ఐకాన్ స్టార్.. సినీనటుడు అల్లు అర్జున్‌కు సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించిన కేసులో నాంపల్లి కోర్టు శుక్రవారం సమన్లు జారీ చేసింది. సోమవారం విచారణకు రావాలని పేర్కొంది. ఈ ఘటనలో చిక్కడి పల్లి పోలీసులు అల్లు అర్జున్ ఏ11గా.. సంధ్య థియేటర్ యాజమాన్యాన్ని ఏ1 నుంచి ఏ10 వరకు నిందితులుగా చేర్చారు. ఇప్పటికే 23 మందిని నిందితులుగా చేర్చి పోలీసులు ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. ఇప్పటి వరకు ఈ కేసులో 19 మందికి సమన్లు జారీ చేసిన న్యాయస్థానం.. అల్లు అర్జున్ వ్యక్తిగతంగా హాజరు కావాలని నోటీసుల్లో ఆదేశించింది. నిందితుల వ్యక్తి గత హాజరు తరువాత ఈ కేసులో నాంపల్లి కోర్టు ట్రయల్ ప్రారంభించనుంది.
2024 డిసెంబర్ 4న పుష్ప-2 రిలీజ్ ముందు రోజు బెనిఫిట్ షో సందర్భంగా హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట జరిగింది. రేవతి అనే మహిళ మృతి చెందగా.. కుమారుడు శ్రీతేజకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు అల్లు అర్జున్‌ను అరెస్టు చేసి నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. విచారణ జరిపిన కోర్టు ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో అతడిని చర్లపల్లికి జైలుకు తరలించారు. ఈ నేపథ్యంలోనే అల్లు అర్జున్ హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు మొదట నాలుగు వారాల మధ్యంతర బెయిల్, ఆ తర్వాత రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది.
ఘటన తర్వాత రేవతి కుటుంబానికి అల్లు అర్జున్ అండగా నిలిచారు. శ్రీ తేజ వైద్య ఖర్చులకు సాయం అందిస్తున్నారు. ప్రస్తుతం శ్రీతేజ కోలుకుంటున్నారు.