిగి హెలికాప్టర్ వినియోగాన్ని పెంచినట్లు బహిరంగంగానే చర్చసాగుతోంది. సదరు మంత్రులు కూడా తమ తమ జిల్లాల్లో పర్యటించాలంటే హెలికాప్టర్ తీయాలంటున్నారు. ఈ తీరు ఇలాగే ఉంటే రాష్ట్ర ప్రభుత్వం సీఎం కోసం ఒకటి, మంత్రుల కోసం మరొక హెలికాప్టర్ ను కొనాల్సిన పరిస్థితి వస్తుందేమో? అంటూ సెటైర్ వేసుకుంటున్నారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram