ప్రభుత్వం నుంచి ధాన్యాన్ని తీసుకొని…కస్టమ్ మిల్లింగ్ రైస్(సీఎంఆర్) ఇవ్వకుండా.. ధాన్యాన్ని పక్కదారి పట్టించిన మిల్లర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారుకు స్పష్టం చేశారు. అక్రమాలకు పాల్పడిన మిల్లులను సీజ్ చేయాలని ఆదేశించారు. సీజ్ చేసిన మిల్లులను మహిళా సంఘాల ఆధ్వర్యంలో నడిపించాలని అధికారులకు సీఎ: రేవంత్ రెడ్డి సూచించారు. ఎంసీఆర్ హెచ్ ఆర్ డీ బోధి పెవిలియన్ లో పౌరసరఫరా శాఖ అంశాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ చైర్మన్ స్టీఫెన్ రవీంద్ర,సీఎంఓ ముఖ్య కార్యదర్శి శేషాద్రి,ఇతర ఉన్నతాధికారులు ఈ సమీక్షకు హాజరయ్యారు.
సీఎంఆర్ ఇవ్వడంలో డిఫాల్ట్ అయిన రైస్ మిల్లర్ల నుండి బకాయిలను వసూలు చేయాలని, బకాయిల వసూలుకు ఒక విధానాన్ని రూపొందించాలని, కేబినెట్ సబ్ కమిటీలో దీని పైన చర్చించి నిర్ణయం తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. బకాయిల వసూలే ప్రధాన లక్ష్యంగా చర్యలు ఉండాలి అని, మిల్లర్ల బ్లాక్ మెయిల్ ను సహించబోనని రేవంత్ హెచ్చరించారు.
మార్కెట్ లో ఉన్న గోడౌన్ లను పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని, అవసరమైతే మిల్లింగ్ బాధ్యతల్ని మహిళా సంఘాలకు బాధ్యతలు అప్పగిస్తామని, 5 నియోజక వర్గాల్లో మహిళా సంఘాలకు 50 నుంచి 100ఎకరాల్లో గోడౌన్ ల నిర్మాణం కోసం పైలట్ ప్రాజెక్టు చేపట్టాలని సూచించారు. ధాన్యం ఎక్కువ దిగుబడి అయ్యే ప్రాంతాలను పైలట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేయాలని రేవంత్ సూచించారు. గోడౌన్ ల నిర్మాణంలో గ్రామీణ ఉపాధి హామీ పథకంలో నిధులను వినియోగించు కోవాలనొ, ప్రతి జిల్లాకు నోడల్ అధికారిని నియమించాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు.