కేటీఆర్ ఆహ్వానం.. బీఆర్ఎస్‌లోకి జీవన్ రెడ్డి !
కేటీఆర్ ఆహ్వానంతో మాజీ మంత్రి జీవన్ రెడ్డి బీఆర్ఎస్‌లో చేరనున్నట్లు ప్రకటించారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ మార్పు అవసరమని వ్యాఖ్యానించారు.
విధాత : కాంగ్రెస్ పార్టీ నాలుగు దశాబ్ధాల అనుబంధం తెంచుకున్న మాజీ మంత్రి టి.జీవన్ రెడ్డి బీఆర్ఎస్ చేరనున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గురువారం స్వయంగా జగిత్యాలలోని జీవన్ రెడ్డి ఇంటికి వెళ్లి అయనను బీఆర్ఎస్ లోకి ఆహ్వానించారు. కేటీఆర్ వెంట మాజీ మంత్రులు గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్ లు కూడా ఉన్నారు. జగిత్యాలకు వచ్చిన కేటీఆర్ కు బీఅర్ఎస్ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. కేటీఆర్ తన వెంట సాగిన పార్టీ శ్రేణుల భారీ ర్యాలీతో వెళ్లి జీవన్ రెడ్డిని బీఆర్ఎస్ లోకి ఆహ్వానించారు. ఈ సందర్బంగా జీవన్ రెడ్డి పార్టీలో చేరిక కార్యక్రమం నిర్వహణపై చర్చించారు. జీవన్ రెడ్డి వద్దకు వెళ్లేముందుగా కేటీఆర్ ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో కేసీఆర్ తో భేటీ కావడం గమనార్హం.
రేవంత్ రెడ్డి ఓటమి ఖాయం : జీవన్ రెడ్డి
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఓటమి ఖాయం అని మాజీ మంత్రి టి.జీవన్ రెడ్డి వ్యాఖ్యానించారు. కేటీఆర్ తన ఇంటికి వచ్చే ముందు జీవన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. రెండున్నరేండ్ల సీఎం రేవంత్ రెడ్డి పాలన చూసిన తర్వాత ప్రజలు రేవంత్ పాలన కంటే పెద్ద మనిషి కేసీఆర్ పాలన బాగుందన్న భావనతో ఉన్నారన్నారు. రేవంత్ పోవాలి మార్పు రావాలని ప్రజలు మార్పు కోరుకుంటున్నారన్నారు. 10 సంవత్సరాల కేసీఆర్ పాలనకు నేడు తిరోగమనం నడుస్తుందని వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వం సమాజంలో అతిపెద్ద వర్గమైన రైతాంగానికి పెద్దపీట వేసి భారీ ప్రయోజనాలు అందించిందని, రేవంత్ రెడ్డి పాలనలో పంట రుణమాఫీ అందరికి అందలేదని, రైతు భరోసా సకాలంలో వేయడం లేదని, సన్న వడ్ల బోనస్ నామమాత్రమైందని, ప్రకృతి వైపరిత్యాలతో నష్టపోయిన ప్రతి రైతులను కేసీఆర్ ఆదుకుంటే కాంగ్రెస్ పాలనతో అలాంటి పరిహారం అందలేదన్నారు. కల్యాణ లక్ష్మి, కేసీఆర్ కిట్, రైతు బంధు, రైతు బీమా వంటి పథకాలను కేసీఆర్ అందించిందని గుర్తు చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయలేకపోయిందని, ఫించన్లను పెంచలేదని, ఒక్క కొత్త పించన్ ఇవ్వలేదని, ఉద్యోగులను, నిరుద్యోగులను ఏనాడు పట్టించుకోలేదు అని జీవన్ రెడ్డి విమర్శించారు. ఉద్యోగుల డిమాండ్లు, బెన్ ఫిట్లు, ఫీజు రీయంబర్మెంట్స్, జాబ్ క్యాలెండర్, ఆర్టీసీకి, సింగరేణికి ఇచ్చిన హమీలు ఏవి అమలు కాలేదన్నారు. ప్రాణహిత చేవేళ్ల చేపట్టలేదని గుర్తు చేశారు. జనాభా లెక్కలు సేకరించి బయటపెట్టలేదన్నారు.
ప్రజలు కేసీఆర్ 10 సంవత్సరాల పాలన తర్వాత బెటర్ పాలన కావాలని కాంగ్రెస్ ప్రభుత్వానికి అవకాశం ఇచ్చారు అని, కాంగ్రెస్ కు ప్రచార ఆర్భాటాలు తప్ప ప్రజాహితంగా కార్యక్రమాలు నిర్మాణాత్మకంగా అమలు చేయలేకపోవడంతో ప్రజల్లో అసంతృప్తి నెలకొందని జీవన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. అందుకే ప్రజలు మార్పు కోరుతున్నారన్నారు. బీజేపీ జాతీయ స్థాయిలో బాగానే ఉందని..అయితే రాష్ట్రస్థాయిలో పోల్చుకుంటే ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమించిన నాయకుడు కేసీఆర్ అని, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కల సాకారమైంది కేసీఆర్ తోనే.. దీన్ని ఎవరు విస్మరించలేరు అన్నారు. నేను బీఆర్ఎస్ లో చేరడం కోసం నిర్ణయం తీసుకోవడం జరిగిందని, దీనికి కార్యరూపం ఏవిధంగా ఉండాలనేది కేటీఆర్ నిర్ణయిస్తారు అని తెలిపారు.
ఇవి కూడా చదవండి :
మంత్రి పొంగులేటి మాటలన్ని అబద్దాలే : హరీశ్ రావు
Samantha | విడాకుల తర్వాత కూడా అక్కినేని కుటుంబానికి అండగా సమంత… సుప్రియపై పోస్ట్ వైరల్!
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram