రేవంత్ రెడ్డి పాలన ఢిల్లీకి నజరానా.. రైతులకేమో జరిమానా: హరీశ్ రావు

ధాన్యం కొనుగోళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని హరీశ్ రావు ఆరోపించారు. రైతులు వడ్ల కుప్పల వద్ద ప్రాణాలు కోల్పోతున్నా సీఎం రేవంత్ రెడ్డి పట్టించుకోవడం లేదని మండిపడ్డారు.

రేవంత్ రెడ్డి పాలన ఢిల్లీకి నజరానా.. రైతులకేమో జరిమానా: హరీశ్ రావు

సీఎం రేవంత్ రెడ్డి పాలన ఢిల్లీకి నజరానా.. రైతులకేమో జరిమానా అన్నట్టుగా తయారైందని బీఆర్ఎస్ మాజీ మంత్రి టి.హరీశ్ రావు విమర్శించారు. పండించిన ధాన్యం కొనే దిక్కులేక, వడ్ల కుప్పల మీదే రైతులు ప్రాణాలు విడుస్తున్నా.. సీఎం రేవంత్ రెడ్డికి కనీస కనికరం లేదు అని ఆరోపించారు. ఏసీ రూముల్లో కూర్చుని ధాన్యం కొనుగోలు అంతా సజావుగా సాగుతుందంటూ అబద్ధాలు చెప్పే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి.. చౌటుప్పల్ మార్కెట్‌కు వచ్చి రైతుల గోస వినాలని డిమాండ్ చేశారు. గురువారం యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ వ్యవసాయ మార్కెట్‌లో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన మాజీ మంత్రి హరీష్ రావు వడ్ల కుప్పల వద్దనే రోజుల తరబడి రైతుల నిరీక్షణ, ఆవేదనను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. నెల రోజులైనా వడ్లు కొనడం లేదని, తరుగు పేరుతో దోచుకుంటున్నారని రైతులు హరీశ్ రావుకు తమ సమస్యలను ఏకరవు పెట్టారు. కల్లాల్లో తడిసిన వడ్ల కుప్పలను పరిశీలించిన హరీశ్ రావు, రైతులకు ధైర్యం చెప్పారు. అకాల వర్షాల భయంతో ఆందోళన చెందుతున్న రైతులకు ధైర్యం చెప్పారు.

ఏసీ రూమ్ లో కాదు… కొనుగోలు కేంద్రాలకు వచ్చి మాట్లాడండి

ఈ సందర్బంగా హరీశ్ రావు మాట్లాడుతూ. .రాష్ట్రవ్యాప్తంగా వడ్ల కొనుగోలులో ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం వహిస్తోందన్నారు.
కేసీఆర్ ప్రభుత్వంలో వడ్ల కొనుగోళ్లలో ఏనాడూ ఇంతటి దారుణ పరిస్థితులు లేవన్నారు. కాంగ్రెస్ పాలనలో రైతులకు యూరియా, రైతుబంధు, సాగునీరు, కరెంటు, చివరికి పండిన పంట అమ్ముకునే దాకా అడుగడుగునా ఇబ్బందులే ఎదురవుతున్నాయన్నారు. జిల్లా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నిన్న ప్రెస్ మీట్ పెట్టి మేం చాలా బాగా వడ్లు కొంటున్నాం, ఎవరికీ ఇబ్బంది లేదు అని గొప్పలు చెప్పారని, నేను మీలా.. ఏసీ రూమ్‌లో కూర్చుని మాట్లాడటం లేదు. నీ జిల్లాలోని చౌటుప్పల్ మార్కెట్లో రైతుల మధ్య నిలబడి మాట్లాడుతున్నానని హరీశ్ రావు గుర్తు చేశారు. ఇక్కడి రైతు తల్లీ, చెల్లెలు వడ్లు మార్కెట్ కు తెచ్చి 24 రోజులైందని… 30వ తేదీన మాయిశ్చర్ చూసి పాస్ అన్నాక కూడా 8 రోజులుగా కాంటా పెట్టే దిక్కే లేదు అని ఆరోపించారు. 44 డిగ్రీల ఎండలో రైతులు నెల రోజులుగా పడిగాపులు కాస్తూ, పిట్టల్లాగా రాలిపోతున్నారు. ఇది పూర్తిగా మీ ప్రభుత్వ చేతగానితనమేనని హరీశ్ రావు విమర్శించారు.

తరుగు తీస్తున్నారు…తోలు తీస్తా అన్న రేవంత్ ఎక్కడా..?

మాయిశ్చర్ చూడటానికి పది రోజులు, సంచులివ్వడానికి వారం, కాంటాకు వారం, మిల్లుకు వెళ్లడానికి మరో వారం పడుతోందని, తీరా మిల్లుకు వెళ్లాక తాలు ఉందని చెప్పి లారీకి 4, 5 బస్తాలు కటింగ్ పెడుతున్నారని, అటు మార్కెట్లో తరుగు, ఇటు మిల్లులో కోత.. అసలు మీకు వడ్లు కొనడం చేతవుతోందా? అని హరీశ్ రావు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. 69 సార్లు ఢిల్లీకి పోయి కప్పం కట్టే బదులు రైతులను పట్టించుకోండయ్యా అంటూ రేవంత్ రెడ్డిపై సెటైర్లు వేశారు. తరుగు పెడితే తోలు తీస్తా అన్న సీఎం.. ఇప్పుడు ఎవరి తోలు తీస్తాడో చెప్పాలని.. ప్రతి బస్తాకు 2-3 కిలోల తరుగు తీస్తుంటే ఏం చేస్తున్నారు? అని నిలదీశారు. ధాన్యం కొనుగోళ్లు గాలికి వదిలేసి, యూరియా అమ్మకాలపై నిషేధం పెట్టి ‘రైతు వారోత్సవాలు’ చేయడం సిగ్గుచేటు అని ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.
మంచిర్యాలలో అకాల వర్షాలకు గోడ కూలి వడ్ల కుప్పల వద్ద ముగ్గురు రైతులు, కొడుకు చనిపోయారని, నల్గొండ జిల్లాలో వడ్ల కుప్పల మీదనే రైతు గుండె ఆగి చనిపోయాడు. ఇంకెంత మంది బలైతే మీకు సోయి వస్తుంది? అని హరీశ్ రావు నిలదీశారు.

సిగ్గులేకుండా రైతు భరోసా వారోత్సవాలు

బీఆర్ఎస్ హయాంలో మేము 75 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొన్నాము. మీరు కొనడం చేతగాక అబద్ధాలు చెబుతున్నారన్నారు. నేను మార్కెట్‌కు వస్తున్నానని తెలిసి ఈరోజు 4, 5 లారీలు పంపించారు.. మేమొస్తే తప్ప మీరు లారీలు పంపరా అని ప్రశ్నించారు. రైతు భరోసా వారోత్సవాలు అని సిగ్గులేకుండా సంబరాలు చేస్తున్నారు. ఎకరాకు చొప్పున విడతల వారీగా విదిలిస్తూ సంబరాలు ఏ మొహం పెట్టుకుని చేస్తున్నారు? అని, రైతుబంధు, యూరియా, రుణమాఫీ, కొనుగోళ్లు అన్నీ ఎగ్గొట్టినందుకు చేస్తున్నారా ఈ వారోత్సవాలు? అని విమర్శించారు. కేసీఆర్ కరెంటు, సాగునీరు, రైతుబంధు ఇచ్చి వ్యవసాయాన్ని పండుగ చేశారు. కానీ మీరు ధాన్యం కొనకుండా జాప్యం చేసి, రైతులు దళారులకు అగ్గువకు అమ్ముకునేలా కుట్ర చేస్తున్నారని ఆరోపించారు.

యూరియా అమ్మకాలపై ఆంక్షలు రేవంత్ సర్కార్ ఘనత

రాష్ట్ర, దేశ చరిత్రలో యూరియా అమ్మకాలపై ఆంక్షలు విధించిన ఏకైక ఘనత రేవంత్ రెడ్డి సర్కార్‌దేనని హరీశ్ రావు విమర్శించారు. కూరగాయలు, ఆయిల్ పామ్ పండించే రైతులకు యూరియా అమ్మొద్దని బోర్డులు పెట్టడం మీ ప్రభుత్వ మూర్ఖత్వానికి నిదర్శనం అని దుయ్యబట్టారు. మొక్కజొన్నలు, సన్ ఫ్లవర్ కొని నెలలు దాటుతున్నా రైతులకు ఒక్క రూపాయి వేయలేదు అన్నారు. జొన్నలు, శనగలు కొననే లేదు. కానీ 48 గంటల్లో పైసలు వేస్తున్నామని పచ్చి అబద్ధాలు ఆడుతున్నారని విమర్శించారు.

ఇవి కూడా చదవండి :

తమిళనాడులో మారుతున్న పరిణామాలు..మరోసారి గవర్నర్‌ వద్దకు విజయ్
King Cobra | హైద‌రాబాద్‌కు అల‌వాటు ప‌డ్డ నాగుపాములు..! చంపొద్దంటున్న ల‌వ‌ర్స్‌..!!