అయోధ్య రామ మందిరం విరాళాల కేసులో కీలక మలుపులు!

అయోధ్య రామమందిర విరాళాల కేసులో ఎస్‌ఐటీ దర్యాప్తు కీలక మలుపు తిరిగింది. 8 మంది అరెస్ట్ కాగా, ట్రస్ట్‌లో రాజీనామాలు చర్చనీయాంశంగా మారాయి.

Reported by: Tejaswini Nanna | జాతీయం | Jun 26, 2026, 2:44 pm IST
Read Time: 5 mins
అయోధ్య రామ మందిరం విరాళాల కేసులో కీలక మలుపులు!

అయోధ్యలోని బాల రామమందిరానికి వచ్చిన విరాళాల కుంభకోణం వివాదంలో కీలక మలుపులు చోటుచేసుకున్నాయి.విరాళాల దుర్వినియోగం వ్యవహారంపై వెల్లువెత్తిన ఆరోపణలను తేల్చేందుకు సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) సమర్పించిన నివేదిక మేరకు పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. విరాళాల లెక్కింపు ప్రక్రియలో అక్రమాలకు పాల్పడినట్లు తేలిన ఎనిమిది మంది నిందితులను పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు. అరెస్టయిన నిందితులను పోలీసులు ప్రస్తుతం తమ ఆధీనంలోకి తీసుకుని, దాదాపు రూ.200కోట్ల విరాళాలు, ఆభరణాలు, కానుకల మాయం వెనుక ఉన్న పూర్తి నెట్‌వర్క్‌ను ఛేదించేందుకు లోతుగా విచారిస్తున్నారు.

అయోధ్య ట్రస్టు జనరల్‌ సెక్రటరీ చంపత్‌రాయ్‌ రాజీనామా

అయోధ్య విరాళాల మాయంపై కేసు నమోదు నేపథ్యంలో అయోధ్య ట్రస్టు జనరల్‌ సెక్రటరీ చంపత్‌రాయ్‌, ట్రస్టు సభ్యుడు అనిల్‌మిశ్రా రాజీనామా చేశారు. ఇటీవల చంపత్‌రాయ్‌ డ్రైవర్ టిన్ను యాదవ్‌ను అరెస్టు చేసిన పోలీసులు వివరాలు సేకరించారు. ఈనేపథ్యంలో వీరిద్దరూ రాజీనామా చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. రూ.7.5నుంచి 8కోట్ల మేరకు విరాళాలు, ఆభరణాలు, వజ్రాభరణాల కానుకుల మార్పు, మాయంపై ఇప్పటికే విచారణాధికారులు పక్కా ఆధారాలు సేకరించారు. విచారణలో సీసీ ఫుటేజీ మాయం వ్యవహారాన్ని గుర్తించారు.

నిందితులపై కఠిన చర్యలు : సీఎం యోగి

అయోధ్య రామమందిర విరాళాల అపహరణ కుంభకోణంపై ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఘాటుగా స్పందించారు. సనాతన ధర్మం, కోట్ల మంది ప్రజల నమ్మకానికి అయోధ్య ఒక పవిత్రమైన చిహ్నం. అటువంటి పవిత్రమైన నమ్మకంతో ఆడుకోవాలని చూసే లేదా దానికి విఘాతం కలిగించే ఎంతటి వారినైనా సరే వదిలిపెట్టే ప్రసక్తే లేదు అని ఆయన తీవ్రంగా హెచ్చరించారు. ప్రజల మతపరమైన సెంటిమెంట్లతో, నమ్మకాలతో చెలగాటమాడితే సహించేది లేదని ఆయన స్పష్టం చేశారు. యూపీలోని దేవరియాలో జరిగిన ఓ బహిరంగ సభలో యోగి మాట్లాడుతూ అయోధ్య విరాళాల మాయం వివాదంపై స్పందించారు.

శివసేన 4కిలోల వెండి ఇటుక ఏమైంది: సంజయ్ రౌత్

అయోధ్య రామాలయం నిర్మాణం కోసం శివసేన పార్టీ కార్యకర్తల ద్వారా విరాళాలు సేకరించి పార్టీ అధినేత ఉద్దవ్ థాక్రే ఇచ్చిన 4కిలలో వెండి ఇటుక, కోటి రూపాయల విరాళాలు అందించారని..దీనిపై ఇప్పటికి ట్రస్ట్ నుంచి ఎలాంటి రశీద్ అందలేదని శివసేన (యూబీటీ) సీనియర్ నేత సంజయ్ రౌత్ ఆరోపించారు. అసలు ఆ వెండి ఇటుక ఏమైందో ప్రభుత్వం, ట్రస్ట్ వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు.