• Telugu News
  • /National

దుమారం రేపుతున్న అయోధ్య రామ మందిరం విరాళాల చోరీ !

అయోధ్య రామమందిరం విరాళాల చోరీ ఆరోపణలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. రూ.200 కోట్ల విరాళాల మాయం, నగలు-ఆభరణాల అక్రమాలపై సిట్ నివేదికను యూపీ ప్రభుత్వానికి సమర్పించింది.

Reported by: Tejaswini Nanna | జాతీయం | Jun 24, 2026, 4:22 pm IST
Read Time: 11 mins
దుమారం రేపుతున్న అయోధ్య రామ మందిరం విరాళాల చోరీ !

అయోధ్య రామమందిరం నుండి కోట్ల రూపాయల విరాళాలు చోరీకి గురైన వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ గా కొనసాగుతుంది. . సుమారు 200 కోట్ల రూపాయల నగదు చోరీ జరిగిందని అంటున్నారని, అలాగే వజ్రాలు, ఆభరణాలతో కూడిన అనేక కానుకలు కూడా అపహరణకు గురయ్యాయన్న ఆరోపణలు చోటుచేసుకున్నాయి. ఆలయ ప్రతిష్టను దెబ్బతీసే విధంగా ఉన్న విరాళాల చోరీ వ్యవహారంపై నిజానిజాలను తేల్చి దోషులను గుర్తించాలంటూ శ్రీ రామ్ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ అభ్యర్థన, ప్రతిపక్షాల డిమాండ్ మేరకు రామ మందిర విరాళాల వివాదంపై యోగి సర్కార్ సిట్ విచారణకు ఆదేశించిన సంగతి తెలిసిందే. ఓ వైపు సిట్ విరాళాల మాయంపై దాదాపు 150మంది వరకు విచారణ చేసి.. ప్రభుత్వానికి ప్రాథమిక నివేదిక అందచేసింది.

వెండి కాకాభూషండి విగ్రహం ఏమైంది?

ఇది ఇలా ఉండగా అనితా భరద్వాజ్ అనే మహిళ నుంచి రామ మందిర ట్రస్ట్ కు చెందిన చంపత్ రాయ్ తీసుకున్న ఒక వెండి కాకాభూషుండి విగ్రహాం ఎక్కడికి పోయిందంటూ ప్రశ్నిస్తున్న పోస్టు ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మందిరం లోపల కెమెరాలకు అనుమతి లేదని, ఫోటో-రసీదును తర్వాత వాట్సాప్ చేస్తానని చెప్పి ట్రస్ట్ కార్యదర్శి చంపత్ రాయ్ విరాళ దాత అనితా భరద్వాజ్ నుండి ఒక వెండి కాకాభూషుండి విగ్రహాన్ని తీసుకున్నారు. తను అందించిన విరాళంలపై ఆమె ఈ రోజుకీ ఉత్తరాలు రాస్తూనే ఉన్నారు, కానీ ట్రస్ట్ నుంచి ఎలాంటి స్పందన లేదు అని.. ఇప్పుడు ఆ విరాళం ఎక్కడికి పోయిందంటూ పోస్టులో ప్రశ్నిస్తున్నారు. త్రేతా యుగంలో శ్రీరాముడి అనుగ్రహంతో కాకాభూషుండి అమరత్వం పొందాడని, కానీ కలియుగంలో ఆ వెండి కాకాభూషుండి ఏ రసీద్ లేకుండా గాలిలో కలిసిపోయాడా? అంటూ ప్రశ్నిస్తున్న పోస్టు వైరల్ గా మారింది. మీలో ఎవరైనా ఈ వెండి కాకాభూషుండిని ఆలయ ప్రాంగణంలో చూశారా? లేదా, చంపత్ రాయ్ చెప్పినట్లుగా అది కేవలం కాగితాల మీదే ఉందా? అంటూ నిలదీస్తున్నారు.

200 కిలోల వెండి బంగారం విరాళం ఇచ్చాం..ఉందో లేదో?

తాము సింధీ సమాజ్ తరుపున అయోధ్య రామ మందిరానికి 200కిలోల వెండి, బంగారం ఇచ్చామని క్యాజిల్స్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్ డాక్టర్ రాజు వి.మన్వానీ వెల్లడించారు. చంపత్ రాయ్ అనే వ్యక్తికి ఆ వెండి కడ్డీలు ఇచ్చామని.. కానీ తమకు ఎలాంటి రసీదు ఇవ్వలేదని తెలిపాడు. తాము ఇచ్చినప్పుడు వెండి విలువ రూ.1.5-2 కోట్లు ఉంటే.. ఇప్పుడు దాని విలువ రూ.6-7 కోట్లకు చేరిందని వివరించాడు. విరాళాలు చోరీకు గురయ్యాయన్న వార్తలు విని వెండి కూడా చోరీకి గురైందా? అనే ఆందోళన నెలకొందని దీనిపై అధికారులు వాస్తవాలు వెల్లడించాలని కోరాడు. సింధీ సమాజ్ అందించిన విరాళాలపై ఇప్పటివరకు ఎలాంటి రశీదు అందలేదని, దీనిపై ట్రస్ట్ స్పందించడం లేదని విశ్వ సింధీ సేవా సంఘం ఆరోపించింది.

సిట్ విచారణలో కీలక అంశాలు

అయోధ్య రామ మందిరంలో విరాళాల దొంగతనం కేసులో లక్నో డివిజనల్ కమిషనర్ విజయ్ విశ్వాస్ పంత్, ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ కిరణ్ ఎస్, ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి నీల్ రతన్ ముగ్గురు సభ్యులతో కూడిన సిట్‎ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ వివాదంపై సమగ్ర దర్యాప్తు నిర్వహించి, నివేదిక సమర్పించాలని ప్రభుత్వం సిట్‎ను ఆదేశించింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ కేసును సీరియస్‎గా తీసుకున్న సిట్.. అయోధ్యలోని రామ మందిర ట్రస్ట్‎కు సంబంధించిన విరాళాలు, ఆర్థిక నిర్వహణపై లోతుగా విచారణ చేపట్టింది. 150 మంది అనుమానితులను సిట్ గుర్తించి ప్రశ్నించింది. విరాళాల నగదు, నగలు, కానుకల మాయమవడంపై వారిని ప్రశ్నించింది. సీసీ టీవీ ఫుటేజీలను పరిశీలించింది. అయితే సీసీ ఫుటేజీలు కొంత మాయం చేసినట్లుగా గుర్తించింది. ముఖ్యంగా మహాకుంభ మేళ సమయంలో రామమందిరంకు భక్తులు భారీగా విరాళాలు, కానుకలు సమర్పించారు. ఆ సమయంలో కేవలం 45రోజుల ఫుటేజీ మాత్రమే సిట్ కు లభించింది.

ప్రభుత్వానికి సిట్ నివేదిక అందచేత

తాజాగా విరాళాల అవకతవకలకు సంబంధించిన వివాదంలో ‘సిట్‌’ యూపీ ప్రభుత్వానికి తన దర్యాప్తు నివేదికను సమర్పించింది.ప్రస్తుతం సిట్ బృందం యూపీ ప్రభుత్వానికి సమర్పించిన 150 పేజీల నివేదిక ప్రాథమికమైనదని, మరింత దర్యాప్తు కోసం కొంత సమయం కావాలని కోరింది. ఈ వ్యవహారంలో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలని, ఆలయ ట్రస్ట్‌ను పునర్వ్యవస్థీకరించాలని, ఆలయానికి సీఈవోగా ఒక సీనియర్‌ అధికారిని నియమించాలని, ఆడిట్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని ‘సిట్‌’ తన నివేదికలో సిఫారసు చేసినట్టు సమాచారం. అయితే సిట్ ట్రస్ట్ కార్యదర్శి చంపత్ రాయ్ కి క్లీన్ చిట్ ఇచ్చిందా లేదా అన్నదానిపై ఆసక్తి నెలకొంంది. జూన్ 7న రామ మందిరంలో రూ.5 కోట్ల నుంచి రూ.7.5 కోట్ల వరకు విరాళాల డబ్బులు దొంగిలించారని యూపీ మాజీ మంత్రి పవన్ పాండే ఆరోపణలతో విరాళాల చోరీ వివాదం వెలుగులోకి వచ్చింది.

నివేదికపై ప్రభుత్వం నిర్ణయం ఏమిటన్నాదానిపై సర్వత్రా ఆసక్తి

సుమారు రూ. 200 కోట్ల మేర రామాలయం విరాళాలు చోరీ జరిగాయని ఆరోపణలు వచ్చాయి. భక్తులు సమర్పించిన బంగారం, వెండి, వజ్రాభరణాలను దొంగిలించారని, కొన్నింటిని నకిలీ వాటితో మార్చేశారని, హుండీల్లోని డబ్బులు చోరీకి గురయ్యాయని ఆరోపణలు ఉన్నాయి. దీనిపై ప్రతిపక్షాలు, ట్రస్ట్ సైతం విచారణ కోరడంతో యూపీ ప్రభుత్వం సిట్ విచారణకు ఆదేశించింది. ఐదుగురు ప్రధాన నిందితులు లవ్ కుష్ మిశ్రా, అవనీష్, అనుకల్ప్ మిశ్రా, కరుణే, రామ్ శంకర్ అలియాస్ తిన్ను యాదవ్ ఇచ్చిన సమాచారం ఆధారంగా సుమారు రూ.2 కోట్ల నగదును సిట్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. జూన్ 13న తిన్ను యాదవ్ ఇంట్లో బంగారం స్వాధీనం చేసుకున్నారు. గత 11నెలల్లో ఆలయ భద్రతా ఏర్పాట్ల కోసమే ఏకంగా రూ.10కోట్ల వరకు ఖర్చు చేసినట్లు దర్యాప్తులో తేలింది. అంత భారీగా నిధులు వెచ్చించినప్పటికీ, విరాళాల పెట్టెల నుంచి నగదు, నగలు మాయమవడం.. భద్రతా వ్యవస్థ వైఫల్యాన్ని ఎత్తిచూపుతోందని అధికారులు భావిస్తున్నారు. సిట్ నివేదిక నేపథ్యంలో రామమందిరం విరాళాల మాయం కేసులో యూపీలోని సీఎం యోగి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది ఆసక్తికరంగా మారింది.