నది జలాల విషయంలో తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ద్రోహం, మోసం చేస్తుందని, పాలమూరు బిడ్డనని చెప్పుకునే సీఎం రేవంత్ రెడ్డి కన్న తల్లి..నేల తల్లి తెలంగాణకు ద్రోహం చేస్తున్నాడని మాజీ మంత్రి, ఎమ్మెల్యే జీ జగదీష్ రెడ్డి మండిపడ్డారు. తెలంగాణ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. సమావేశంలో తను పోతిరెడ్డి పాడు సందర్శించి పరిశీలించిన నీటి తరలింపు విషయాల వీడియోలను ప్రదర్శించారు. రెండు నెలలుగా గోదావరి జలాల ఎత్తిపోతలకు డిమాండ్ చేస్తూ…ఏపీ అక్రమ ప్రాజెక్టులపై బీఆర్ఎస్ పోరాటం చేస్తుంటే … రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుందని విమర్శించారు. గోదావరి, కృష్ణా జలాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరలించుకుని పోతుంటే , రేవంత్ రెడ్డి మౌనంగా ఉంటున్నాడని దుయ్యబట్టారు.
చంద్రబాబుకు తొత్తులా మారిన రేవంత్
తెలంగాణ రాష్ట్రానికి చెందిన 7 ప్రాజెక్టులపై రివ్యూ చెయ్యాలని గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు(GRMB) అజెండాలో పొందుపరిచారని, దీనిని నిరసిస్తూ జీఆర్ఎంబీ సమావేశాన్ని బహిష్కరించాలని జగదీష్ రెడ్డి డిమాండ్ చేశారు. లేదంటే బీఆర్ఎస్ మరోసారి జల ఉద్యమాలు నిర్వహిస్తుందని హెచ్చరించారు. సీఎం రేవంత్ రెడ్డి తన గురువు ఏపీ సీఎం చంద్రబాబుకు తొత్తుగా మారి తెలంగాణకు ద్రోహం చేస్తున్నారని విమర్శించారు. చంద్ర బాబు నాయుడును చూస్తే ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, దామోదర రాజనర్సింహ ఎందుకు లాగులు తడుపుకుంటున్నారన్నారు. నా ముందు మాట్లాడే దైర్యం తెలంగాణ ప్రభుత్వానికి లేదనే చంద్రబాబు జీఆర్ఎంబీలో తెలంగాణ ప్రాజెక్టులతో అజెండా పొందుపరిచాడని విమర్శించారు. జీఆర్ఎంబీ పరిధిలో మనం కట్టి పూర్తి చేసుకున్న 7 ప్రాజెక్టుల మీద రివ్యూ చేయాలని చంద్రబాబు నాయుడు లెటర్ రాస్తే వాళ్లు అజెండాలో పెట్టారు అని ఆరోపించారు.
అజెండా నుంచి తీయకపోతే గులాబీ సైన్యం తడఖా చూపిస్తాం..
తెలంగాణలో 7 ప్రాజెక్ట్ లకు టీఏసీ అనుమతులు పొందినట్లు ఉత్తమ్ కుమార్ రెడ్డికి తెలియదా…అని జగదీష్ రెడ్డి ప్రశ్నించారు. తెలంగాణ ప్రాజెక్టుల మీద చంద్రబాబు నాయుడు కుట్ర చేస్తున్నాడని, దీని మీద మాట్లాడడానికి సీఎం రేవంత్ రెడ్డికి, ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి, మంత్రులకు సోయి లేదు అని విమర్శించారు. దీని గురించి మేము మాట్లాడితే మా మీద ఎదురుదాడి చేస్తున్నారని, నిన్న కేటీఆర్ వార్నింగ్ ఇచ్చిన తర్వాత, ప్రాజెక్టులపై రివ్యూ ఉపసంహరించుకోవాలని ఇరిగేషన్ ఈఎన్సీతో లెటర్ పెట్టించారు అని వెల్లడించారు. రేవంత్ రెడ్డికి డబ్బా కొట్టే బీజేపీ ఎంపీలు అజెండానే రాలేదు అని మాట్లాడుతున్నారు అని, మరి ఈఎన్సీ లెటర్ ఏంటి? అని జగదీష్ రెడ్డి ప్రశ్నించారు. జీఆర్ఎంబీ అజెండాలో 7 ప్రాజెక్టుల మీద రివ్యూ అంశం తీసెయ్యకపోతే మా బీఆర్ఎస్ సైన్యం ఈ మీటింగ్‌కు హాజరై మీ సంగతి తెలుస్తామని హెచ్చరించారు.
సాగర్ కు నీళ్లు ఇవ్వకుండానే..పోతిరెడ్డి పాడుకు తరలింపునా?
నాగార్జున సాగర్ నిండేంత వరకు పోతిరెడ్డిపాడు నీళ్లు తీసుకొని పోవడానికి వీల్లేదని, ఎవరి ఆదేశాలతో పోతిరెడ్డిపాడు నుంచి ఏపీకి నీళ్లు తరలిస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని జగదీష్ రెడ్డి నిలదీశారు. చంద్రబాబు నాయుడు కోసమే కాళేశ్వరం ప్రాజెక్టును రేవంత్ రెడ్డి ఎండబెట్టాడని, చంద్ర బాబు నాయుడు దగ్గర రేవంత్ రెడ్డి లొంగిపోయి కుక్కలా బ్రతుకుతున్నాడని ఫైర్ అయ్యారు. ఎల్‌నినో ప్రభావంతో తాగునీటి సమస్య ఉంటే…. పోతిరెడ్డిపాడుకు నీళ్లు ఎలా పోతున్నాయని ప్రశ్నించారు. కేసీఆర్ హయాంలో ఆనాడు శ్రీశైలం ఎగువన 10 నుంచి 12 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చాడు. ఈ ప్రభుత్వంలో ఒక్క ఎకరాకు నీళ్లు ఇచ్చే పరిస్థితి లేకుండా పోయిందన్నారు.
వరుణ యాగం…కాదు పోతిరెడ్డి పాడు గేట్లు బంద్ చేయాలి
నాగార్జున సాగర్ దగ్గర వరుణ యాగం చెయ్యడం కాదు… దమ్ముంటే పోతిరెడ్డిపాడు గేట్లు బంద్ చెయ్యాలని సీఎం రేవంత్ రెడ్డిని జగదీష్ రెడ్డి డిమాండ్ చేశారు. నాగార్జున సాగర్ కు ఇంతవరకు ఒక్క చుక్క నీరు రాలేదు అన్నారు. ఎగువ నుంచి కృష్ణాకు బ్రహ్మాండంగా నీళ్లు వస్తుంటే, ఈ ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉంటుందని జగదీష్ రెడ్డి విమర్శించారు. నాగార్జున సాగర్‌లో నీళ్లున్న రైతులకు నీళ్లు ఇవ్వమని జిల్లా మంత్రి మాట్లాడుతున్నాడని, ఇప్పటికే పాలమూరుకు మొదటి పంట పండించుకునే అవకాశం ఉంది. ఈ ప్రభుత్వ దుర్మార్గానికి ఇంతవరకు ఒక్క ఎకరానికి నీళ్లు ఇచ్చే పరిస్థితి లేకుండా పోయిందన్నారు.నాగార్జున సాగర్ కు చుక్క నీరు రాకుండా, పోతిరెడ్డిపాడుకు నీళ్లు తరలిస్తున్నారు. 25 వేల క్యూసెక్కుల నీళ్లు పోతిరెడ్డిపాడు నుంచి తరలిస్తుంటే.. నాగార్జున సాగర్ చుక్క నీరు వచ్చే పరిస్థితి లేదు అని ఆందోళన వ్యక్తం చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు నీళ్లు ఇవ్వకుండా పెద్ద కుట్ర చేస్తుంది.రైతులు ఆరుతడి పంటలు వేసుకోండని అంటున్నారు…ఆరుతడి పంటలకైనా నీళ్లే కావాలి కదా అన్నారు. కేసీఆర్ హయాంలో నాగార్జున సాగర్ ఎడమ కాలువ క్రింద బ్రహ్మాండంగా రైతులకు నీళ్లు ఇచ్చాము. ఈ ప్రభుత్వానికి రైతుల పట్ల సోయి ఉంటే రెండు పంటలకు నీళ్లు ఇవ్వొచ్చు. మంత్రి శ్రీధర్ బాబుకు చీము రక్తం ఉంటే సిగ్గు తప్పిన మాటలు మాట్లాడకూడదని విమర్శించారు.
ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యేలు గాదరి కిషోర్ కుమార్, కంచర్ల భూపాల్ రెడ్డి, నోముల భగత్, నల్లమోతు భాస్కర్ రావు, ఎమ్మెల్సీ కోటిరెడ్డి, మాజీ కార్పొరేషన్ చైర్మన్ పల్లె రవి కుమార్, బిఆర్ఎస్ నేతలు వంటెద్దు నరసింహారెడ్డి, కడారి అంజయ్య పాల్గొన్నారు
తెలంగాణ ప్రభుత్వ చేతకానితనంతో కృష్ణా నదీ జలాలను పోతిరెడ్డిపాడు నుండి ఏపీ ఎలా తీసుకొని వెళ్తుందో ఆధారాలతో వీడియో… pic.twitter.com/pjo94zHS5G
— Jagadish Reddy G (@jagadishBRS) August 12, 2026